మణుగూరు : మణుగూరు మండలంలో ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన 1080 మెగా వాట్ల విద్యుత్ పవర్ ప్లాంట్ నిర్మాణ స్థలాన్ని గురువారం ఢిల్లీకి చెందిన బీహెచ్‌ఈఎల్(భెల్) బృందం జిల్లా జేసీ సురేంద్రమోహన్‌తో కలిసి పరిశీలించింది. భెల్ సీనియర్ ఇంజనీర్ శ్రీనివాసరావు, సీనియర్ మేనేజర్ మధుసూదన్‌రావు, డిప్యూటీ మేనేజర్ అనిల్‌కండల్‌వాలా, సీనియర్ ఇంజనీర్ సోయబ్‌దుగ్గల్‌లు మండలంలోని రామానుజవరం పంచాయతీ చిక్కుడుగుంట, దమ్మక్కపేట, సాంబాయిగూడెం గ్రామాల్లో భూమిని , గోదావరి పరిసర ప్రాంతాలను పరిశీలించారు.
భూ పరిశీలన పనులకు జేసీ శంకుస్థాపన చేశారు. అనంతరం భెల్ బృందానికి పవర్ ప్రాజెక్టు స్థలానికి సంబంధించిన వివరాలను ఆయన తెలిపారు. ఈ భూములను పరిశీలించిన భెల్ అధికారులు ప్రభుత్వం తర్వగా భూమి అప్పగిస్తే వెంటనే ప్రాజెక్టు నిర్మాణం చేపడతామని అన్నారు. రెండు సంవత్సరాల్లోనే ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. అనంతరం ఆయా గ్రామాల రైతులనుద్దేశించి జేసీ మాట్లాడారు. ప్రాజెక్టు పరిధిలో 477 ఎకరాల పట్టా భూమిలో 374 మంది రైతులు ఉన్నారని అన్నారు.
అసైన్‌మెంట్ భూమి 240 ఎకరాల్లో 169 మంది రైతులు ఉన్నారని, ప్రభుత్వ భూమి 400 ఎకరాలు ఉందని అన్నారు. భూమి కోల్పోతున్న రైతులకు తగిన విధంగా పరిహారం అందిస్తామని, నిర్వాసిత గిరిజనులకు, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి చేపడుతున్న ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అందరూ సహకరించాలని అన్నారు.
త్వరలో గ్రామసభలు నిర్వహించి ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తామని, డిసెంబర్‌లోగా ప్రజాసేకరణ పూర్తి చేసి స్థలాన్ని అప్పగిస్తే నిర్మాణ పనులు వెంటనే ప్రారంభిస్తారని అన్నారు. పరిహారం గురించి రైతులు ఆందోళన చెందవద్దని, ఏ మాత్రం అన్యాయం జరుగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ ఆర్డీఓ వెంకటేశ్వర్లు, మణుగూరు తహశీల్దార్ శ్రీనివాసులు, కేటీపీఎస్ ఎస్‌ఈ రాంప్రసాద్‌లతో పాటు స్థానిక ఆర్‌ఐలు, వీఆర్‌ఓలు పాల్గొన్నారు.
‘పవర్‌ప్లాంట్’ స్థల పరిశీలన
Published Fri, Sep 26 2014 2:41 AM | Last Updated on Sat, Sep 2 2017 1:57 PM
Advertisement
Advertisement