పోలీస్ శాఖలో భారీగా పోస్టుల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ రాబోతోంది.
13వేలకుపైగా పోస్టుల మంజూరుకు ప్రతిపాదనలు
సాక్షి, హైదరాబాద్: పోలీస్ శాఖలో భారీగా పోస్టుల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ రాబోతోంది. నూతన జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో మరిన్ని అదనపు పోస్టులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి డీజీపీ అనురాగ్‌శర్మ ప్రతిపాదనలు పంపారు. కొత్త జిల్లాలకు సంబంధించి ఎస్పీ పోస్టుల నుంచి కానిస్టేబుల్ పోస్టుల వరకు కేబినెట్ ఆమోదం తెలపాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గురువారం జరగనున్న కేబినెట్ ముందుకు పోస్టుల ప్రతిపాదనలు సమర్పించనున్నట్లు అధికారులు తెలిపారు.
27 ఎస్పీ, 18 అదనపు ఎస్పీ పోస్టులు: నూతన జిల్లాలకు 27 ఎస్పీ, 18 అదనపు ఎస్పీ, 62 డీఎస్పీ పోస్టులు మంజూరు చేయాలని పోలీస్ శాఖ ప్రతిపాదించింది. 38 సీఐ, 210 ఎస్‌ఐ, 9 వేల కానిస్టేబుల్ పోస్టులు, బెటాలియన్లలో 2,028 సిబ్బంది పోస్టులు, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్లలో 2వేల కానిస్టేబుల్ పోస్టులు కోరింది. డీఎస్పీ నుంచి నాన్ క్యాడర్ ఎస్పీ పదోన్నతులకు సంబంధించి పోస్టుల మంజూరుపై కూడా కేబినేట్ ఆమోదంతో స్పష్టత రానుందని తెలిసింది.
డిగ్రీ లెక్చరర్ పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టుల్లో 1,166 పోస్టులను భర్తీ చేసేందుకు కళాశాల విద్యా శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన ఫైలును ఆమోదం కోసం ఆర్థిక శాఖకు బుధవారం పంపించినట్లు సమాచారం.