శిరీషది ఆత్మహత్యే | Police investigation finds Sirisha committed suicide | Sakshi
Sakshi News home page

శిరీషది ఆత్మహత్యే

Published Sat, Jun 17 2017 1:32 AM | Last Updated on Tue, Nov 6 2018 8:08 PM

శిరీషది ఆత్మహత్యే - Sakshi

శిరీషది ఆత్మహత్యే

ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందన్న హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌
- రాజీవ్‌ విషయంగా తేజస్విని–శిరీష మధ్య వివాదం
- దాన్ని పరిష్కరించాలంటూ కుకునూర్‌పల్లికి వెళ్లిన రాజీవ్, శ్రవణ్, శిరీష.. మద్యం మత్తులో ఆమెపై  ఎస్సై ప్రభాకర్‌ అత్యాచారయత్నం
- గొడవ చేసిన శిరీష.. ఆమెపై చేయి చేసుకున్న రాజీవ్‌
- స్టూడియోకు చేరుకున్నాక ఉరివేసుకున్న శిరీష
- ఈ విషయం బయటపడుతుందని ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడి


సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో అనుమానాస్పదంగా మృతి చెందిన బ్యూటీషియన్‌ శిరీషది ఆత్మహత్యగా తేలిందని పోలీసు కమిషనర్‌ ఎం.మహేందర్‌రెడ్డి వెల్లడించారు. తేజస్వినికి సంబంధించిన వివాదాన్ని సెటిల్‌ చేసుకునేందుకు రాజీవ్, శ్రవణ్‌లతో కలసి ఆమె కుకునూర్‌పల్లి వెళ్లారని.. అక్కడ ఎస్సై ప్రభాకర్‌రెడ్డి సహా నలుగురూ మద్యం తాగారని చెప్పారు. ఎస్సై ప్రభాకర్‌రెడ్డి మద్యం మత్తులో శిరీషపై అత్యాచారయత్నం చేసినట్లు తేలిందని.. వారు హైదరాబాద్‌కు తిరిగి వచ్చాక శిరీష ఆత్మహత్యకు పాల్పడిందని వివరించారు. శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెస్ట్‌జోన్, టాస్క్‌ఫోర్స్‌ డీసీపీలు ఎ.వెంకటేశ్వరరావు, బి.లింబారెడ్డిలతో కలసి ఆయన ఈ ఘటన వివరాలు వెల్లడించారు. ఈ వ్యవహారంలో తేజస్వినిపై ఎలాంటి కేసూ ఉండదని, శ్రవణ్‌ కుట్రతో వ్యవహరించినట్లు అనుమానిస్తున్నామని చెప్పారు. సీపీ వెల్లడించిన వివరాల ప్రకారం..

బ్యూటీపార్లర్‌కు నష్టాలు రావడంతో..
పశ్చిమగోదావరి జిల్లా ఆచంటకు చెందిన ఎ.విజయలక్ష్మి అలియాస్‌ శిరీష వృత్తిరీత్యా బ్యుటీషియన్‌. 13 ఏళ్ల క్రితం ఎ.సతీష్‌చంద్రతో ఆమెకు వివాహం జరిగింది. వారికి 12 ఏళ్ల కుమార్తె ఉంది. కొంతకాలం బ్యూటీపార్లర్‌ నిర్వహించిన శిరీష.. నష్టాలు రావడంతో నాలుగేళ్ల కింద ఫిల్మ్‌నగర్‌లోని ఆర్‌జే ఫొటోగ్రఫీ స్టూడియోలో మేనేజర్‌ కమ్‌ మేకప్‌ ఆర్టిస్ట్‌గా చేరింది. విజయవాడకు చెందిన వల్లభనేని రాజీవ్‌కుమార్‌ ఈ స్టుడియోకు యజమాని. రాజీవ్‌కు, శిరీషకు అంతకుముందే ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం ఏర్పడింది.

ఆ పరిచయంతోనే స్టుడియోలో ఉద్యోగమిచ్చాడు. ఈ క్రమంలోనే వారి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. మరోవైపు రాజీవ్‌కు దాదాపు ఏడాది క్రితం ఫేస్‌బుక్‌ ద్వారానే బెంగళూరుకు చెందిన తేజస్విని అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఆమె తరచూ హైదరాబాద్‌కు వచ్చి రాజీవ్‌ను కలిసేది. ఇది ప్రేమగా మారి శారీరకంగానూ ఒక్కటయ్యారు. వివాహం చేసుకుందామని కూడా నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో తేజస్విని బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేయించుకుంది.

ఆఫీస్‌ బాయ్‌ ద్వారా విషయం బయటపడి..
తేజస్వినికి తొలుత శిరీష–రాజీవ్‌ల మధ్య సంబంధం తెలియదు. అయితే కొద్దిరోజుల కింద ఆమె స్టూడియోకు వచ్చి రాజీవ్‌ గురించి అడగగా.. ఆయన తన భార్యతో కలసి బయటికి వెళ్లారని ఆఫీస్‌ బాయ్‌లు చెప్పారు. అదేమిటని ఆరా తీయడంతో శిరీష–రాజీవ్‌ మధ్య సంబంధం తెలిసింది. అప్పటి నుంచి ఈ విషయంపై వివాదం మొదలైంది.

గత నెల 30న స్టూడియోకు వచ్చిన తేజస్విని.. రాజీవ్‌తో ఉన్న సంబంధంపై శిరీషతో వాగ్వాదానికి దిగింది. గొడవ ముదిరి ఒకరిపై మరొకరు దాడి చేసుకునే వరకు వెళ్లింది. దీంతో రాజీవ్‌ ‘100’ద్వారా పోలీసులకు సమాచారమిచ్చాడు. స్టూడియోకు వచ్చిన బంజారాహిల్స్‌ పోలీసులు.. ఆ ముగ్గురినీ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఎస్సై శ్రీనివాస్‌కు తేజస్విని, శిరీష ఒకరిపై ఒకరు మౌఖికంగా ఫిర్యాదు చేశారు. అయితే ఎస్సై వారికి కౌన్సెలింగ్‌ చేసి పంపేశారు.

తేజస్విని బెదిరింపులతో..
గొడవ ఘటన తర్వాత నుంచి పోలీసు కేసు పెడతానంటూ తేజస్విని పలుమార్లు రాజీవ్, శిరీషలను బెదిరించింది. వాట్సాప్‌ ద్వారా శిరీషకు అభ్యంతరకర సందేశాలు పంపడం మొదలుపెట్టింది. దీనితో విసిగిపోయిన శిరీష ఈ వివాదాన్ని పరిష్కరించాలంటూ.. తన స్నేహితుడైన బోదాసు శ్రవణ్‌కుమార్‌ను కోరింది. నల్లగొండ జిల్లా మాల్‌కు చెందిన రియల్టర్‌ శ్రవణ్‌కుమార్‌.. ఏడాది క్రితం హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌ ప్రాంతంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో ఉండి ఎస్సై పరీక్షలకు కోచింగ్‌ తీసుకున్నాడు. అక్కడికి సమీపంలో ఉన్న ఓ బొటిక్‌కు వస్తున్న నేపథ్యంలో శిరీషతో పరిచయమై, స్నేహంగా మారింది. శిరీష విజ్ఞప్తి మేరకు తేజస్విని వివాదం పరిష్కరించడానికి శ్రవణ్‌ సిద్ధమయ్యాడు.

ఇందుకోసం తన స్నేహితుడైన కుకునూర్‌పల్లి ఎస్సై ప్రభాకర్‌రెడ్డిని సహాయం కోరాడు. ప్రభాకర్‌రెడ్డి దేవరకొండలో ప్రొబేషనరీ ఎస్సైగా పనిచేసినప్పుడు శ్రవణ్‌తో పరిచయమైంది. అయితే ప్రభాకర్‌రెడ్డి హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లోనే ఎస్సైగా పనిచేసే తన స్నేహితుడు హరీందర్‌ వద్దకు వెళ్లాల్సిందిగా సూచించారు. దాంతో 12వ తేదీన రాత్రి 8 గంటల సమయంలో రాజీవ్, శ్రవణ్‌ ఎస్సై హరీందర్‌ను కలిశారు. అదే పోలీస్‌స్టేషన్‌లోని మరో ఎస్సై శ్రీనివాస్‌ వద్దకు అంతకుముందే ఈ వివాదం వచ్చిందని తెలియడం, పనిఒత్తిడిలో ఉండటంతో హరీందర్‌ వారిని కొద్దిరోజుల తర్వాత రమ్మని సూచించారు.

అప్పటికప్పుడు కుకునూర్‌పల్లికి..
బంజారాహిల్స్‌ ఎస్సైని కలసి వచ్చిన తర్వాత రాజీవ్, శ్రవణ్, శిరీష ముగ్గరూ బంజారాహిల్స్‌ రోడ్‌ నం.10లోని ఓ కాఫీ షాప్‌కు వెళ్లారు. అక్కడ కూర్చున్న సమయంలో ఎస్సై ప్రభాకర్‌రెడ్డికి ఫోన్‌ చేసి మాట్లాడారు. ఆయన కుకునూర్‌పల్లికి రావాలని సూచించడంతో రాత్రి 9.30 గంటల సమయంలో ముగ్గురూ రాజీవ్‌కు చెందిన ఎండీవర్‌ కారులో బయలుదేరారు. మధ్యలో బంజారాహిల్స్‌లో మద్యం, రాయదుర్గం రోడ్‌లో తినుబండారాలు కొనుక్కుని వెళ్లారు.

రాత్రి 11.30 గంటల సమయంలో నేరుగా కుకునూర్‌పల్లి పోలీసుస్టేషన్‌ పక్కన ఉన్న ఎస్సై క్వార్టర్స్‌కు చేరుకున్నారు. నలుగురూ అర్ధరాత్రి 2 గంటల వరకు క్వార్టర్స్‌లోనే మద్యం తాగారు. ఈ సమయంలోనే తేజస్విని వల్ల తమకు ఎదురవుతున్న ఇబ్బందులను శిరీష, రాజీవ్‌లు ప్రభాకర్‌రెడ్డికి వివరించగా.. తాను పరిష్కరిస్తానంటూ హామీ ఇచ్చారు. అయితే మధ్యలో శిరీష మినహా మిగతా ముగ్గురూ సిగరెట్‌ తాగడానికి క్వార్టర్స్‌ నుంచి బయట ఆవరణలోకి వచ్చారు. శిరీష కూడా వస్తుండగా.. సెంట్రీ చూస్తే ఇబ్బందంటూ లోపలే ఉండాలని సూచించారు.

వ్యభిచారుల వద్దకు వెళ్లాలంటూ..
క్వార్టర్స్‌ ఆవరణలో ఉన్న సమయంలో ప్రభాకర్‌రెడ్డి వ్యభిచారిణుల ప్రస్తావన తెచ్చాడు. రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ గ్రామంలో అందమైన వ్యభిచారిణులు ఉంటారని, వెళ్లి ఎంజాయ్‌ చేసి రావాలని సూచించాడు. ఈ సమయంలో వారి మాటలు విన్న శిరీష కీడు శంకించింది. రాజీవ్, శ్రవణ్‌లు అలా వెళితే తాను ఒంటరిగా మిగిలిపోతాననే భయంతో ‘రాజీవ్‌ ప్లీజ్‌ డోంట్‌ లీవ్‌.. బీ విత్‌ మీ’అంటూ రాజీవ్‌కు వాట్సాప్‌ సందేశాలు పంపింది. అనంతరం ముగ్గురూ క్వార్టర్స్‌లోకి వెళ్లారు. తిరిగి అందరూ కలసి మరికొంత మద్యం తాగారు.

కొద్దిసేపటికి రాజీవ్, శ్రవణ్‌ మళ్లీ సిగరెట్‌ తాగివస్తామంటూ క్వార్టర్స్‌ బయట ఆవరణలోకి వెళ్లారు. ఈ సమయంలో ఒంటరిగా మిగిలిన శిరీషపై ప్రభాకర్‌రెడ్డి అత్యాచారయత్నం చేశాడు. దానిని ప్రతిఘటించిన శిరీష.. రోదిస్తూ కేకలు వేసింది. దీంతో లోపలికి వెళ్లిన రాజీవ్, శ్రవణ్‌లు ఆమెకు సర్దిచెప్పే యత్నం చేశారు. అయినా ఆమె గొడవ చేయడంతో ప్రభాకర్‌రెడ్డిని బయటకు తీసుకువచ్చారు. ఆ సమయంలో ప్రభాకర్‌రెడ్డి మరోసారి రాజీవ్, శ్రవణ్‌లను వ్యభిచారిణుల వద్దకు వెళ్లాలని సూచించాడు.

శిరీషపై చేయి చేసుకున్న రాజీవ్‌
అయితే శిరీష గొడవచేయడం ఆపకపోవడంతో రాజీవ్‌ దుర్భాషలాడుతూ ఆమెపై చేయి చేసుకున్నాడు. ఈ గొడవతో పోలీస్‌ క్వార్టర్స్‌లోని ఇతరులు మేల్కొంటారనే ఉద్దేశంతో.. అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా ప్రభాకర్‌రెడ్డి సూచించాడు. దీంతో ఆమెను రాజీవ్, శ్రవణ్‌లు శిరీషను కారులో ఎక్కించుకుని.. తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. అయితే ఆమె గొడవ చేయడం ఆపలేదు. తనను వ్యభిచారిగా చూస్తున్నారంటూ.. కారు దిగి పారిపోయే ప్రయత్నం చేసింది.

శ్రవణ్‌ కారు దిగి వెళ్లి ఆమె జుట్టు పట్టుకుని లాక్కొచ్చి కారు ఎక్కించాడు. ఈ సమయంలో రాజీవ్‌ మరోసారి ఆమెపై చేయి చేసుకున్నాడు. దాంతో ఆమె తల, ముఖం, పెదవులు, కడుపు భాగంలో గాయాలయ్యాయి. వారు హైదరాబాద్‌ వచ్చేసరికి ప్రభాకర్‌రెడ్డి రెండుసార్లు శ్రవణ్‌కు ఫోన్‌ చేశాడు. తమ ప్రాంతం దాటారా.. లేదా? ఆమె గొడవ చేయడం ఆపిందా? అంటూ ఆరా తీశాడు.

తిరిగి రాగానే ఆత్మహత్య
రాజీవ్, శ్రవణ్, శిరీష ముగ్గురూ మంగళవారం తెల్లవారుజామున 3.45 గంటల సమయంలో ఫిల్మ్‌నగర్‌లోని స్టూడియో వద్దకు చేరుకున్నారు. వెంటనే లోపలికి వెళ్లిన శిరీష.. తన స్కార్ఫ్‌తో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. ఇది చూసిన రాజీవ్‌.. అప్పటికే క్యాబ్‌లో వెళ్లిపోతున్న శ్రవణ్‌కు ఫోన్‌ చేసి వెనక్కి పిలిచాడు. శిరీషను కిందికి దింపి మంచంపై పడుకోబెట్టాడు. శ్రవణ్‌ కూడా వచ్చి అంబులెన్స్, పారామెడికల్‌ స్టాఫ్‌ను పిలిపించగా.. అప్పటికే శిరీష మరణించినట్లు ధ్రువీకరించారు. దీంతో రాజీవ్‌ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అయితే ఈ వివాదానికి సంబంధించి ప్రభాకర్‌రెడ్డి విషయం బయటకు వెల్లడించవద్దని రాజీవ్, శ్రవణ్‌లు నిర్ణయించుకున్నారు.

బంజారాహిల్స్‌ ఎస్సై నుంచి ప్రభాకర్‌రెడ్డికి వివరాలు
శిరీష భర్త ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసిన పోలీసులు మంగళవారం రాజీవ్, శ్రవణ్‌లను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఏం జరుగుతోందనే ఆందోళనతో ప్రభాకర్‌రెడ్డి తన స్నేహితుడైన ఎస్సై హరీందర్‌కు పలుమార్లు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకున్నారు. బుధవారం ఉదయం 10.05 గంటలకు ఫోన్‌ చేసినప్పుడు ‘ముగ్గురూ (రాజీవ్, శ్రవణ్, శిరీష) నీ దగ్గరకు వచ్చారట కదా! నలుగురూ కలిసి మద్యం తాగారట కదా..’అని హరీందర్‌ పేర్కొన్నారు.

దీంతో తాను, శ్రవణ్‌ మాత్రమే మద్యం తాగామంటూ ప్రభాకర్‌రెడ్డి ఫోన్‌ కట్‌ చేశారు. ఆ తర్వాత కొంత సేపటికే ప్రభాకర్‌రెడ్డి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. రాజీవ్, శ్రవణ్‌లను అరెస్టు చేస్తున్నామని, ఫోరెన్సిక్‌ నివేదికల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ఈ కేసులో శేష ప్రశ్నలెన్నో..!
బ్యూటీషియన్‌ శిరీషది కచ్చితంగా హత్యేనని.. ఈ వ్యవహారంలో ఎన్నో సందేహాలున్నాయని ఆమె కుటుంబ సభ్యులు స్పష్టం చేస్తున్నారు. వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని డిమాండ్‌ చేస్తున్నా రు. వారు వ్యక్తం చేస్తున్న అనుమానాలివి ..
1. శిరీష 6 అడుగుల ఎత్తు, 80 కేజీల వరకూ బరువుంటుందని.. కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే ఆమె ఫ్యాన్‌కు ఉరివేసుకుంటే ఫ్యాన్‌ ఎందుకు చెక్కు చెదరలేదు? అసలు ఫాల్స్‌ సీలింగ్‌ ఉన్న గదిలో మంచంపై నిల్చుని ఫ్యాన్‌కు ఉరేసుకోవడం సాధ్యమేనా?
2. కుకునూర్‌పల్లిలో శిరీష, రాజీవ్, శ్రవణ్, ఎస్సై ప్రభాకర్‌రెడ్డి కలసి మద్యం తాగారని... మిగతా ఇద్దరు సిగరెట్‌ కాల్చ డానికి బయటకు వచ్చిన సమయంలో శిరీషపై ప్రభాకర్‌రెడ్డి అత్యాచారయత్నం చేశాడన్న వాదనను పోలీసులు ఎలా నమ్మారు? సిగరెట్‌ కాల్చి వచ్చే వ్యవధి లోనే అలా చేయడం సాధ్యమా?
3. ఏడాది కింద పరిచయమైన తేజస్వినికి రాజీవ్‌ సన్నిహితమయ్యాడు. ఆమెను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుని.. శిరీషను వదిలించుకోవాలని భావించాడు. అలాంటి వ్యక్తి చెప్పిన కథనం ఎంత వరకు నమ్మశక్యం?
4. కుకునూర్‌పల్లిలో శిరీషపైనే అత్యాచారయ త్నం జరిగింది. బాధితురాలి పైనే రాజీవ్‌ ఎందుకు చేయిచేసుకోవాల్సివచ్చింది?
5. ఆమె మరణించిన తర్వాత నిందితులు ఆమెకు సంబంధించి చెప్పిన వివరాలను పోలీసులు ఎలా నమ్మారు? వారి మాటలు నమ్మి శిరీష, తేజస్వినిల వ్యక్తిగత జీవితా లపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబేనా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement