భువనగిరి శివారులో డంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్న పోలీసులు(ఫైల్)
సాక్షి, యాదాద్రి: ‘దిశ’ సంఘటన నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. 17 పోలీస్ స్టేషన్‌ల పరిధిలో భద్రతా చర్యలు పెంచారు. మహిళలు, విద్యార్థినులు ఎక్కువగా ఉండే ప్రాంతాలు, కళాశాలలు, బస్టాండ్‌లను గుర్తిస్తున్నారు. అలాగే గ్రామాల్లో బెల్ట్ షాపులు, సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి దాడులు నిర్వహిస్తున్నారు. మత్తు పదార్థాలు విక్రయించే వారిపైనా దృష్టి సారించారు. ఇందులో భాగంగా ప్రధానంగా భువనగిరి, బీబీనగర్, వలిగొండ, నాగిరెడ్డిపల్లి, రామన్నపేట, వంగపల్లి రైల్వేస్టేషన్లతో పాటు బస్టాండ్‌లపై కన్నేశారు.
పెట్రో మొబైల్..
శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పెట్రో మొబైల్ వాహనాలు, సిబ్బందిని ఏర్పాటు చేశారు. పెట్రో మొబైల్ సిబ్బంది 24 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉంటారు. బాధితులు 100కు డయల్ చేసిన వెంటనే వీరు స్పందిస్తారు. జీపీఎస్ వి« దానం ద్వారా రాచకొండ కమిషనరేట్ కార్యాలయంతో పెట్రో మొబైల్ వాహనాలను అనుసంధానం చేశారు. 12 గంటల చొప్పున రెండు షిఫ్టుల్లో సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఒక డ్రైవర్, ఇద్దరు కానిస్టేబుల్స్‌తో నడవాల్సిన పెట్రో మొబైల్ వాహనాలు.. సిబ్బంది కొరత వల్ల ఒక డ్రైవర్, కానిస్టేబుల్‌తో పని చేస్తున్నాయి.
బ్లూ కోట్స్..
జిల్లాలోని 17 పోలీస్ స్టేషన్‌లు ఉన్నాయి. ఒక్కో స్టేషన్‌కు ఇద్దరు చొప్పున బ్లూకోట్స్ సిబ్బంది ఉన్నారు.ఆయా స్టేషన్ల పరిధిలో వీరు నిత్యం తిరుగుతుంటారు. ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే అక్కడికి చేరుకుని పరిష్కరిస్తారు.
సిటీ పోలీసింగ్..
జిల్లాలో కొన్ని గ్రామాల్లో మాత్రమే గ్రామ పోలీస్ వ్యవస్థ ఉండగా ఎక్కువ సిటీ పోలీసింగ్ కొనసాగుతోంది. జిల్లా రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నందున ఇక్కడ నిబంధనల్లోనూ తేడా ఉంటుంది. బ్లూకోట్స్, పెట్రో మొబైల్, ఎస్‌ఓటీ పోలీస్ తదితర విభాగాలు పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ సేవలందిస్తున్నాయి. అయితే దిశ దుర్ఘటన నేపథ్యంలో భద్రత చర్యలను మరింత పెంచారు. జిల్లాలో నేరాల అదుపుపై మరిన్ని కార్యక్రమాలు చేపట్టబోతోంది. ఎస్‌ఓటీ పోలీసులు సివిల్ పోలీస్‌లతోపాటు నేరాలను ప్రేరేపించే కార్యకలాపాలపై దాడులు పెంచారు. గతంలో 100 డయల్‌కు 50 కాల్స్ వస్తుండగా ఇప్పుడు 100 వరకు వస్తున్నాయి.సిబ్బంది కొరత తీవ్రంగా ఉన్నప్పటికీ భద్రతా చర్యలు విసృతం చేశారు.
మహిళల కోసం విశ్రాంతి గదులు, వెయిటింగ్ హాల్స్..
మహిళల భద్రత దృష్ట్యా టోల్‌గేట్‌లు, పెట్రోల్ బంక్‌ల వద్ద మహిళల కోసం ప్రత్యేకంగా రెస్ట్ రూమ్‌లు, వెయిటింగ్ హాళ్లు ఏర్పాటు చేసే యోచనలో జిల్లా పోలీసులు ఉన్నారు.
జిల్లాలోనూ వెలుగుచూసిన ఘటనలు
జిల్లాలోనూ దిగ్భ్రాంతికర సంఘటనలు గతంలో వెలుగు చూశాయి. యాదగిరిగుట్టలో వ్యభిచార కూపాల్లో మగ్గిపోతున్న చిన్నారుల సంఘటన సంచలనం సృష్టించిందే. అలాగే బొమ్మలరామారం మండలం హజీపూర్‌లో బాలికలపై లైంగికదాడి, హత్య సంఘటనలు జాతీయ స్థాయిలో తీవ్ర సంచలనాన్ని రేకెత్తించాయి.
సిబ్బంది కొరత : జిల్లా పోలీస్ శాఖను సిబ్బంది కొరత వేధిస్తోంది. వివిధ హోదాల్లో 670మంది ఉండాలి. ప్రస్తుతం 326 ఖాళీలు ఉన్నాయి. అందుబాటులో ఉన్న సిబ్బందితోనే భదత్రా చర్యలను పెంచారు.
బెల్ట్ షాపులు, దాబాలపై ఎస్‌ఓటీ పోలీసుల దాడులు
చౌటుప్పల్/బీబీనగర్ : ఎస్‌ఓటీ పోలీసులు మంగళవారం అర్ధరాత్రి పలు చోట్ల దాడులు నిర్వహించారు. చౌటుప్పల్‌లోని వలిగొండ క్రాస్ రోడ్డు వద్ద గంగాపురం వెంకటేశం బెల్టుషాపులో సోదాలు చేసి రూ.20వలే విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా లక్కారం గ్రామ శివారులో గల సుందరయ్యకాలనీలో ఎన్.వెంకటేశ్వర్లుకు చెందిన కిరాణం షాపునుంచి రూ.20వేలు విలువ చేసే నిషేధిత గుట్కాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిని స్థానిక పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. అదే విధంగా బీబీనగర్ మండలం కొండమడుగు మెట్టు వద్ద జాతీయ రహదారి వెంట గల దాబాలపైనా మంగళవారం రాత్రి ఎస్‌ఓటీ పోలీస్‌లు దాడులు నిర్వహించారు. వెంకటేశ్వర్ దాబాలో మద్యం స్వాధీనం చేసుకుని విక్రయిస్తున్న వ్యక్తులను అరెస్టు చేసినట్లు సీఐ రంగస్వామి తెలిపారు.
నేటి నుంచి అవగాహన కార్యక్రమాలు
యాదాద్రి భువనగిరి జిల్లా కమిషనరేట్ పరిధిలో ఉన్నందున గ్రామ పోలీసు వ్యవస్థ పూర్తి స్థాయిలో లేదు. ఆ పద సమయంలో 100కు ఫోన్ చేస్తే పోలీసులు తక్షణమే స్పందిస్తారు. వారం రోజుల పాటు జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్‌ల పరి ధిలో విద్యాసంçస్థల్లో 100కు డయల్ చేయ డం, షీటీంలకు ఫోన్ చేయడం వంటి విషయాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యే క కార్యక్రమాలు నిర్వహిస్తాం. టోల్‌గేట్‌లు, పెట్రోల్‌బంక్‌ల వద్ద మహిళలకు రెస్ట్ రూం లు, వెయిటింగ్ హాళ్లు ఏర్పాటు చేయిస్తాం.
–డీసీపీ నారాయణరెడ్డి
ఉదయం సమయంలోనూ పెట్రోలింగ్ నిర్వహించాలి
రాత్రి వేళల్లోనూ కాకుండా ఉదయం సమయంలోనూ పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించాలి. అనుమానితులు, జూలాయిగా తిరిగే వ్యక్తుల వివరాలను ఆరా తీస్తుండాలి. నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తులపైనా ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతుండాలి. అవాంఛనీయ సంఘటనలు, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలి.
–మధు, దాతారుపల్లి
Comments
Please login to add a commentAdd a comment