పచ్చని పంట..జింకలతోనే తంటా | Problems with deer's to the crops | Sakshi
Sakshi News home page

పచ్చని పంట..జింకలతోనే తంటా

Published Sun, Dec 10 2017 2:31 AM | Last Updated on Sun, Dec 10 2017 4:33 AM

Problems with deer's to the crops - Sakshi

మహబూబ్‌నగర్‌ జిల్లా మాగనూర్‌ మండలంలోని గుడెబల్లూర్‌ గ్రామంలో పంట పొలాల్లోకి వచ్చిన జింకలు

(మహబూబ్‌నగర్‌ జిల్లా కృష్ణా తీర ప్రాంత గ్రామాల నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) అడవి పందులు, కోతుల దాడులను తట్టుకోలేక రైతాంగం సంప్రదాయ పంటలను వదిలేసి పత్తి వైపు మొగ్గింది. కానీ కృష్ణా తీరం రైతులకు పత్తి వేసినా పంట దక్కే పరిస్థితి లేదు. కోతుల గుంపులకు మించిన జింకల మందలు పంటల మీద పడి స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో పంటను కాపాడుకునేందుకు రైతులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. అన్నదాతలు కంటి మీద కునుకేస్తే చాలు.. జింకల మందలు చేళ్ల మీదకొచ్చి మొలకలు, ఆకులు, కాయలను నమిలేస్తున్నాయి. తంగడి నుంచి జూరాల ప్రాజెక్టు వరకు కృష్ణా తీరం వెంట 30 వేల ఎకరాల్లో జింకలు పంటలను నాశనం చేస్తున్నాయి. దీనిపై తీరం వెంబడి 27 కిలోమీటర్ల మేర ‘సాక్షి’క్షేత్రస్థాయి పరిశీలన జరిపింది. రైతులను కదిపి చూసింది. జింకల మందలతో వేగలేక రైతులు వ్యవసాయాన్నే వదులుకునే పరిస్థితికి వస్తున్నారు. సిరులు పండే భూములను వదిలేసి వలసలు పోతున్న దృశ్యాలు కనిపించాయి. అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని బాధిత రైతులు చెబుతుంటే... ఇప్పటి వరకు ఒక్క ఫిర్యాదు కూడా అందలేదని అధికారులు చెబుతున్నారు. 

పంటల మీద పడి.. 
1980–1990 మధ్య కురుమగడ్డ, నారగడ్డ, నల్లగడ్డ ప్రాంతాల్లో పదుల సంఖ్యల్లో మచ్చల జింకలు, కృష్ణ జింకలు ఉండేవి. అప్పట్లో గుట్టల్లో మొలిచిన గడ్డి తిని బతికేవి. చేళ్ల మీదకు వచ్చేవి కావు. 15 ఏళ్ల కిందట రెండు లారీల్లో కొమ్ముల జింకలను తీసుకొచ్చి వదిలారని, అప్పటి నుంచే జింకల మందలు పెరిగిపోయాయని గజరందొడ్డి గ్రామానికి చెందిన రైతు మల్లప్ప చెప్పాడు. జింకలు పంటల మీద పడుతుండటంతో పగలూ రాత్రీ కాపలా కాస్తున్నారు. రాత్రంతా మేలుకుని ఉండాల్సిందే. ఒకవేళ నిద్రపోతే.. మంద చేను మీదపడి కాయ లేకుండా తినేస్తాయని ముడుమాల్‌కు చెందిన రైతు సుంకన్న చెప్పాడు. ఎంత జాగ్రత్తగా కాపు కాసినా 60 శాతం పంట జింకల పాలవుతోందని, ఎకరాకు 10 క్వింటాళ్లు రావాల్సిన పత్తి మూడు క్వింటాళ్లకు మించటం లేదని గుడెబల్లూరు చెందిన రైతు గురుమల్లప్ప చెప్పారు. ప్రెగడబండా, ఓబ్లాపూర్, గుడెబల్లూర్, ముడుమాల్, మురహార్‌దొడ్డి, అడవి సత్యావార్, మాగనూర్‌ రైతులు ఈ ఏడాది తమ పొలాలను బీడుగా వదిలేశారు. 

జింకల సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తే...
అటవీ నిబంధనల ప్రకారం అటవీ జంతువులు పంట నాశనం చేస్తే ఎకరాకు రూ.6 వేల వరకు నష్టపరిహారం చెల్లించాలి. ఇక్కడ 30 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినా అధికారులు ఇప్పటివరకు ఒక్క ఎకరాకు కూడా నష్టపరిహారం ఇవ్వలేదు. జింకలతో సమస్య తీవ్రంగా ఉందనే విషయాన్ని కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేయలేదు. ఇక్కడ 4 నుంచి 5 వేలకు పైగా జింకలు ఉన్నట్లు సమాచారం. ఈ సీజన్‌ దాటితే మరో వెయ్యి పెరిగే అవకాశం ఉంది. అధికారులు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే జింకల భవిష్యత్తుకు, రైతుల సాగుకు ఉపయోగకరంగా ఉంటుంది. తీరంలోనే వందల ఎకరాల్లో ప్రభుత్వ భూములున్నాయి. సంరక్షణ ప్రభుత్వానికి ఇబ్బందికరం అనుకుంటే.. కొన్ని స్వచ్ఛంద సంస్థలు జింకల పార్కును ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. 

వైఎస్సార్‌ ఉన్నప్పుడు.. 
2004 వరకు కర్నూలు జిల్లా ఆలూరు, మిడుతూరు మండలాల్లో జింకలు పంటల మీదపడి దాడులు చేసేవి. ప్రస్తుతం తెలంగాణ ప్రిన్సిపల్‌ చీఫ్‌ ఫారెస్టు కన్జర్వేటర్‌ పీకే ఝా అప్పట్లో కర్నూలు జిల్లా కన్జర్వేటర్‌గా ఉన్నారు. రైతులు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి మొరపెట్టుకోగా.. పంట నష్టపరిహారం ఇవ్వటంతోపాటు, ప్రత్యేక పద్ధతులు అవలంబించి 6 నెలల్లో 3,500 జింకలను పట్టుకుని నాగార్జున సాగర్‌ వద్ద వదిలేశారు. అన్ని జింకలను ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా దూర ప్రాంతంలో వదలటం ప్రపంచ రికార్డుగా నిలిచింది. 

30 వేల ఎకరాల్లో నాశనం
మహబూబ్‌నగర్‌ జిల్లా కృష్ణ మండలం తంగడి నుంచి కృష్ణా నది రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి జూరాల మీదుగా కర్నూలు జిల్లా సంగమేశ్వరం వద్ద ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తుంది. తంగడి నుంచి జూరాల ప్రాజెక్టు వరకు 27 కిలోమీటర్ల తీరం. కృష్ణా పరీవాహక ప్రాంతమంతా సారవంతమైన నల్లరేగడి నేలలే. నదికి ఉత్తరం వైపున తెలంగాణకు చెందిన 34 గ్రామాలు విస్తరించి ఉన్నాయి. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఈ గ్రామాల్లో 78 వేల ఎకరాల సాగు భూమి ఉంది. రైతులు జింకలకు భయపడి పప్పు ధాన్యాల సాగు వదిలేసి నాలుగేళ్లుగా పత్తి, ఆముదం సాగు చేస్తున్నారు. అయితే జింకలు వాటిని కూడా వదిలిపెట్టడం లేదు. పత్తి మొలకలు, కాయలను ఇష్టంగా తింటున్నాయి. ఆఖరికి ఆముదం గుత్తులను కూడా నములుతుండటంతో రైతులు నోరెళ్లబెడుతున్నారు. దీంతో మాగనూర్‌ మండలంలోని ప్రెగడబండా, ఓబ్లాపూర్, గుడెబల్లూర్, ముడుమాల్, మురహార్‌దొడ్డి, అడవి సత్యావార్, పుంజనూర్, అచ్చంపేట గ్రామాలు కృష్ణ మండలం పుంజనూరు, కొల్పూరు, ఫర్వాన్‌దొడ్డి, గజరం దొడ్డి, అమ్మపల్లి గ్రామాల్లోని దాదాపు 15 వేల ఎకరాల్లో పంటలు చేతికి అందలేదు. మక్తల్‌ మండలం కర్ణే, గుడిగండ్ల, మంతనిగోడు, జక్లేరు, ఉట్నూరు మండలం పులి మామిడి, అవుసలోని పల్లి, పెద్ద జప్యం, సమస్తపూర్, కొల్లూరు, నాగిరెడ్డి, పెద్దపుర్ల గ్రామాల్లో మరో 15 వేల ఎకరాల్లో పంట జింకల పాలైపోతోంది.

వేట కూడా ఎక్కువే..
ఫారెస్టు రిజర్వు ప్రాంతం కాకపోవడంతో అటవీ అధికారుల నిఘా చాలా స్వలంగా ఉంది. ఇదే అదనుగా వేటగాళ్లు యథేచ్ఛగా జింకలను వేటాడుతున్నారు. 34 గ్రామాలకు కలిపి ఇద్దరు ఫారెస్టు వాచర్లు మాత్రమే ఉన్నారు. 10–15 రోజులకు ఒకసారి మాత్రమే వారి సంచారం ఉంటుంది. వేట నియంత్రణకు తీసుకున్న చర్యలు శూన్యం. స్థానిక వేటగాళ్లతోపాటు, పట్టణ ప్రాంతాలకు చెందిన హంటింగ్‌ హాబిచ్యువల్స్‌ జీపు, జిప్సీ వాహనాల్లో అధనాతన ఆయుధాలతో జింకలను వేటాడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఫోకస్‌ లైట్‌ను సూటిగా జింక కళ్లలోకి కొడితే అవి కదలకుండా నిలబడిపోతాయి. అదే అదునుగా వెనుక నుంచి కర్రలతో జింకను బలంగా కొట్టి చంపుతున్నారు. హాబిచ్యువల్స్‌ జిప్సీ, కమాండర్‌ జీపు హెడ్‌ లైట్‌ను జింకల కళ్లకు పెట్టి, తుపాకులతో కాల్చి చంపుతున్నట్లు పంట పోలాల్లో పని చేసుకునే రైతులు చెప్పారు. గడిచిన మూడేళ్ల కాలంలో ఇక్కడ ఫారెస్టు అధికారులు 24 హంటింగ్‌ కేసులు నమోదు చేశారు.

రెండు రోజులు పోలె..
మాది ఓబులాపురం. 15 ఎకరాల భూమి ఉంటే జింకలకు భయపడి దున్నటం మానేసిన. అచ్చంపేటలో 17 ఎకరాలు పాలుకు తీసుకున్నా. 10 ఎకరాలు పత్తి, 7 ఎకరాలు కంది పెట్టిన. రెండు రోజులు సుశ్తు (జ్వరం) జేసి పోలె. జింకలు కాయలు మేసి పోయినయి. 10 ఎకరాలకు 10 క్వింటాళ్ల పత్తి కూడ కష్టమే. కంది అసలే వదిలిపెట్టిన.
– చెంచూరి గోవింద్, ఓబులాపురం

కూలికి పోతున్న
నాకు 20 ఎకరాలు ఉంది. పోయినేడు 13 ఎకరాలు పత్తి, 6 ఎకరాల కందిపెట్టిన. ఎకరానికి తడవకు రూ.3 వేలు చొప్పున ఐదు తడవలు మందు కొట్టిన. ఇంత పెట్టుబడి.. జాగ్రత్త ఉన్నా.. జింకలు ఎక్కడి నుంచి వస్తయో మేసిపోతయి. ఇక లాభం లేదని కూలి పనులకు పోతున్న.
– కుమ్మరి శంకరప్ప, ప్రెగడబండ 

భూమి కొనుక్కోర్రి..
మూడేళ్ల నుంచి పంట వేసుడేకాని చేతికి మాత్రం అందలేదు. జింకలను కొట్టొద్దని జెప్తరు. పంటలు పాయ, పెట్టుబడి పాయ.. ఎవరూ మా దిక్కే జూత్తలేరు. జింకలను తీసుకెళ్లి నల్లమల అడవుల్లో వదిలేయాలె. లేదంటే ఇక్కడి భూమినంతా జింకల కోసం లీజుకైనా తీసుకోవాలె.
– రామకృష్ణారెడ్డి, ప్రెగడబండ

తరలింపు సాధ్యం కాదు
జింకలను బంధించి నల్లమలకు తరలించటం ఇప్పుడు సాధ్యం కాదు. ఈ ప్రాంతాన్ని జింకల పార్కుగా అభివృద్ధి చేసే ఆలోచన ఇప్పటికైతే లేదు. జింకల లెక్కలు తేల్చాల్సి ఉంది. పంట నష్టం జరిగిన చోట ఎకరాకు రూ.6 వేల పరిహారం చెల్లించి రైతులను ఆదుకుంటాం.
– పీకే ఝా, అటవీ సంరక్షణ ప్రధాన అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement