అక్ర మాలకు పాల్పడితే ఉపేక్షించం
పౌర సరఫరాలశాఖ మంత్రి ఈటల
సాక్షి, హైదరాబాద్: పౌర సరఫరాల శాఖలో అక్ర మాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ఆ శాఖ మంత్రి ఈటల రాజేందర్ హెచ్చరించారు. శనివారం రైస్ మిల్లర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. శాఖ పనితీరు మెరుగుపడిందన్నారు. రెండేళ్లుగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) గణనీయ ప్రగతి సాధిం చిందని తెలిపారు. 2016–17 సంవత్సరానికి 18.27 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించేలా ప్రతిపా దనలు చేయగా.. ఇప్పటివరకు 15.28లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ పూర్తయిందన్నారు.
ఇందులో 15 లక్షల మెట్రిక్ టన్నులు మిల్లింగ్‌కి ఇచ్చామని, శని వారం నాటికి 5.85 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం గోదాముల్లోకి చేరిందని తెలిపారు. మిగిలిన బియ్యాన్ని వీలైనంత త్వరగా అందించాలని మిల్లర్లను ఆదేశించామన్నారు. ప్రభుత్వ వసతి గృహాలు, పాఠశాలలకు మధ్యాహ్న భోజనంలో సన్న బియ్యం ఇస్తున్నామని, ఓపెన్ మార్కెట్లో ధర ఎక్కువగా ఉండడంతో సీఎంఆర్ పద్ధతిలో బియ్యా న్ని సేకరిస్తున్నామన్నారు. దీనివల్ల రైతులకు సైతం మద్దతు ధర అందుతుందన్నారు. పేద విద్యార్థులకు అందించే బియ్యంలో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.