
కూపన్లు క్లోజ్
మిర్యాలగూడ :గత ఏడాది డిసెంబర్‌లో నిర్వహించిన మూడవ రచ్చబండ కార్యక్రమంలో అర్హులైన వారికి ఫొటోలు లేకుండా టెంపరరీ రేషన్ కార్డులు జారీ చేశారు. వాటితో పాటే లబ్ధిదారులు రేషన్ సరుకులు పొందేందుకు కూపన్లు పంపిణీ చేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం పది లక్షల తెల్ల రేషన్ కార్డులున్నాయి. వాటిలో 2013 డిసెంబర్‌లో నిర్వహించిన మూడవ విడత రచ్చబండ కార్యక్రమంలో జారీ చేసిన టెంపరరీ కార్డులు 66వేలు. టెంపరరీ కార్డులు పొందిన వారంతా ఇప్పటివరకు వాటితోనే కాలం గడుపుతూ వచ్చారు. అవి కేవలం రేషన్ దుకాణంలో సరుకులు తీసుకెళ్లడానికే తప్ప ఇతర ఏ విషయానికీ పనికిరావడం లేదు.
ఈ నెలతో పూర్తయిన కూపన్లుగత ఏడాది మూడవ రచ్చబండ కార్యక్రమంలో టెంపరరీ రేషన్ కార్డులు జారీ చేసిన లబ్ధిదారుల వద్ద కూపన్లు పూర్తయ్యాయి. టెంపరరీ రేషన్ కార్డులతో పాటు 2013 డిసెంబర్ నుంచి 2014 జూన్ వరకు కూపన్లు జారీ చేశారు. కాగా ఈ నెలతో లబ్ధిదారుల వద్ద ఉన్న కూపన్లు పూర్తయ్యాయి. కొత్త ప్రభుత్వం తిరిగి కూపన్లు జారీ చేస్తుందా? లేదా? అని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
టెంపరరీ కార్డులతో ఇక్కట్లు
పేదవర్గాలకు చెందిన వారు తెల్లరేషన్ కార్డులకు అర్హులైనప్పటికీ మూడవ రచ్చబండ కార్యక్రమంలో టెంపరరీ కార్డులు జారీ చేశారు. వీరంతా రెండవ రచ్చబండ కార్యక్రమంలో దరఖాస్తులు చేసుకోగా జిల్లా వ్యాప్తంగా 65,962 కుటుంబాలను అర్హులుగా గుర్తించారు. కానీ కేవలం 43వేల మంది నుంచి మాత్రమే రెవెన్యూ అధికారులు ఫొటోలు సేకరించారు. అయినా ఫొటోలు లేకుండానే లబ్ధిదారుల పేర్లతో టెంపరరీ కార్డులు జారీ చేశారు. దీంతో టెంపరరీ రేషన్ కార్డులు కేవలం రేషన్ దుకాణం వద్ద తప్ప ఎక్కడా పనికి రావడం లేవు. దీంతో లబ్ధిదారులు ఇక్కట్లకు గురవుతున్నారు. కొత్త ప్రభుత్వంలోనైనా అర్హులైన వారికి టెంపరరీ కార్డుల స్థానంలో శాశ్వత కార్డులు జారీ చేస్తారేమో వేచి చూడాలి.