బెల్లంపల్లి (ఆదిలాబాద్): తమ పిల్లలకు చదువు సరిగా రావడం లేదని ఓ మహిళ స్కూల్ టీచర్‌ను నిలదీయడంతో... ఆ టీచర్ ఏకంగా టీసీ ఇచ్చి విద్యార్థులను ఇంటికి పంపించేసింది. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో చోటు చేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం.. సుబ్బరావుపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మేకల రాధిక కుమారుడు వినయ్ (3వ తరగతి), హిమబిందు (5వ తరగతి) చదువుతున్నారు. వీరితో పాటు పాఠశాలలో మొత్తం ఆరుగురు విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. తమ ఇద్దరు పిల్లలకు చదువు సరిగా రావడం లేదని, కనీసం జాతీయ గీతం కూడా పాడలేకపోతున్నారని ఉపాధ్యాయురాలిని శారద అడిగింది. ఇందుకు ప్రతిగా స్పందించిన ఉపాధ్యాయురాలు 'మీ పిల్లలను మీ ఇష్టం ఉన్న స్కూల్‌లో చదివించండని' ఏకంగా ఇద్దరు విద్యార్థులకు టీసీ ఇచ్చి ఇంటికి పంపించింది. విద్యా సంవత్సరం ముగింపు దశలో టీసీ ఇవ్వడం వల్ల తమ పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు.
నిరుపేదలమైన తాము ప్రైవేట్ పాఠశాలలో పిల్లలను చదివించే స్థోమత లేకనే ప్రభుత్వ పాఠశాలలో చేర్పించినట్లు రాధిక పేర్కొన్నారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోలేదని తెలిపారు. ఈ ఘటనపై బెల్లంపల్లి ఎంఈఓ మోహన్‌ను వివరణ కోరగా పక్షం రోజుల క్రితం రాధిక పిల్లలకు టీచర్ టీసీ ఇచ్చారని తెలిపారు. ఆ పిల్లల తల్లి కోరిక మేరకే టీసీ ఇచ్చినట్లు టీచర్ చెప్పారని పేర్కొన్నారు. సదరు విద్యార్థులను స్కూల్‌లో చేర్చుకోవాలని టీచర్‌ను ఆదేశించినట్లు ఆయన తెలిపారు.
చదువు సరిగా రావడం లేదంటే.. టీసీ ఇచ్చారు
Published Wed, Mar 2 2016 10:24 PM | Last Updated on Sun, Sep 3 2017 6:51 PM
Advertisement
Advertisement