దేనికైనా రెఢీ..! | ready to fight upto any level, says kcr | Sakshi
Sakshi News home page

దేనికైనా రెఢీ..!

Published Sun, Aug 10 2014 1:07 AM | Last Updated on Mon, Jul 29 2019 6:58 PM

దేనికైనా రెఢీ..! - Sakshi

దేనికైనా రెఢీ..!

గవర్నర్‌కు విశేషాధికారాలను సమ్మతించం
అమలు చేయబోమంటూ కేంద్రానికి రాష్ర్ట ప్రభుత్వం లేఖ
విభజన చట్టంలోని సెక్షన్ 8 అమలుకు మాత్రమే పరిమితం
ఆ పరిధి దాటి అదనపు అధికారాలు కట్టబెట్టలేం
అది సమాఖ్య స్ఫూర్తికి, రాజ్యాంగానికి విరుద్ధం
గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ వైఖరి వివరించిన ప్రధాన కార్యదర్శి
రాష్ర్ట అధికారాల్లో కేంద్రం జోక్యాన్ని సహించబోమన్న సీఎం
పార్లమెంట్‌లో కేంద్రాన్ని నిలదీయాలని పార్టీ ఎంపీలకు ఆదేశం

 
సాక్షి ప్రధాన ప్రతినిధి, హైదరాబాద్: ఉమ్మడి రాజధానిలో గవర్నర్‌కు విశేషాధికారాలపై కేంద్రం కోరుతున్నట్లుగా వ్యవహరించలేమని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారాల్లో జోక్యం చేసుకునేలా కేంద్రం వ్యవహరిస్తోందని మండిపడింది. కేంద్రం సూచనలను అమలు చేయలేమంటూ తేల్చి చెప్పింది. గవర్నర్‌కు విశేషాధికారాలు కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తూ కేంద్ర హోం శాఖ తాజాగా లేఖ రాయడంపై రాష్ర్ట ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ శనివారం కేంద్రానికి తిరుగు లేఖ రాశారు. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని పేర్కొంటూ రాష్ర్ట ప్రభుత్వ అభిప్రాయాన్ని వెల్లడించారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని 8వ సెక్షన్‌లో పొందుపరిచిన పరిమితులకు, మరీ ప్రత్యేకంగా 8(3)లో పేర్కొన్న అంశాలకు లోబడి మాత్రమే గవర్నర్ అధికారాలను ఆమోదిస్తామని, ఆ పరిధి దాటి కేంద్రం కోరుతున్న చర్యలకు అంగీకరించబోమని లేఖలో స్పష్టం చేశారు. కేంద్రం సూచించిన కొన్ని చర్యలు రాష్ట్ర ప్రభుత్వ అధికారాల్లో జోక్యం చేసుకునేలా ఉన్నాయని పేర్కొన్నారు. మరోవైపు గవర్నర్ నరసింహన్‌ను కూడా కలసి రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని సీఎస్ వివరించారు.

 కేంద్రం స్పందనేమిటో చూద్దాం!
 ఇటు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ అంశంపై పలువురు ప్రభుత్వ ముఖ్యులు, ఉన్నతాధికారులతో సమావేశమై చర్చించారు. కేంద్రం సూచనలను అమలు చేయలేమని తేల్చి చెప్పినందున.. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూద్దామని, ఈ విషయంలో దేనికైనా సిద్ధమేనని కేసీఆర్ అన్నట్లు సమాచారం. పలువురు ముఖ్యమంత్రులతో మాట్లాడతానని, ఈ అంశంలో తనతో కలసిరావాలని మద్దతు కోరుతానని కేసీఆర్ అన్నట్లు తెలిసింది. కేంద్రం సూచనలు దేశ సమాఖ్య స్ఫూర్తికి, రాజ్యాంగానికి విరుద్ధమని ఆయన అభిప్రాయపడ్డారు. గవర్నర్‌కు విశేషాధికారాలు కల్పించడమంటే రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను కబళించడమేనన్న వాదనతో సోమవారం పార్లమెంటు ఉభయసభల్లో గట్టిగా ప్రస్తావించాల్సిందిగా పార్టీ ఎంపీలను ముఖ్యమంత్రి ఆదేశించారు.

కోర్టుకూ వెళ్లే ఆలోచన!
రాజ్యాంగం ప్రకారం ప్రజలతో ఎన్నికైన ప్రభుత్వం ఉన్నప్పుడు.. ఆ రాష్ట్ర ప్రభుత్వ అధికారాల్లో గవర్నర్ రూపంలో గానీ, మరేరకంగా గానీ కేంద్రం జోక్యం చేసుకోలేదని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఒకవేళ ఈ అంశంలో కేంద్రం ఇలాగే పట్టుదలగా వ్యవహరిస్తే కోర్టును ఆశ్రయించాలని కూడా సర్కారు భావిస్తోంది. గవర్నర్ చేతికి కీలకాధికారాలను అప్పగించడానికి హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం కాదని వాదించనుంది. ‘రాష్ట్ర మంత్రిమండలిని సంప్రదిస్తూనే గవర్నర్ నిర్ణయాలు తీసుకోవాలని’ రాష్ర్ట విభజన చట్టంలోనే పేర్కొన్నందున.. అందుకు విరుద్ధంగా గవర్నర్‌కు విశేషాధికారాలను ఎందుకు కల్పించాలని ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. చట్టంలో పేర్కొన్న పరిమితుల ప్రకారమే వ్యవహరిస్తామని, రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాధికారం ఉండే అంశాల్లోనే కేంద్రం జోక్యాన్ని వ్యతిరేకిస్తున్నామని కోర్టులో వాదించేందుకు రాష్ర్ట ప్రభుత్వం సిద్ధమవుతోంది.

కేంద్రంపై రుసరుస!
నిజానికి గవర్నర్‌కు విశేషాధికారాలు కల్పించేందుకు కేంద్రం గతంలోనే తెలంగాణ సర్కారుకు లేఖ రాసింది. అయితే అది ఏమాత్రం సమ్మతం కాదని, వాటిని అమలు చేయబోమని రాష్ర్ట ప్రభుత్వం కూడా అప్పట్లోనే సమాధానం కూడా పంపించింది. ఇటీవలి మంత్రిమండలి సమావేశం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విలేకరులు ఈ విశేషాధికారాలపై ప్రశ్నించినప్పుడు... కేంద్రం అలాగే పట్టుబడితే పోరాటం తప్పదని పేర్కొన్నారు. అయితే కొంత కాలంగా ఈ విషయంపై ఎలాంటి కదలిక లేకపోవడంతో కేంద్రం కాస్త వెనక్కి తగ్గిందని ప్రభుత్వ ముఖ్యులు భావించారు. ఈ మేరకు తమకు సమాచారం ఉందని కూడా హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఇటీవల వెల్లడించారు. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్రం నుంచి మళ్లీ లేఖ రావడంతో కేంద్రం పట్టుదలగానే ఉన్నట్లు రాష్ర్టప్రభుత్వానికి అర్థమైంది.

రాజకీయంగానూ ఎదుర్కొందాం!
దేశంలో ఎన్నో సమస్యలుండగా.. పోలవరం బిల్లుకు అత్యంత ప్రాధాన్యమిచ్చి కేంద్రం హడావుడిగా పార్లమెంటులో ప్రవేశపెట్టిందని రాష్ర్ట ప్రభుత్వం ఇప్పటికే గుర్రుగా ఉంది. కొన్ని అంశాలపై అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని భావించినా కేంద్రం నుంచి ఏమాత్రం సానుకూల స్పందన కనిపించలేదు. దీనికితోడు గవర్నర్ విశేషాధికారాల పేరుతో రాజధాని ప్రాంతంపై గవర్నర్ పాలనను, తద్వారా పరోక్షంగా తమ నిర్ణయాధికారాన్ని రుద్దే ఆలోచనతోనే టీడీపీ-బీజేపీలు కేంద్రంపై ఒత్తిళ్లు తీసుకొస్తున్నాయని తెలంగాణ ప్రభుత్వ ముఖ్యుల విశ్లేషణగా తెలుస్తోంది. అందుకే దీనిపై రాజకీయ కోణంలోనూ స్పందించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై పలువురు ముఖ్యమంత్రులతో, ఢిల్లీలో ఇతర పార్టీల జాతీయ నేతలతో చర్చించి.. కేంద్రం వైఖరిని వివరించే బాధ్యతను కొందరు టీఆర్‌ఎస్ ముఖ్య నాయకులకు ఆయన అప్పగించారు. మరోవైపు పార్టీ ముఖ్యులు కూడా కేంద్రం వైఖరిపై విమర్శలకు దిగారు. కడియం, కేటీఆర్, కవిత, హరీష్‌రావు, రాజయ్య, జోగురామన్న తదితరులు మీడియా ముందు కేంద్రంపై మండిపడ్డారు. పలుచోట్ల టీఆర్‌ఎస్, టీఆర్‌ఎస్‌వీ శ్రేణులు నిరసన ప్రదర్శనలకూ దిగాయి.
 
విభజన చట్టంలోని సెక్షన్ 8లో ఏముందంటే..
8. (1) ఉమ్మడి రాజధానిలో నివసించేవారి రక్షణ, స్వేచ్ఛ, ఆస్తుల భద్రత కోసం గవర్నర్  విశేషాధికారాలను కలిగి ఉంటారు.
(2) మరీ ప్రత్యేకంగా.. ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతలు, అంతర్గత భద్రత, కీలకమైన సంస్థల రక్షణ, ప్రభుత్వ భవనాల నిర్వహణ, కేటాయింపులకు గవర్నర్ విశేషాధికారాలు వర్తిస్తాయి.
(3) ఈ దిశలో గవర్నర్ తన విధుల నిర్వహణకు తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలిని సంప్రదిస్తూనే.. అంతిమంగా తన సొంత నిర్ణయాలను వెలువరించవచ్చు.
ఈ విషయంలో గవర్నర్ సొంత విచక్షణతో తీసుకునే నిర్ణయాలే అంతిమం. వీటిని ఏ కారణాలతోనూ ప్రశ్నించటానికి అవకాశం లేదు.
(4) గవర్నర్‌కు సహకరించడానికి కేంద్రం ద్వారా ఇద్దరు సలహాదారులు ఉంటారు.
 
కేంద్రం పంపిన తాజా లేఖ సారాంశం
హైదరాబాద్, రంగారెడ్డి కలెక్టర్లు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌తో ఫిర్యాదుల విభాగం ఏర్పాటు
ఆస్తుల రక్షణ, హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వాధికారులకు గవర్నర్ ఆదేశాలు జారీచేసే అధికారం
అవసరాన్ని బట్టి ఉద్యోగులను తాత్కాలిక పద్ధతిలో పునర్నియమించే అధికారం
అత్యవసర పరిస్థితిలో బలగాల మోహరింపుపై అంతిమ నిర్ణయాధికారం
తెలంగాణ డీజీపీ, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లతో పోలీస్ సర్వీస్ బోర్డు ఏర్పాటు
ఇన్‌స్పెక్టర్ల నుంచి డీఎస్పీల దాకా బదిలీ లు, పోస్టింగులు బోర్డు ద్వారానే అమలు
బోర్డు చేసే ప్రతిపాదనల్లో మార్పులుచేర్పులకు గవర్నర్‌కు అధికారం
అంతర్గత భద్రత, ముఖ్య సంస్థల రక్షణకు జంట కమిషనరేట్లతో ప్రత్యేక సెల్
రక్షణ బలోపేతం దిశలో గవర్నర్ సూచనలను తెలంగాణ ప్రభుత్వం విధిగా అమలు చే యాలి
శాంతిభద్రతల కోణంలో చట్టానికి అనుగుణంగా ఎలాంటి ఆదేశాలైనా జారీ చేసే అధికారం
మంత్రిమండలి, ఏదేని సంస్థ తీసుకునే నిర్ణయాల రికార్డులు, సమాచారం తెప్పించుకునే అధికారం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement