
బాల్యవివాహాన్ని నిరాకరించిన బాలిక
ఇష్టం లేని పెళ్లి చేస్తుండడంతో ఓ బాలిక పెద్దలను ఎదిరించింది. చదువుపై ఉన్న మక్కువతో ఇంటి నుంచి వెళ్లిపోయి ....
* నిశ్చితార్థం తర్వాత పోలీసులను ఆశ్రయించిన వైనం
* ఎంవీఎఫ్ కార్యకర్తల చొరవ కస్తూర్బాలో చేర్చిన అధికారులు
ఆత్మకూర్(ఎస్): ఇష్టంలేని పెళ్లి చేస్తుండడం తో ఓ బాలిక పెద్దలను ఎదిరించింది. చదువుపై ఉన్న మక్కువతో ఇంటి నుంచి వెళ్లిపోయి అధికారులు, ఎంవీఎఫ్ కార్యకర్తల సహకారంతో కస్తూరిబా పాఠశాలలో చేరింది. నల్లగొండ జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల పరిధిలోని రామన్నగూడెం ఆవాసం కాశీగూడెంతండాకు చెందిన షేక్ సైదులు, సైదాబీల కూతురు అసీబా ఏపూరు జెడ్పీ హైస్కూల్లో పదవ తరగతి చదువుతోంది. కొద్దిరోజుల క్రితం బాలికకు వివాహం చేసేందుకు కుటుంబ సభ్యులు నిర్ణయించారు.
దీంతో అసీబా తాను ఇంకా చదువుకుంటానని, చిన్నతనంలో పెళ్లి చేసుకోనని తల్లిదండ్రులకు తేల్చిచెప్పింది. అయినప్పటికీ వరంగల్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తితో 20 రోజుల క్రితం నిశ్చితార్థం చేశారు. తర్వాత అసీబాను పాఠశాలకు వెళ్లకుండా ఇంటి వద్దనే ఉంచుతున్నారు. గురువారం పదో తరగతి పరీక్షలో భాగంగా పాఠశాలకు పంపారు. దీంతో అసీబా ఇష్టం లేని పెళ్లి చేసుకోలేక.. చదువుపై మక్కువను చంపుకోలేక పాఠశాల నుంచే సూర్యాపేటకు వెళ్లిపోయింది.
ఎంవీఎఫ్ కార్యకర్తలను ఫోన్లో సంప్రదించి తన ఆచూకీ తెలిపింది. ఆమెను తీసుకొచ్చిన ఎంవీఎఫ్ కార్యకర్తలు నాయిని సైదులు, వత్సవాయి లలిత, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ మంగతాయరు పోలీసులను కలసి విషయం తెలియజేశారు. బాలిక అసీబాకు ధైర్యం చెప్పిన అధికారులు ఆత్మకూరు(ఎస్) కస్తూర్బా పాఠశాలలో చేర్పించారు. ఈ విషయమై తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వనున్నట్లు ఎస్సై పరమేశ్, ఐసీడీఎస్ అధికారులు తెలిపారు.