దుండిగల్: జీవ వైవిధ్యంలో అనేక జీవరాశుల మనుగడకు పర్యావరణ సమతుల్యతే ప్రధానంగా తోడ్పడుతుందని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా భౌరంపేట్‌లోని రిజర్వ్ ఫారెస్ట్‌లో రూ.1.40 కోట్లతో ఏర్పాటు చేసిన స్నేక్ రెస్క్యూ సెంటర్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోనే తొలిసారిగా 35 ఎకరాల్లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, మరో నెల రోజుల్లో నిర్మల్‌లో కోతుల సంరక్షణ కేంద్రాన్నీ ఏర్పాటు చేస్తామన్నారు. పాములను చూసి భయపడొద్దని, స్నేక్ సొసైటీ సభ్యులకు సమాచారమిస్తే వాటిని సురక్షితంగా ఈ కేంద్రానికి తరలిస్తారన్నారు. చెన్నైలోని గిండి స్నేక్ పార్క్‌కు దీటుగా భౌరంపేట్‌లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, 180 మంది స్నేక్ సొసైటీ సభ్యులు సహకారం అందిస్తున్నారని మంత్రి చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర అటవీశాఖ ముఖ్య సంరక్షణ అధికారి ఆర్.శోభ, మేడ్చల్ కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, అటవీశాఖ అ«ధికారులు మునీంద్ర, చంద్రశేఖర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సురేశ్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment