బెయిల్‌ ఇవ్వండి: రేవంత్‌రెడ్డి | Revanth Reddy Approached High Court To Grant Bail | Sakshi
Sakshi News home page

బెయిల్‌ ఇవ్వండి: రేవంత్‌రెడ్డి

Published Sat, Mar 14 2020 3:28 AM | Last Updated on Sat, Mar 14 2020 3:28 AM

Revanth Reddy Approached High Court To Grant Bail - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నెల రోజులు మాత్రమే జైలు శిక్ష పడే కేసులో మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డిని ఇప్పటికే తొమ్మిది రోజులుగా జైల్లో పెట్టారని, చాలా చిన్న కేసు లో వెంటనే బెయిల్‌ మంజూరు చేయకుండా విచారణను వాయిదా వేయవద్దని ఆయన తరఫు సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సల్మాన్‌ ఖుర్షీద్‌ హైకోర్టుకు విన్నవించారు. తదుపరి విచారణ నాటికి సగం శిక్షాకాలం పూర్తవుతుందని, వెంటనే బెయిల్‌ ఇవ్వాలని ఆయన కోరారు. చట్ట వ్యతిరేకంగా డ్రోన్‌లను వినియోగించారన్న కేసులో బెయిల్‌ మంజూరు చేయాలంటూ రేవంత్‌ హైకోర్టును ఆశ్రయించారు.

తనపై పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలని, తనకు బెయిల్‌ మంజూరుకు తిరస్కరించిన మియాపూర్‌ కోర్టు ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ వేర్వేరుగా దాఖలు చేసిన మూడు రిట్‌ పిటిషన్లను శుక్రవారం న్యాయమూర్తి జస్టిస్‌ గండికోట శ్రీదేవి విచారించారు. రేవంత్‌ చర్యలన్నీ రాజకీయ ప్రయోజనం కోసమేనని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఆరోపించారు. ఇరుపక్షాల వాదనల తర్వాత తదుపరి విచారణ 17కి వాయిదా పడింది.

రేవంత్‌ని తప్పుడు కేసులో అరెస్టు చేశారు: మాణికం ఠాగోర్‌ 
కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి అరెస్టుపై లోక్‌సభ జీరో అవర్‌లో కాంగ్రెస్‌ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. ఈ అంశంపై కాంగ్రెస్‌ సభ్యుడు మాణికం ఠాగోర్‌ వాయిదా తీర్మానం ఇవ్వగా దానిని సభాపతి అనుమతించలేదు. కాంగ్రెస్‌ సభ్యులు నిరసన వ్యక్తం చేయడంతో జీరోఅవర్‌లో మాట్లాడేం దుకు అవకాశం కల్పించారు. మాణికం మాట్లాడుతూ.. తెలంగాణలో రేవంత్‌రెడ్డిని తప్పుడు కేసులో అరెస్టు చేశారని పేర్కొన్నారు. రాజకీయ కక్షతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రేవంత్‌ని అరెస్టు చేసిందన్నారు.

ఠాగోర్‌ మాట్లాడుతున్న సమయంలో టీఆర్‌ఎస్‌ ఎంపీలు నామా నాగేశ్వరరావు, కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్‌ అభ్యంతరం వ్యక్తంచేశారు. ఈ సమయంలో కాంగ్రెస్‌ ఎంపీలకు వీరికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కాగా, కాంగ్రెస్‌ సభ్యుడు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని, రేవంత్‌రెడ్డి డ్రోన్‌ కెమెరాతో చిత్రీకరణ జరిపి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించారన్న ఫిర్యాదు నమోదైందని, దానిపై విచారణ జరిపి అది వాస్తవమేనని పోలీసులు తేల్చారని నామా నాగేశ్వరరావు వివరించారు. ఇదిలావుండగా.. రేవంత్‌ని కక్షపూరితంగా అరెస్టు చేశారని, ఆయన త్వరితగతిన విడుదలై పార్లమెంటుకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని గురువారం కాంగ్రెస్‌ ఎంపీ జ్యోతిమణి సభాపతికి లేఖ రాశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement