
సాక్షి, హైదరాబాద్ : నక్సలైట్ల ఎజెండానే తమ ఎజెండా అని అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. అమాయక గిరిజన ప్రజలను అటవి ప్రాంతంలోకి తీసుకెళ్లి తూటాలతో హతమార్చారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ బిడ్డలైన శృతి, సాగర్, వివేక్‌ను టీఆర్‌ఎస్ ప్రభుత్వం హతమార్చి .. అమాయకుల ఎన్‌కౌంటర్లతో ఈనేలను రక్తంతో తడిపారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు ఆశించిన విధానానికి వ్యతిరేకంగా నేడు రాష్ట్రంలో పాలనలో సాగుతోందని ఆయన మండిపడ్డారు. తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని పలు కీలక అంశాలపై చర్చించారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి తీరుతుందని.. తమ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలను సంక్షేమం దిశగా మార్చే విధంగా పాలన ఉంటుందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ నాయకత్వాన్ని నేరుగా ఎదుర్కొలేక టీఆర్‌ఎస్ నాయకులు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ఆయన పేర్కొన్నారు. తన ఒక్కగానొక్క బిడ్డ వివాహానికి కూడ తనను హాజరుకాకుండా అడ్డుకోవాలని టీఆర్‌ఎస్ నేతలు తనను జైల్లో పెట్టించారని గుర్తుచేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా చివరివరకు తాను ప్రజలు పక్షాన పోరాడుతానని రేవంత్ తేల్చిచెప్పారు.
సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘రాజకీయంగా నాకు అనుభవం లేదని చాలామంది అంటున్నారు. గత పదేళ్లకుపైగా వివిధ రకాలుగా ప్రజల పక్షాన పోరాడుతున్న. మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించని అనుభవం లేకున్నా ప్రజలకు ఎలాంటి పాలనలో కావాలో నాకు విజన్ ఉంది. గతంలో ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని ఎన్టీ రామారావు.. పార్టీ స్థాపించి కేవలం తొమ్మిది నెలల్లోనే సీఎం అయ్యారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హఠాత్తుగా ప్రాణాలు కోల్పేతే అప్పటివరకు రాజకీయ అనుభం లేని రాజీవ్ గాంధీ ఏకంగా దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. సంక్షేమ పాలనకు రాజకీయ అనుభవం అవసరంలేదు. ప్రజలకు మంచి చేయలనే తపన ఉంటే చాలు. వచ్చే కాంగ్రెస్ పాలనలో అద్భుతమై పాలన అందిస్తాం. దానికొరకు భవిష్యత్తు ప్రణాళికను కూడా రూపొందించాను.
రేవంత్ ప్రసంగాన్ని కొనసాగిస్తూ..‘‘రాష్ట్రంలోని రైతులు, నిరుద్యోగులు, సామన్య ప్రజలు ఇలా అన్ని వర్గాల ప్రజలు సంక్షేమం గురించి ప్రణాళికలను సిద్దం చేశాం. ముఖ్యంగా రైతులకు కేవలం రుణమాఫీ లాంటి విముక్తి కాకుండా పంటలకు గిట్టుబాటు ధరకు కల్పిస్తాం. ప్రతీ ఏడాది ఉద్యోగాల క్యాలెండర్‌ను విడుదల చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నెలలోనే అని శాఖల నుంచి ఖాళీలను తెప్పించుకుని.. వచ్చే జూన్2 తెలంగాణ రాష్ట్ర దినోత్సవం సందర్భంగా కొత్త నియామకాలను చేపడతాం. జర్నలిస్టుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment