‘భరత్‌ అనే నేనులో పేరు మార్పుకు డబ్బులిచ్చిన కేటీఆర్’ | Revanth Reddy Shocking Comments On KTR | Sakshi
Sakshi News home page

Published Wed, May 16 2018 3:03 PM | Last Updated on Tue, May 28 2019 10:04 AM

Revanth Reddy Shocking Comments On KTR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : భరత్‌ అనే నేను సినిమాలో హీరో క్యారెక్టర్‌ పేరును భరత్‌ రామ్‌గా మార్చేందుకు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ డబ్బులిచ్చారని కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన, ఎన్నికల తర్వాత కేటీఆర్‌ యాంకరింగ్‌ చేసుకోవాల్సిందే అని అన్నారు. కర్ణాటక ఎన్నికలపై స్పందిస్తూ.. జేడీఎస్‌కు మద్దతిచ్చిన కేసీఆర్‌ ఇప్పుడు జేడీఎస్‌ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలో చెప్పాలని అన్నారు. కర్ణాటకలో జరిగిందే రేపు దేశంలో జరుగుతుందని అప్పుడు కేసీఆర్‌ ఎటువైపో తెల్చుకోవాలని తెలిపారు. అలాగే బీజేపీ అక్రమ మార్గంలో అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుందని ఆరోపించారు.

ప్రభుత్వాల ఏర్పాటులో గవర్నర్‌ల పాత్రపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. మెజార్టీ రానప్పుడు గవర్నర్లు తీసుకున్న నిర్ణయాలను సమీక్షించాలని కోరారు. గోవాలో అత్యధిక స్థానాలు గెలిచిన కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వకుండా.. బీజీపీకి అవకాశం ఇవ్వడం దారుణమన్నారు. మణిపూర్‌, మేఘాలయల్లో ఎన్నికల తర్వాత ఏర్పాటైన కూటములకు గవర్నర్లు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వలేదా అని ప్రశ్నించారు. సర్కారియా కమిషన్‌ సిఫార్సుల ప్రకారం.. మెజార్టీ కాకుండా అత్యధిక సీట్లు గెల్చుకున్న పార్టీకి నాలుగో అవకాశం ఉంటుందన్నారు. మొదటి మూడు.. పూర్తి మెజార్టీ సాధించిన పార్టీకి, ఎన్నికల ముందు కూటమికి, ఎన్నికల తర్వాత ఏర్పడిన కూటమికి అవకాశం ఉంటుందన్నారు.

ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాలకు భారత రాజ్యంగంపై నమ్మకంలేదని అన్నారు. అఖండ భారత్‌, సంప్రదాయ రక్షకులుగా ముద్ర వేసుకుని, పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. నైతిక విలువల గురించి మాట్లాడే వారు.. ఎమ్మెల్యేల కొనుగొళ్లకు ఎలా మద్దతిస్తారని ప్రశ్నించారు. సంప్రదాయాలను మీకు(బీజేపీ) అనుకులంగా మార్చుకుంటారా అని విరుచుకుపడ్డారు. ఫిరాయింపులను గవర్నర్‌ పరోక్షంగా ప్రొత్సహిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. తక్షణమే కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని డిమాండ్‌ చేశారు. బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ రేవంత్‌.. అప్పటి బీజేపీకి ఇప్పటి బీజేపీకి చాలా తేడా ఉందన్నారు. అప్పుడు అద్వానీ, వాజ్‌పేయి విలువలతో కూడిన రాజకీయం చేస్తే, ఎప్పుడు మోదీ, షాలు కేవలం అధికార కాంక్షతోనే ఫిరాయింపులకు పాల్పడి అక్రమ మార్గాల్లో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. వాజపేయి ఒక్క ఓటుతో అధికారాన్ని కోల్పోయారని, అవకాశం ఉన్నా అక్రమ మార్గాల వైపు చూడాలేదని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement