రూ. 1070 కోట్లతో గోదాముల నిర్మాణం
మంత్రి హరీశ్‌రావు వెల్లడి
హైదరాబాద్: రాష్ట్రంలో రూ. 1,070 కోట్లతో 21.54 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాముల నిర్మాణం చేపట్టాలని మార్కెటింగ్ శాఖ నిర్ణయించింది. మూడు దశల్లో వీటిని నిర్మిస్తారు. దీనికి సంబంధించి ఆ శాఖమంత్రి టి.హరీశ్‌రావు బుధవారం నాబార్డు సీజీఎం, మార్కెటింగ్ శాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్, సహకార, వేర్ హౌసింగ్ తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ రాష్ట్రంలో 54.24 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంగల గోదాములు అవసరమని గుర్తించామన్నారు. అయితే ప్రస్తుతం 32.70 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములు మాత్రమే ఉన్నాయని... ఇంకా 21.54 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములను నిర్మించాల్సిన అవసరం ఉందని ఆయన వెల్లడించారు. ఒక లక్ష మెట్రిక్ టన్నుల సామర్థ్యంగల గోదాము నిర్మాణానికి రూ. 50 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశామన్నారు.
ఆ ప్రకారం 21.54 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాముల నిర్మాణానికి రూ. 1,070 కోట్లు ఖర్చు కాగలవని వివరించారు. మూడు దశల్లో వాటిని నిర్మించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ముందుగా ఈ ఏడాది రూ. 300 కోట్లతో ఏడు లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములను నిర్మించాలని, ఆ మేరకు ప్రాంతాలను గుర్తించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. నాబార్డు ఆర్థిక సహకారంతో వీటిని నిర్మించాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. దీనికి సంబంధించిన పూర్తిస్థాయి ప్రాజెక్టు రిపోర్టును ఈ నెలాఖరులోగా తయారుచేసి తనకు సమర్పించాలని మంత్రి ఆదేశించారు.