నయా సాల్@రూ.20 కోట్లు | Rs.20 crore spent for new year celebrations | Sakshi
Sakshi News home page

నయా సాల్@రూ.20 కోట్లు

Published Fri, Jan 2 2015 2:44 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM

2014 సంవత్సరానికి బైబై చెబుతూ.. 2015కు జిల్లా వాసులు చాలా గ్రాండ్‌గా వెల్‌కం చెప్పారు.

మంచిర్యాల టౌన్ : 2014 సంవత్సరానికి బైబై చెబుతూ.. 2015కు జిల్లా వాసులు చాలా గ్రాండ్‌గా వెల్‌కం చెప్పారు. జిల్లాలో నయాసాల్ ఖర్చు అక్షరాల రూ.20 కోట్లు అంటే నమ్మాల్సిందే. డిసెంబరు 31 ఉదయం నుంచి మొదలైన అమ్మకాలు రెండు రోజులపాటు అంటే జరిగాయి. ఆదిలాబాద్, నిర్మల్, ఖానాపూర్, బోథ్, ముథోల్, ఆసిఫాబాద్, సిర్పూర్, చెన్నూర్, మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గాలతోపాటు కోల్‌బెల్ట్ పరిధిలోని మందమర్రి, సీసీసీ, శ్రీరాంపూర్ తదితర ప్రాంతాల్లో కొత్త సంవత్సర వేడుకల కోసం రూ.20 కోట్లపైగానే ఖర్చు చేశారు.

ప్రధానంగా మద్యం, మాంసంతోపాటు పార్టీలు, ఫంక్షన్‌లు, బేకరీల్లో కేక్‌లకు, మిఠాయిల కొనుగోళ్లు, స్నేహితులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడానికి గ్రీటింగులకు, మొబైల్స్‌లో ఇంటర్‌నెట్ డాటా, ఎస్‌ఎంఎస్, ఇతర రీచార్జ్‌ల కోసమే కాకుండా ఇళ్ల ఎదుట ముగ్గులు వేయడానికి అవసరమైన రంగులకు, డైరీలు, క్యాలెండర్ల కొనుగోలు తదితర వాటికి గతేడాదితో పోలిస్తే రెట్టింపు స్థాయిలో ఖర్చు చేశారు.  

రూ.15 కోట్ల మద్యం అమ్మకాలు..
జిల్లాలో కొత్త సంవత్సరం సందర్భంగా సుమారు రూ.15 కోట్ల మద్యం అమ్మకాలు జరిగి ఉంటాయని వ్యాపారులు భావిస్తుండటమే కాదు అధికారుల లెక్కలూ చెబుతున్నాయి. తూర్పు జిల్లా ప్రాంతమైన మంచిర్యాల, సింగరేణి ప్రాంతాల్లో డిసెంబరు 31 నుంచి జనవరి 1 రాత్రి నాటికి రూ.6 కోట్ల వరకు మద్యం అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది. ఉట్నూర్, గుడిపేట లిక్కర్ డిపోల ద్వారా మొత్తంగా మద్యం అమ్మకాలు పెద్ద ఎత్తున జరిగినట్లు సమాచారం. మొత్తానికి జిల్లాలో నూతన సంవత్సరంలో రూ.15 కోట్లకుపైగా మద్యం అమ్మకాలు జరిగాయి.

జోరుగా మాంసం విక్రయాలు..
కొత్త సంవత్సరంలో మద్యంతోపాటు మాంసం అమ్మకాలూ జోరుగానే జరిగాయి. చికెన్, మటన్ అమ్మకాలు ఈ ఏడాది పెద్ద ఎత్తునే కొనుగోలు చేశారు. తూర్పు జిల్లా కేంద్రమైన మంచిర్యాలలోనే 50 వరకు చికెన్, 30 వరకు మటన్ దుకాణాలు ఉండగా జిల్లా మొత్తంగా రూ.50 లక్షల వరకు అమ్మకాలు సాగాయని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. మంచిర్యాలతోపాటు సింగరేణి కోల్‌బెల్ట్ ప్రాంతాల్లో కూడా చికెన్, మాంసం అమ్మకాలు రెండు రోజుల్లో భారీగా జరిగాయి. మొత్తానికి జిల్లాలో రూ.50 లక్షల వ్యాపారం జరిగి ఉంటుందని వ్యాపారులు పేర్కొంటున్నారు. రూ.140కి కిలో చికెన్, రూ.450కి కిలో చొప్పున మాంసం అమ్మకాలు సాగించారు.

ఇటు కేక్‌లు... అటు మిఠాయిలు..
నూతన సంవత్సరానికి మిఠాయిలు, బేకరీ దుకాణాలు కిటకిటలాడాయి. నూతన సంవత్సరం సందర్భంగా మంచిర్యాల పట్టణంలోనే రూ.50 లక్షల విలువైన కేక్‌లు విక్రయించారు. జిల్లా వ్యాప్తంగా చూస్తే దాదాపు రూ.2 కోట్ల వరకు బేకరీలు కేక్‌ల వ్యాపారాన్ని నిర్వహించాయి. అలాగే కూల్‌డ్రింక్స్ కూడా పెద్ద ఎత్తున అమ్మకాలు జరిగాయి. ఎస్‌ఎంఎస్‌ల పేరుతో వివిధ రకాల నెట్‌వర్క్ కంపెనీలు లక్షల్లో వ్యాపారాన్ని చేశాయి.

కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించడానికి ఇంటి లోగిళ్ల ముందు రంగులతో ముగ్గులు వేయడానికి జిల్లా వ్యాప్తంగా రూ. కోటి వరకు రంగుల అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది. వీటితోపాటు నూతన సంవత్సరానికి శుభాకాంక్షలు తెలపడానికి పూలు, పూల బొకేలు, గ్రీటింగ్ కార్డులు, బాణాసంచా తదితర వాటికి పెద్ద మొత్తంలోనే ఖర్చు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement