
ప్రాజెక్టుల పరుగులు
భూ సేకరణ ఇలా (ఎకరాల్లో)..
ప్రాజెక్టు సేకరించాల్సింది సేకరించింది
నెట్టెంపాడు 26,542 21,657
రాజీవ్‌భీమా 17,254 15,591
కల్వకుర్తి 17,254 16,532
జూరాల 10,000 9,196
కోయిల్‌సాగర్ 7,230 6,476
సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లాలో నాలుగు అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టులు, లింక్ కెనాల్స్ పనులు ముమ్మరం అవుతున్నాయి. ఎన్నో ఏళ్లనుంచి భూ సేకరణ పూర్తికాక నత్తనడకన సాగిన పనులు ఇప్పుడు జోరందుకుంటున్నాయి. కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను ఆసరా చేసుకొని ప్రాజెక్టుల పనులు చకచకా నిర్వహించేందుకు రాష్ట్ర సర్కారు అడుగులు వేస్తోంది. జిల్లాలోని ఆరు ప్రధాన ప్రాజెక్టులకోసం 8,828 ఎకరాల భూమిని సేకరించే పని లో అధికార యంత్రాంగం నిమగ్నమైం ది. దీంతో వచ్చే ఏడాది పాలమూరు భూములు పచ్చగా మార్చేందుకు సర్కారు సన్నద్ధం చేస్తోంది.
ఏళ్లు గడుస్తున్నా నత్తనడకనే...
జిల్లా తలాపునుంచే రెండు ప్రధానమైన నదులు ప్రవహిస్తుంటాయి. కానీ వాటినుంచి జిల్లావాసులకు పెద్దగా ప్రయోజ నం చేకూరడం లేదు. దీంతో పొట్టకూటి కోసం జిల్లావాసులు ముంబై, దుబాయి తదితర ప్రాంతాలకు వలసలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే పాలమూరు వలస కష్టాలను నివారించేందుకు ప్రాజెక్టుల రూపకల్పన చేశారు.
రాజీవ్‌భీమా, నెట్టెం పాడు, కల్వకుర్తి (మహాత్మాగాంధీ ఎత్తిపోతల) తదితర వాటి ద్వారా జిల్లా కష్టాలను తీర్చాలని భావించారు. వైఎస్‌ఆర్ ఉన్నంత వరకు ఆయా ప్రాజెక్టుల పనులు పరుగులు పెట్టించారు. కేవలం నాలుగేళ్లలో ప్రధాన ప్రాజెక్టుల పనులు పూర్తయి ఇప్పటికే పూర్తిస్థాయి ఆయకట్టుకు సాగునీటిని అందించాల్సి ఉంది. కానీ వైఎస్‌ఆర్ మరణానంతరం ఆయా ప్రాజెక్టుల పనులు పూర్తిగా నెమ్మదించాయి. ఐదేళ్లుగా పనులన్నీ పూర్తిగా స్తంభించి, ఎక్కడిక్కడే నిలిచిపోయాయి.
తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ప్రాజెక్టుల పనులు త్వరితగతిన పూర్తయి 2015 ఖరీఫ్ నాటికి పూర్తిస్థాయి ఆయకట్టుకు సిద్ధమవుతాయని భావించిన తరుణంలో ప్రాజెక్టుల భూసేకరణ ప్రధాన సమస్యగా మారింది. యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన భూసేకరణ చట్టం ప్రకారం... కొరకరాని కొయ్యలా తయారై జిల్లాలో ప్రాజెక్టులకు కావాల్సిన భూసేకరణ సాధ్యపడలేదు. దీంతో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కొత్త ఆర్డినెన్స్ తీసుకురావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది.
ప్రస్తుతం జిల్లాలో మూడు ప్రధాన భారీ ఎత్తిపోతల పథకాల్లో మట్టి పనులు, రిజర్వాయర్ పనులు, కాలువల తవ్వకాల పనులు పూర్తయ్యాయి. కీలకమైన డిస్ట్రిబ్యూటర్లు, తూములు, ప్రధాన సిమెంటు నిర్మాణ పనులకు అవసరమైన భూమిని సేకరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వచ్చే ఖరీఫ్ నాటికి నిర్దేశించిన లక్ష్యం మేరకు సాగునీరు అందించేందుకు ప్రాజెక్టులకు కావాల్సిన భూసేకరణ త్వరతగతిన పూర్తిచేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం వడివడిగా అడుగులు వేస్తోంది.
ప్రాజెక్టుల లక్ష్యాలు ఇలా...
జిల్లాలో ప్రధాన ప్రాజెక్టులలో ఒకటైన నెట్టెంపాడు ద్వారా మొత్తం రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్ర భుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రా జెక్టు ద్వారా రెండు పంప్‌హౌస్‌లను ఉపయోగించి దీనికిందున్న ఏడు రిజర్వాయర్లకు నీటిని సరఫరా చేసేలా ప్రణాళిక ర చించారు. అక్కడి నుంచి మొత్తం రెండు లక్షల ఎకరాల పొలానికి సాగునీరు అం దించనున్నారు. అలాగే రాజీవ్‌భీమా ఎత్తిపోతల ద్వారా కూడా మరో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది.
ఈ ప్రాజెక్టును పూర్తిచేయడం ద్వారా మక్తల్, దేవరకద్ర, తదితర నియోజకవర్గాల్లో రెండు లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే అవకాశం ఉంది. అదేవిధంగా కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా మూడు లక్షల ఎకరాలకుపైగా సాగునీరు అందించనున్నారు. మొత్తం 25 టీఎంసీల నీటిని ఉపయోగించి నాలుగుచోట్ల బ్యాలెన్సింగ్ రిజార్వాయర్లు నిర్మించి సాగునీరు అందించనున్నారు. మొదటి పంపు ద్వారా మొన్నటి ఖరీఫ్ పంటకు నీటిని విడుదల చేశారు.
రెండో లిఫ్టులో మొత్తం ప్రాజెక్టు లక్ష్యం ఉన్నందున మిగతా పనులను వేగవంతం చేసి వచ్చే ఖరీఫ్ నాటికి నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అలాగే ప్రస్తుతం సాగునీరు అందిస్తోన్న జూరాల, కోయిల్‌సాగర్ ఆయకట్టును కూడా పూర్తిగా పనులు చేపట్టి చివరి ఆయకట్టుకు నీరందించాలని భావిస్తోంది. ఇలా మొత్తం మీద వచ్చే ఖరీఫ్ నాటికి నెట్టెంపాడు ద్వారా 2లక్షల ఎకరాలు, భీమా ద్వారా 2లక్షల ఎకరాలకు, కల్వకుర్తి ద్వారా 3.30లక్షల ఎకరాలలో సాగునీరు కనీసం 80 శాతం మేరకైనా అందించేందుకు అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు.