
యాదగిరిగుట్ట(ఆలేరు) : నేను తెలుగులో వందవ సినిమా ప్రజలందరికీ ఆదర్శంగా ఉండే విధంగా ఉండేలా తీస్తానని సినీ హీరో సుమన్ పేర్కొన్నారు. ప్రతి ఇంట్లో హీరోనే ఉన్నాడు ఈతరంలో.. వారిని దృష్టిలో పెట్టుకొని నూతనంగా వందో సినిమా తీసే నిర్మాత కోసం వేచి చూస్తున్నా.. వచ్చే ఏడాదిలో కచ్చితంగా వందవ సినిమా విడుదలయ్యే విధంగా ముందుకు వెళ్తున్నా.. ఇప్పటికే ఎనిమిది భాషల్లో 500 సినిమా తీశాను.. సినిమా హిట్ అయినా.. ఫట్ అయినా.. అభిమానులు ఇంకా నాతోనే ఉన్నారు.. చాలా సంతోషంగా ఉంది.. 40 సంవత్సరాల్లో ఎన్నో విజయాలు, ఓటములు అందుకున్నానని పేర్కొన్నారు. యాదగిరిగుట్టకు వచ్చిన సినీ హీరో సుమన్‌తో ‘సాక్షి’ ఇంటర్వ్యూ..
ఇప్పటి వరకు ఎన్ని భాషల్లో సినిమాలు తీశారు..?
తమిళం, కన్నడం, తెలుగు, మళయాలం, హిందీ తదితర భాషల్లో ఇప్పటి వరకు సినిమాలు తీశాను. అన్ని భాషలు కలిపి ఎనిమిది వందల సినిమాలను తీశాను. దాదాపు 40 సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో స్థిరపడి ఉన్నాను. తెలుగు సినిమాలో ఇప్పటికి 99 సినిమాలు తీశాను.
ఎనిమిది భాషల్లో ఎక్కువగా ఎక్కడ ప్రాధాన్యత ఇస్తారు..?
మా తల్లిదండ్రుల ఊరు కర్ణాటక.. నేను పుట్టింది కర్ణాటకలో.. నేను ఫేమస్ అయింది తెలుగులో.. చేసింది ఎనిమిది భాషలు. ఇవ్వన్ని ఎలా ఉన్నా దాదాపు 30 సంవత్సరాలు తెలంగాణాలోనే ఉన్నాను. అనుకోకుండా ఒక్కో భాష నుంచి క్లిక్ అయ్యాను. కానీ ఎక్కువగా నేను తెలంగాణకే ప్రథమ ప్రాధాన్యత ఇస్తాను. దాని తరువాత ఇండియాకు ప్రాధాన్యత ఇస్తాను.
రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిసింది..?
రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు వస్తాను. ఏ పార్టీ అని తెలియదు. నాకున్న ఎజెండా నాకు ఉంటుంది. నన్ను సినిమా ఫీల్డ్‌కు ప్రజలు తీసుకువచ్చారు. ప్రజల ఆశీర్వాదం, అభిమానుల అండదండలతో ఈ స్థాయికి వచ్చాను. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం ఉంటే రాజకీయాల్లోనే కాదు సినిమా రంగంలో ఉండి కూడా చేయవచ్చు.
తెలంగాణ ఉద్యమంలో హీరో సుమన్ పాత్ర ఉందా..?
తెలంగాణ వచ్చే ముందే జైతెలంగాణ అని నినదించి చెప్పాను. తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ఫీల్ అయ్యాను. ఎంతో మంది త్యాగాలు చేశారు. వారందరినీ చూసి చలించిపోయాను. దీంతో ఉద్యమంలో పలు చోట్లా పాల్గొన్నాను. కానీ ఇంత త్వరగా తెలంగాణ వస్తుందని అనుకోలేదు. ఈ రోజు ప్రజలు సంతోషంగా ఉన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు అయింది. రాజకీయాల్లో చాలామందికి పదవులు వచ్చాయి. ఇవ్వన్నీ కేసీఆర్‌తోనే సాధ్యమైంది. శాంతిభద్రతల విషయంలో తెలంగాణ ప్రభుత్వం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తుంది.
ఎలాంటి సినిమాలు తీయాలనుకుంటున్నారు..?
రాబోయే రోజుల్లో మంచి సినిమాలు తీయాలని అనుకుంటున్నాను. ప్రధానంగా ఫ్యామిలీ, కుటుంబ సభ్యులకు, పిల్లలకు మెసేజ్ ఇచ్చే సినిమాలు తీయాలని నా ఉద్దేశ్యం. త్వరలోనే ఫైర్ ఫైటర్ గూర్చి సినిమా తీయాలనుకుంటున్నాను. హత్య జరిగిందంటే పోలీసులు వస్తున్నారు.. అదే అగ్నిప్రమాదం జరిగితే ఆ సందర్భంలో ఫైర్ ఫైటర్ రావాలి. దీంతో పైర్‌ఫైటర్‌కు గౌరవం పెరుగుతుంది. ఇలాంటి సినిమాలు తీయడంతో యువతకు ఆదర్శంగా నిలవాలనే ధ్యేయం.
సుమన్‌కు ఎక్కువగా విలన్ పాత్రలే వస్తున్నాయని అభిమానుల టాక్..?
నేను విలన్‌గా ఏ సినిమాలో చేయలేదు. శివాజీ సినిమాలో చేసిన క్యారెక్టర్ టైపు వస్తే చేస్తాను. శివాజీ సినిమాలో ఉన్న హీరోటైపు ఉన్న వ్యక్తి, అలాంటి డైరెక్టర్, సినిమాలో ఉంటేనే క్యారెక్టర్ చేస్తా. హీరోకు ఎంత పేరు వస్తుందో అలాంటి పేరు విలన్‌కు వస్తేనే చేస్తాను. శివాజీ సినిమాలో రజినీ కాంత్‌కు ఎంత పేరు వచ్చిందో అంత పేరు నా పాత్రకు, నాకు వచ్చింది.
ప్రస్తుతం ఏఏ భాషల్లో సినిమాలు తీస్తు బిజీగా ఉన్నారు..?
తెలుగులో 6 నుంచి 7 సినిమాలు తీస్తున్నాను. నెగిటివ్ రోల్స్ కాకుండా పాజిటివ్ రోల్స్, మంచి కథతో తీస్తున్నాం. ప్రస్తుతం వృత్తిపరంగా సంతోషంగా ఉన్నాను.
Comments
Please login to add a commentAdd a comment