
సాక్షి, హైదరాబాద్: డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ అధ్యక్షతన శాసనమండలి పిటిషన్ల కమిటీ బుధవారం సమావేశమైంది. శాసనమండలి సమావేశాల్లో మండలి సభ్యులు వివిధ సమస్యలపై ఇచ్చిన పిటిషన్లు, వాటి పరిష్కార పురోగతిపై ఈ భేటీలో చర్చించారు. మండలి సభ్యులు వివిధ అంశాలపై ఇచ్చిన నాలుగు పిటిషన్లపై చర్చించి, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సాక్షర భారత్ కో ఆర్డినేటర్ల (సమన్వయకర్తల)కు చెల్లించాల్సిన జీతాలపై చీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి ఇచ్చిన పిటిషన్‌పై ఈ సమావేశంలో చర్చించారు.
2017 అక్టోబర్ నుంచి మార్చి 2018 వరకు పెండింగ్‌లో ఉన్న జీతాలను త్వరలోనే చెల్లించనున్నట్టు అధికారులు కమిటీకి తెలిపారు. సాక్షర భారత్‌పై కేంద్ర ప్రభుత్వం కొత్త విధానం తీసుకువచ్చినప్పటికీ ఇప్పుడున్న వారినే మున్ముందు కూడా కోఆర్డినేటర్లుగా రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తుందని అధికారులు తెలిపారు. మోడల్ స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకం సిబ్బందికి కూడా మండల, జిల్లా పరిషత్ స్కూళ్ల మధ్యా హ్న భోజన పథకం సిబ్బంది తరహాలో వేత నాలు ఇవ్వాలని పాతూరి ఇచ్చిన పిటిషన్‌ను ప్రభుత్వం పరిశీలిస్తోందని, ఇంకా నిర్ణయం తీసుకోలేదని వివరించారు.
శామీర్‌పేట మండలం దేవరయాంజాల్‌లో శిథిలావస్థలో ఉన్న జిల్లాపరిషత్ స్కూల్ భవనాన్ని కూల్చివేసి అక్కడే కొత్తభవనాన్ని నిర్మించాలన్న పిటిషన్‌పై అధికారులు సానుకూలంగా స్పందించారు. దేవరయాంజాల్‌లో పాఠశాల భవన నిర్మాణ పనులు త్వరలోనే మొదలవుతాయన్నారు. యూజీసీ కింద వేతనాలు పొందే అధ్యాపకులకు రాష్ట్రంలో ఏడో వేతన సవరణ సంఘం సిఫారసుల కనుగుణంగా 2016 నుంచి జీతాలు చెల్లించాలన్న పిటిషన్‌పై కూడా తగిన కసరత్తు జరుగుతోందని అధికారులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment