
పోలీసుల నుంచి నా కుమారుడిని కాపాడండి
ఓ పోలీసు అధికారి మేనకోడలిని కులాంతర వివాహం చేసుకున్నందుకు పోలీసులు తన కుమారుడు, భర్తపై అక్రమ కేసులు బనాయించి, తీవ్రంగా హింసించి, డబ్బు,
కులాంతర వివాహం చేసుకున్నందుకు అక్రమ కేసులు పెట్టారు
హైకోర్టుకు అనంతపురం గృహిణి పుష్పలత లేఖ
లేఖను పిల్‌గా పరిగణించిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ఓ పోలీసు అధికారి మేనకోడలిని కులాంతర వివాహం చేసుకున్నందుకు పోలీసులు తన కుమారుడు, భర్తపై అక్రమ కేసులు బనాయించి, తీవ్రంగా హింసించి, డబ్బు, బంగారం తీసుకున్నారని, ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ అనంతపురం, గంగానగర్‌కు చెందిన కె.పుష్పలత విట్టల్ రాసిన లేఖపై ఉమ్మడి హైకోర్టు స్పందించింది. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలను తమ ముందుంచాలంటూ ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, అనంతపురం ఎస్‌పీ, తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, రంగారెడ్డి జిల్లా ఎస్‌పీ, తాండూరు సీఐ సైదులురెడ్డి, అనంతపురం మూడవ టౌన్ సీఐ గోరంట్ల మాధవ్, ఇబ్రహీంపట్నం ఎస్‌ఐలు నాగరాజు, లింగస్వామి, కానిస్టేబుల్ నీలం బాలకృష్ణ తదితరులకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్లు దాఖలు చేయాలంటూ విచారణను జూలై 4కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ తెల్లప్రోలు రజనీలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
పరిధి దాటుతున్న పోలీసులు
‘తాండూరు సీఐ సైదులురెడ్డి మేనకోడలు సౌమ్యారెడ్డి, నా కుమారుడు సాయిచైతన్య గురునానక్ కాలేజీలో చదివే సమయంలో ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. పెద్దలకు భయపడి వారు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ విషయంలో తెలుసుకున్న సైదులురెడ్డి తన పలుకుబడి ఉపయోగించి అనంతపురం మూడవ టౌన్ సీఐ గోరంట్ల మాధవ్‌కు చెప్పి నా కొడుకు, భర్తపై తప్పుడు కేసు బనాయించారు. ఇందుకు ఇబ్రహీంపట్నం ఎస్‌ఐలు నాగరాజు, లింగస్వామి, కానిస్టేబుల్ బాలకృష్ణ తదితరులు సహకరించారు.
నా కొడుకు, భర్తపై రేప్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. తరువాత హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. ఏ కేసు లేకుండా చేస్తామని చెప్పి పై అధికారులకు ఇవ్వాలంటూ రూ.45వేలు, నాలుగు బంగారు గాజులు, నా తాళిబొట్టు పట్టుకెళ్లారు. అయితే నా కొడుకు, భర్తలను చర్లపల్లి జైలుకు పంపారు. బెయిల్‌పై బయటకు వచ్చిన తరువాత సౌమ్యరెడ్డితో ఈవ్ టీజింగ్ కేసు పెట్టించి అరెస్ట్ చేయించారు. తరువాత ఖాళీ కాగితాలపై సంతకాలు తీసుకున్నారు. ఇప్పుడు రౌడీషీట్ తెరిచేందుకు సిద్ధంగా ఉన్నారు. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని న్యాయం చేయండి’ అంటూ పుష్పలత ఏప్రిల్ 12న హైకోర్టుకు లేఖ రాశారు. ఈ లేఖను ఏసీజే పిల్ కమిటీకి పంపారు.
దానిని పరిశీలించిన పిల్ కమిటీలోని న్యాయమూర్తులు ఈ లేఖను పిల్‌గా పరిగణించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. లేఖను పరిశీలిస్తే ఇది వ్యక్తిగత వివాదంగా కనిపిస్తున్నప్పటికీ, పోలీసులు పరిధి దాటి వ్యవహరిస్తున్న కేసులు పెరిగిపోతున్నాయని ఓ న్యాయమూర్తి తన అభిప్రాయాన్ని లిఖితపూర్వకంగా రాశారు. సమాజంలో ఇటీవలి కాలంలో ఈ ధోరణి ఎక్కువైపోయిందని, అందువల్ల ఈ లేఖను పిల్‌గా పరిగణించడమే సబబని ఆయన తేల్చి చెప్పారు.
దీంతో ఏసీజే ఈ లేఖను పిల్‌గా పరిగణిస్తూ ఆ మేర తగిన చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీని ఆదేశించారు. రిజిస్ట్రీ ఈ లేఖను పిల్‌గా మలిచి, తదుపరి విచారణ నిమిత్తం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఉంచింది. ఈ వ్యాజ్యాన్ని మంగళవారం విచారించిన ధర్మాసనం, ప్రతి వాదులందరికీ నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలను కోర్టు ముందుంచాలంటూ విచారణను జూలై 4కి వాయిదా వేసింది.