హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద జరిగిన తోపులాటలో కిందపడిన ఎమ్మార్పీఎస్ కార్యకర్త భారతి (ఇన్‌సెట్‌లో) ఫైల్ ఫొటో
సాక్షి, హైదరాబాద్ : ఎస్సీ వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ చేపట్టిన చలో కలెక్టరేట్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించిన కార్యకర్తలకు పోలీసులకు మధ్య జరిగిన తోపులాటలో ఓ మహిళ తీవ్ర అస్వస్థతకు గురైంది. హుటాహుటిన ఆమెను ఉస్మానియాకు తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో ప్రభుత్వం, పోలీసుల తీరుపై ఎమ్మార్పీఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ఆరోపించింది.
తోపులాటలో కిందపడిపోయి..
ఎస్సీ వర్గీకరణ కోసం అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలంటూ ఎమ్మార్పీఎస్ సోమవారం చలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తొలుత ఎమ్మార్పీఎస్ నాయకులు నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకుని అక్కడే బైఠాయించారు. లోనికి వెళ్లేందుకు యత్నించగా.. అప్పటికే అక్కడికి భారీగా చేరుకున్న పోలీసులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ఈస్ట్ మారేడ్‌పల్లి గాంధీకాలనీకి చెందిన ఎమ్మార్పీఎస్ కార్యకర్త భారతి(45) అస్వస్థతకు గురై కింద పడిపోయింది. వెంటనే ఎమ్మార్పీఎస్ నాయకులు ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఈ విషయం తెలియగానే ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు, ప్రజా సంఘాల నాయకులు, అధికార, విపక్ష నేతలు పెద్దఎత్తున ఉస్మానియాకు చేరుకున్నారు.
ఇదీ ప్రభుత్వ హత్యే..: నాయకులు
ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో ఉస్మానియా వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆస్పత్రిలో నాలుగు గంటల పాటు గందరగోళం నెలకొంది. ఎమ్మార్పీఎస్ కళా మండలి జాతీయ నాయకులు ఎన్.సి.అశోక్ మాదిగ, ఆస్పత్రికి చేరుకొని తన బృందంతో భారతి పేరిట అప్పటికప్పుడు పాట కట్టి ఆలపించారు. తర్వాత ఎమ్మార్పీఎస్ నాయకులు మాట్లాడుతూ.. తాము శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే పోలీసులే అడ్డుకున్నారని, ఇది ప్రభుత్వ హత్యేనని వారు మండిపడ్డారు. ఏబీసీడీ వర్గీకరణ సాధన కోసం సీఎం కేసీఆర్ వెంటనే కేంద్రంతో చర్చించాలని డిమాండ్ చేశారు.
ఆసుపత్రికి తరలివెళ్లిన నేతలు..
భారతి మృతి వార్త తెలియగానే వివిధ పార్టీల నేతలు ఉస్మానియా ఆసుపత్రికి వెళ్లి ఆమె భౌతికకాయానికి నివాళులు అర్పించారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, సీఎల్పీ నేత జానారెడ్డి, బీజేపీ శాసన సభాపక్ష నేత కిషన్‌రెడ్డి తదితరులు వారిలో ఉన్నారు. మరోవైపు భారతి మృతి పట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సంతాపం ప్రకటించారు. ఆమె ప్రాణాలకు పాలకుల నిర్లక్ష్యమే కారణమన్నారు. అసెంబ్లీలో ప్రకటనకు మాత్రమే పరిమితం కాకుండా వెంటనే అఖిలపక్షాన్ని, ఎమ్మార్పీఎస్ నాయకత్వాన్ని ప్రధాని వద్దకు తీసుకువెళ్లాలని హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర వామపక్ష పార్టీల సమావేశం డిమాండ్ చేసింది.
రూ.25 లక్షల నష్టపరిహారం: కడియం
‘‘గత 23 సంవత్సరాలుగా వర్గీకరణ కోసం ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ పోరాటంలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోవాల్సి రావడం దురదృష్టకరం. భారతి మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియాతోపాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తాం. ఏబీసీడీ వర్గీకరణ కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్తానని సీఎం హామీ ఇచ్చారు’’
పోలీసుల అత్యుత్సాహం వల్లే: జానారెడ్డి
‘‘ఎమ్మార్పీఎస్ పోరాటం ఇతర ఉద్యమాలకు ఓ కనువిప్పు. వారి పోరాట పటిమను ప్రశంసిస్తున్నాం. పోలీసుల అతి ఉత్సాహమే భారతి మరణానికి కారణం. అసెంబ్లీ నుంచి అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లేలా మేమే టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాం. కేంద్రంపైనా ఒత్తిడి తెస్తాం.
ఆమె త్యాగం వృథా కాదు: కిషన్‌రెడ్డి
‘‘ఎస్సీ వర్గీకరణ కోసం ఓ మహిళ అసువులు బాసడం ఎంతో విచారకరం. ఆమె త్యాగం వృథా కాదు’’
అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలి: మోత్కుపల్లి నర్సింహ్ములు, మాజీ ఎమ్మెల్యే
‘‘సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో వర్గీకరణ సమస్యను పరిష్కరించాలి. అఖిల పక్షాన్ని ప్రధాని వద్దకు తీసుకువెళ్లాలి. వర్గీకరణకు టీడీపీ సంపూర్ణ మద్దతు ఇస్తోంది’’
Comments
Please login to add a commentAdd a comment