పెట్రోలు బంకుల మోసాలు...గప్ ‘చిప్’ | Scandals sell petrol ... with no 'chip' | Sakshi
Sakshi News home page

పెట్రోలు బంకుల మోసాలు...గప్ ‘చిప్’

Published Wed, Jun 4 2014 11:49 PM | Last Updated on Wed, Oct 3 2018 6:55 PM

పెట్రోలు బంకుల మోసాలు...గప్ ‘చిప్’ - Sakshi

పెట్రోలు బంకుల మోసాలు...గప్ ‘చిప్’

  •     మళ్లీ ‘చిప్’ బాగోతం బట్టబయలు
  •      అటు కొలతలో తరుగు.. ఇటు నాణ్యతలో దగా
  •      ఎడాపెడా వినియోగదారులకు టోకరా
  •      బంకుల యాజమాన్యాల ఇం‘ధన’ దోపిడీ
  •      ఫిర్యాదులొస్తేనే తూ.కొ. శాఖ చర్యలు
  •  సాక్షి, సిటీ బ్యూరో: పెట్రోలు బంకుల మోసాలకు అడ్డుకట్ట పడటం లేదు. అటు కొలతలో.. ఇటు నాణ్యతలో వినియోగదారులు దగా పడుతూనే ఉన్నారు. పంపింగ్‌లో, మీటర్ రీడింగ్‌లో చేతివాటం చూపడం దగ్గర్నుంచి ఏకంగా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించడం వరకు మోసాల స్థాయి పెరిగి.. యథేచ్ఛగా సాగుతూనే ఉంది. ఫలితంగా ఇం‘ధన’ రూపేణా గ్రేటర్‌లోని పెట్రోల్, డీజిల్ వినియోగదారుల జేబుకు నిత్యం లక్షల్లో చిల్లుపడుతోంది.

    బుధవారం భారత్ పెట్రోలియం కార్పొరేషన్‌కు చెందిన ఉప్పల్‌లోని జయలీల ఫిల్లింగ్ స్టేషన్ మోసాల తంతు బట్టబయలైన తీరు మరోసారి వినియోగదారులు ఉలిక్కిపడేలా చేసింది. బంకుల నిర్వాహకులు తమపై సరైన నిఘా, పర్యవేక్షణ లేకపోవడాన్ని సాకుగా తీసుకుని సాఫ్ట్‌వేర్ చిప్‌లతో మీటర్ రీడింగ్‌లో జంపింగ్‌కు పాల్పడుతూ దోపిడీ చేస్తున్నారు. ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేయాల్సిన తూనికల, కొలతల శాఖ అధికారులు.. వినియోగదారుల నుంచి ఫిర్యాదులందితే కానీ కాలు కదపట్లేదు.

    పోలీసు టాస్క్‌ఫోర్స్ ప్రత్యేక బృందం ఆరు నెలల క్రితం పెట్రోలు బంకుల సాఫ్ట్‌వేర్ చిప్ మోసాలను బయటపెట్టినా.. తూనికలు కొలతల శాఖ నామమాత్రపు తనిఖీలతో సరిపెట్టింది. అప్పట్లోనే గట్టి చర్యలు తీసుకుని ఉంటే బుధవారం మరో మోసం బయటపడేది కాదు. బుధవారం నాటి ఘటనలో, ఉప్పల్ జయలీల బంకులో ప్రతి లీటర్‌కు 2.30 ఎంఎల్ మేర కొలతలో తరుగు ఉన్నట్టు తేలింది. అంటే ఈ లెక్కన గ్రేటర్ వ్యాప్తంగా ఉన్న బంకుల్లో ఏ మేరకు వినియోగదారులు నష్టపోతున్నారో అర్థం చేసుకోవచ్చు.

    జరిమానాలతో సరి.. బెదరని డీలర్లు
     
    పెట్రోలు బంకుల మోసాలపై నమోదవుతున్న కేసులు కేవలం జరిమానాలకే పరిమితవుతున్నాయి. దీంతో బంకుల డీలర్లు బెరుకు లేకుండా అక్రమాలకు పాల్పడుతున్నారు. ఆరు నెలల క్రితం కొన్ని ఫిల్లింగ్ యంత్రాల సాఫ్ట్‌వేర్‌లో ప్రత్యేక  చిప్‌లను రిమోట్ ద్వారా ఆపరేట్ చేస్తూ, మరికొన్నింటిలో సాక్షాత్తూ ఆయిల్ కంపెనీలు సరఫరా చేసిన రిమోట్‌లోనే మార్పుచేర్పుల ద్వారా ఇంధనం పంపింగ్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నట్టు వెలుగుచూసిన ఘటన వినియోగదారులను నివ్వెరపరిచింది.

    అప్పట్లో ఆయిల్ కంపెనీలు సరఫరా చేసిన ఫిల్లింగ్ మిషన్ మోడల్‌ను తప్పుపట్టి హడావుడి చేసిన అధికారులు ఆపై నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకొన్నారు. బంకుల మోసాలపై భారత తూనికలు కొలతల చట్టం-2009 సెక్షన్ 22 కింద కేసులు నమోదు చేసి జరిమానాలతో సరిపెట్టారు. దీంతో బంకు యాజమాన్యాలకు భయం లేకుండాపోయింది. తాజాగా బుధవారం వెలుగుచూసిన ఘటనతో వినియోగదారులు కంగుతిన్నారు.
     
    మోసాలు ఇలా...
    పెట్రోల్ బంకులకు ఆయిల్ కంపెనీలే ఫిల్లింగ్ యంత్రాలను సరఫరా చేస్తాయి. కొన్ని కంపెనీలు నిబంధనలకు విరుద్ధంగా ఫిల్లింగ్ యంత్రంలో మార్పుచేర్పులతో పాటు రిమోట్ ద్వారా ఆపరేట్‌కు వెసులుబాటు కల్పించాయి
         
    దీన్ని ఆసరా చేసుకున్న యాజమాన్యాలు పెట్రోలు, డీజిల్ పంపింగ్ రీడింగ్‌లో జంపింగ్‌లకు పాల్పడుతూ వినియోగదారులకు తూకంలో టోకరా వేస్తున్నాయి
         
    కొన్ని కంపెనీల్లో ఫిల్లింగ్ యంత్రాలకు రిమోట్ వెసులుబాటు లేకున్నా.. పంపింగ్ యంత్రాల్లో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను అమర్చి కొలతల్లో మోసాలకు పాల్పడుతున్నారు
         
    సాధారణంగా ప్రతి ఫిల్లింగ్ యంత్రానికి తూనికలు కొలతల శాఖ సీల్ వేసి ఉంటుంది. బంకుల యాజమాన్యాలు దీన్ని బ్రేక్ చేసి సైతం మోసాల సాఫ్ట్‌వేర్ చిప్‌లను అమర్చుతున్నారు
         
     పెట్రోల్ బంకుల్లోని ఫిల్లింగ్ యంత్రంపై చూస్తే రీడింగ్‌సవ్యంగానే కనిపిస్తుంది. కానీ, ప్రత్యేక సాఫ్ట్‌వేర్ చిప్‌లను అమర్చిన కారణంగా ప్రతి వెయ్యి లీటర్లలో 40 లీటర్ల మేర ఇంధనం బంకుల నిర్వాహకులకు ‘ఆదా’ అవుతోంది
         
     ఒక్కో బంకులో నిత్యం పది వేల లీటర్ల ఇంధనాన్ని విక్రయిస్తారనుకుంటే, 400 లీటర్ల మేర యాజమాన్యానికి ‘మిగులు’బాటవుతోంది. ఫలితంగా వినియోగదారులు ఎడాపెడా నష్టపోతున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement