- రూ.15 వేలు లంచం తీసుకుంటూ..
- ఏసీబీకి పట్టుబడ్డ ఎక్సైజ్ సీనియర్ అసిస్టెంట్
- ఇది రెండోసారి..
ఓ సారి ఏసీబీకి చిక్కి సస్పెండయినా... ఆ అధికారి తీరు మారలేదు. ‘జూనియర్’ స్థాయిలో చేసిన తప్పునే ‘సీనియర్’ స్థాయిలోనూ చేసి అడ్డంగా బుక్కయ్యాడు.
కరీంనగర్ క్రైం : చెట్లు ఎక్కేందుకు లెసైన్స్ కోసం ఓ గీత కార్మికుడి నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటూ జగిత్యాల ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. సిరిసిల్ల మండలం జిల్లెల్లకు చెందిన కందుకూరి హన్మండ్లు అనే గీతకార్మికుడు జూన్ 9న తాటిచెట్లు ఎక్కేందుకు లెసైన్స్ కావాలని కోరుతూ జగిత్యాల ఎక్సైజ్ సూపరింటెండెంట్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. ఈ నెల 3న తన దరఖాస్తు గురించి కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ ఎన్.శంకర్‌ను కలవగా దరఖాస్తు కనిపించడం లేదని, మళ్లీ ఇవ్వాలని సూచించాడు.
మళ్లీ దరఖాస్తు చేయగా రూ.3 వేలు ఇస్తే ఫైల్‌ను పై అధికారులకు పంపిస్తానని అడగడంతో హన్మండ్లు ఇచ్చాడు. అక్కడినుంచి ఫైల్ విచారణకోసం సిరిసిల్ల ఎక్సైజ్ సీఐకి చేరగా ఆయన విచారించి హన్మండ్లు అర్హుడే అని ఈ నెల 7న నివేదిక ఇచ్చారు. లెసైన్సులు జారీ చేసే అధికారం డెప్యూటీ కమిషనర్‌ది కావడంతో జగిత్యాల ఎక్సైజ్ కార్యాలయం నుంచి ఫైల్ డెప్యూటీ కమిషనర్ కార్యాలయానికి చేరింది. అనంతరం హన్మండ్లు మళ్లీ సీనియర్ అసిస్టెంట్ శంకర్‌కు ఫోన్ చేసి లెసైన్స్ త్వరగా ఇప్పించాలని కోరాడు. ఫైల్ డెప్యూటీ కమిషనర్ కార్యాలయంలో ఉందని, నివేదికలన్నీ పూర్తయ్యాయ ని, లెసైన్స్ ఇవ్వాలంటే రూ.15 వేలు ఇవ్వాలని శంకర్ డిమాండ్ చేశాడు.
అంత ఇచ్చుకోలేనని బతిమిలాడినా వినిపించుకోలేదు. దీంతో బాధితుడు ఈ నెల 18న ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. శనివారం హన్మండ్లు తాటికొండ శ్రీనివాస్‌తో కలిసి కరీంనగర్‌లోని డెప్యూటీ కమిషనర్ కార్యాలయానికి వచ్చి శంకర్‌కు సమాచారం ఇచ్చారు. అందరూ కలెక్టరేట్ ఎదురుగా ఉన్న ఓ హోటల్‌లో కలుసుకున్నారు. హన్మండ్లు నుంచి శంకర్ రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా అక్కడే మాటు వేసి ఉన్న ఏసీబీ అధికారులు వెంటనే శంకర్‌ను పట్టుకున్నారు.
అక్కడినుంచి డెప్యూటీ కమిషనర్ కార్యాలయానికి తరలించి విచారించారు. శంకర్‌పై కేసు నమోదు చేసి సోమవారం ఏసీబీ కోర్టులో ప్రవేశపెడతామని ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ తెలిపారు. పలు కార్యాలయాల్లో కొందరు మధ్యవర్తులను ఏర్పాటు చేసుకుని లంచాలు తీసుకుంటున్నారనే సమాచారం ఉందని, పక్కా సమాచారంతో దాడులు చేస్తామని, ఎంతటివారైనా వదిలిపెట్టబోమని డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ తెలిపారు.
గతంలోనూ...
జగిత్యాల/ జగిత్యాల అర్బన్ : శంకర్‌నాయక్ సుమారు 25 ఏళ్ల క్రితం సైతం ఇలాగే ఏసీబీకి చిక్కాడు. శంకర్‌నాయక్ జూనియర్ అసిస్టెంట్‌గా సిరిసిల్ల ఎక్సైజ్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో 1989 జూన్ 26న చందుర్తి మండలం లింగంపేటకు చెందిన లక్ష్మణ్‌రావు వద్ద రూ.10 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఆ కేసు నుంచి బయటపడి కొంతకాలంగా జగిత్యాల సూపరింటెండెంట్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు.
కార్యాలయంలో ఉద్యోగుల జీతభత్యాలతోపాటు, జీపులు, వాహనాల వ్యయం చెల్లింపులు, ఇతర లిక్కర్ లావాదేవీల సంబంధించిన వ్యవహారాలను ఈయన పర్యవేక్షిస్తుంటారు. అంతర్గతంగా ఉన్న వివాదాలు సైతం ఇతడిని ఏసీబీకి పట్టించాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. సీనియర్ అసిస్టెంట్ పట్టుబడ్డారన్న సమాచారంతో ఇతర సిబ్బంది అప్రమత్తమయ్యారు.
అయినా మారలేదు
Published Sun, Sep 21 2014 3:19 AM | Last Updated on Tue, Nov 6 2018 4:04 PM
Advertisement
Advertisement