సాక్షి, హైదరాబాద్: సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల (ఎస్జీటీ) నియామక ప్రక్రియను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తెలుగు, ఇంగ్లిష్ మీడియం ఎస్జీటీ 4,700 పోస్టుల భర్తీ ప్రిక్రియను నిలిపివేస్తూ స్టే ఇచ్చింది ఈ పోస్టుల భర్తీ కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2017 అక్టోబర్ 21న నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు వివిధ జిల్లాలకు చెందిన పి.రామకృష్ణ మరో 27 మంది అభ్యర్థులు దాఖలు చేసిన అప్పీల్ వ్యాజ్యాలను వేసవి సెలవుల ప్రత్యేక ధర్మాసనం గురువారం విచారించింది. ఆ పోస్టులకు సంబంధించి టీఎస్‌పీఎస్సీ చేపట్టిన ఎంపిక విధానాన్ని తప్పుపడుతూ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు దాఖలు చేసిన వ్యాజ్యాలపై జోక్యం చేసుకునేందుకు సింగిల్ జడ్జి గతంలో నిరాకరించారు. దీంతో వారు అప్పీల్ పిటిషన్లు దాఖలు చేయగా.. గురువారం హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిల ధర్మాసనం విచారించి స్టే ఉత్తర్వులు ఇచ్చింది.
కమిషన్ నిబంధనల్లోని 6–ఏ ప్రకారం అర్హత సాధించిన అభ్యర్థులను విచారించాలని, ఆ పోస్టులకు ఆసక్తి చూపని వారిని తొలగించాకే ఎంపిక నోటిఫికేషన్ ఇవ్వాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది ఎస్.రాహుల్‌రెడ్డి వాదించారు. వాదనల అనంతరం తెలుగు, ఇంగ్లిష్ మీడియం ఎస్జీటీ పోస్టుల ఎంపిక ప్రక్రియపై స్టే ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఉర్దూ, కన్నడ మీడియం పోస్టులకు ఈ ఉత్తర్వులు వర్తించవు. మరోవైపు ఇప్పటికే సర్వీస్ కమిషన్ ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి, పోస్టింగ్‌లు ఇచ్చేందుకు జాబితాను విద్యాశాఖకు పంపించింది. అభ్యర్థులకు ఆ పోస్టింగ్‌లు ఇచ్చేందుకు అనుమతి కోరుతూ విద్యాశాఖ ప్రభుత్వానికి ఫైలు పంపించింది. అయితే కొంతమంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు స్టే ఇచ్చింది. ఆ స్టే ఉత్తర్వుల్ని తొలగించాలని కోరుతూ సర్వీస్ కమిషన్ జూన్‌లో అప్పీల్ చేసే అవకాశాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment