
డ్రగ్స్ కేసులో కేటీఆర్ పాత్ర
డ్రగ్స్ కేసులో మంత్రి కేటీఆర్ ప్రమేయంపై విచారణ జరపాలని శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు.
టీపీసీసీ నేత షబ్బీర్ అలీ
సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్ కేసులో మంత్రి కేటీఆర్ ప్రమేయంపై విచారణ జరపాలని శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. డ్రగ్స్‌లో కేటీఆర్ పాత్రపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జీ దిగ్విజయ్‌సింగ్ చేసిన వ్యాఖ్యలను షబ్బీర్ అలీ సమర్థించారు. డ్రగ్స్ కేసును కూడా నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
గతంలో ఓటుకు నోటు కేసులోనూ భారీగా ప్రకటనలు చేసి, మాట్లాడిన సీఎంకేసీఆర్ ఇప్పుడేం చేస్తున్నారని ప్రశ్నించారు. ఎంసెట్ కుంభకోణంలోనూ అదే జరిగిందన్నారు. గ్యాంగ్‌స్టర్ నయీం ఎన్‌కౌంటర్ కేసులోనూ ఎవరినీ వదిలిపెట్టం అని మాట్లాడి.. నాయకుల పాత్రపై కనీసం విచారణ కూడా జరుపలేదని షబ్బీర్ విమర్శిం చారు. మియాపూర్ భూముల కుంభకోణంలో ఇప్పటిదాకా చేసిందేమిటో చెప్పాలన్నారు. డ్రగ్స్ కేసును కూడా ఇలాగే ప్రచారం చేసి, కోల్డ్ స్టోరేజీలో పెడతారని ఆరోపించారు.