వైఎస్‌ను తరతరాలూ గుర్తుంచుకుంటాం | Sharmila undertakes 'Paramarsa Yatra' | Sakshi
Sakshi News home page

వైఎస్‌ను తరతరాలూ గుర్తుంచుకుంటాం

Published Fri, Jun 12 2015 1:43 AM | Last Updated on Sun, Sep 3 2017 3:35 AM

నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం తానేదార్ పల్లిలో షర్మిలకు స్వీట్ తినిపిస్తున్న మునగాల పుల్లమ్మ కుటుంబ సభ్యులు

నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం తానేదార్ పల్లిలో షర్మిలకు స్వీట్ తినిపిస్తున్న మునగాల పుల్లమ్మ కుటుంబ సభ్యులు

ఆయన నగరబాట... మా జీవితాల్లో వెలుగుబాట
పరామర్శ యాత్రలో షర్మిలతో నల్లగొండవాసులు
నల్లగొండ జిల్లాలో మూడో రోజు ఆరు కుటుంబాలకు పరామర్శ
అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకెళ్తున్న వైఎస్ తనయ
అడుగడుగునా ప్రజల నుంచి ఆదరణ వెల్లువ

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘‘2006లో వైఎస్ నల్లగొండ పట్టణానికి నగరబాటకు వచ్చారు.ఆ సందర్భంగా మా దుకాణాలు ఇరుకుగా ఉన్న విషయాన్ని గమనించారు.

వెంటనే కలెక్టర్‌ను పిలిపించారు. పాత కలెక్టరేట్ స్థలాన్ని స్వర్ణకారులకు కేటాయించాల్సిందిగా ఆదేశించారు. దాంతో మా 160 కుటుంబాలకు వ్యాపారం చేసుకునేందుకు గూడు దొరికింది. వైఎస్ చేసిన మేలును మేం తరతరాలు గుర్తుంచుకుంటాం’’ నల్లగొండ పట్టణ స్వర్ణకారుల సంఘం అధ్యక్షుడు రాచకొండ గిరి మాటలివి. మలి విడత పరామర్శ యాత్రలో భాగంగా గురువారం పట్టణంలో పాండేకర్ దయానంద్ కుటుంబాన్ని సందర్శించిన షర్మిలకు ఈ విషయాన్ని చెమర్చిన కళ్లతో వివరించారాయన. వైఎస్‌ను ఎన్నోసార్లు కలిశానని, తనను ప్రేమతో చెంపపై తట్టేవారని చెబుతూ మహానేతతో తనకున్న ఆత్మీయానుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.

యాత్రలో మూడో రోజు గురువారం నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, మునుగోడు నియోజకవర్గాల్లో షర్మిల పర్యటించారు. వైఎస్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన ఆరుగురి కుటుంబసభ్యులను పరామర్శించారు. వారిని ఆప్యాయతతో దగ్గరకు తీసుకుని కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. ధైర్యం చెప్పి, అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
 
మూడోరోజు పర్యటన ఇలా
రెండో రోజు పరామర్శ అనంతరం నకిరేకల్ పట్టణంలో రాత్రి బస చేసిన షర్మిల మూడో రోజు ఉదయం నకిరేకల్ నుంచి మర్రూర్ మీదుగా నల్లగొండ నియోజకవర్గ పరిధిలో తిప్పర్తి మండలం ఇందుగుల గ్రామానికి వెళ్లారు. రాయించు నర్సింహ కుటుంబాన్ని కలిసి పరామర్శించారు. ఇంట్లోని చిన్నారులతో ఆడుకున్నారు. కుటుంబానికి ధైర్యం చెప్పారు. అనంతరం సిలార్‌మియా గూడెంలో వైఎస్ విగ్రహానికి గ్రామస్తుల కోరిక మేరకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తర్వాత తిప్పర్తి మండల కేంద్రంలో గుంటి వెంకటేశం కుటుంబాన్ని కలుసుకుని మాట్లాడారు.

ఆరుబయట ఏర్పాటు చేసిన టెంట్‌లోనే పెద్ద ఎత్తున గుమిగూడిన జనసందోహం నడుమ వారితో గడిపారు. వారు బహూకరించిన గాజులు వేసుకున్నారు. నల్లగొండ మండలం చందనపల్లి వెళ్లి చింతా భిక్షమయ్య కుటుంబాన్ని పరామర్శించారు. పానగల్ ప్రాజెక్టు ముంపు గ్రామమైనందున వైఎస్ హయాంలోనే తమకు రూ.26 కోట్ల నిధులు మంజూరు చేశారని ఈ సందర్భంగా ఓ గ్రామస్తుడు గుర్తు చేసుకున్నారు. వైఎస్ విగ్రహం ఏర్పాటు చేయిస్తే ఆయన్ను రోజూ తలచుకుంటామని చెప్పారు.

అనంతరం నల్లగొండ పట్టణంలోని సిమెంట్ రోడ్డులో ఉన్న పాండేకర్ దయానంద్ కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. బాగా చదువుకోవాలని దయానంద్ పిల్లలకు సూచించారు షర్మిల. కుటుంబ సభ్యులు ప్రేమతో ఇచ్చిన కొబ్బరిబొండాం తాగారు. అనంతరం కనగల్ మండల కేంద్రంలో వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాంపల్లి చేరుకుని అస్తర్ బీ కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. వారి కుటుంబానికి ధైర్యం చెప్పి మర్రిగూడ మండలం తాన్‌దార్‌పల్లిలో మునగాల పుల్లమ్మ కుటుంబాన్ని పరామర్శించారు.
 
షర్మిల వెంట రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ప్రధానకార్యదర్శులు డాక్టర్ గట్టు శ్రీకాంత్‌రెడ్డి,  కె.శివకుమార్, గాదె నిరంజన్‌రెడ్డి, ఎడ్మ కిష్టారెడ్డి, నల్లా సూర్యప్రకాశ్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల పార్టీ అధ్యక్షులు అయిల వెంకన్నగౌడ్, మామిడి శ్యాంసుందర్‌రెడ్డి, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బీష్వ రవీందర్, సేవాదళం అధ్యక్షుడు వెల్లాల రాంమోహన్, మైనార్టీ విభాగం అధ్యక్షుడు సయ్యద్ ముజ్తబా అహ్మద్, క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షుడు జార్జి హెర్బర్ట్.

గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు మెరుగు శ్రీనివాస్, ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు నర్రా భిక్షపతి, రాష్ట్ర పార్టీ కార్యక్రమాల కోఆర్డినేటర్ పి.సిద్ధార్థరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి ఆకుల మూర్తి, రాష్ర్ట కార్యదర్శులు వేముల శేఖర్‌రెడ్డి, జి.రాంభూపాల్‌రెడ్డి, కుసుమకుమార్‌రెడ్డి, ఎం.భగవంత్‌రెడ్డి, అమృతాసాగర్, ఐలూరి వెంకటేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు ఇరుగు సునీల్‌కుమార్, పిట్ట రాంరెడ్డి, ఎం.డి.సలీం, ఖమ్మం జిల్లా మధిర ఎంపీపీ లక్ష్మారెడ్డి, యువజన విభాగం నాయకుడు కొన నరందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
ఆద్యంతం ఆత్మీయ స్వాగతం
షర్మిల పరామర్శ యాత్రకు నల్లగొండ జిల్లాలో మంచి స్పందన లభిస్తోంది. షర్మిలను ప్రజలు అడుగడుగునా ఆత్మీయంగా స్వాగతిస్తున్నారు. గురువారం గ్రామగ్రామాన డప్పుచప్పుళ్లు, కోలాటాలతో తమ ఊరి ఆడబిడ్డ మాదిరిగా ఆమెను ఊళ్లోకి తీసుకెళ్లారు. రాజన్న కుమార్తె తమ ఊరికి వచ్చిందంటూ ఆమెను చూసేందుకు, కలిసి మాట్లాడేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చి వైఎస్ కుటుంబంపై ప్రేమను చాటుకున్నారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు షర్మిలను చూసేందుకు, మాట్లాడేందుకు పోటీలు పడ్డారు. ఆమెను సెల్‌ఫోన్లలో బంధించేందుకు యువతీ యువకులు ఉత్సాహపడ్డారు.  గురువారం నల్లగొండ జిల్లా నాంపల్లి మండలకేంద్రంలో దస్తగిరి కుటుంబ సభ్యులను  ఆప్యాయంగా పలకరిస్తున్న షర్మిల. చిత్రంలో వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.

తిప్పర్తి మండల కేంద్రంలో గుంటి వెంకటేశం కుటుంబాన్ని పరామర్శిస్తున్న దృశ్యం. చిత్రంలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్, పార్టీ జిల్లా అధ్యక్షుడు అయిల వెంకన్నగౌడ్ తదితరులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement