
సాక్షి, హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఆదివారం జరగనున్న ఈ ఎన్నికల్లో సీనియర్ నటులు శివాజీరాజా, నరేశ్ ప్యానెళ్లు పోటీ పడుతున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి సవాళ్లు.. ప్రతిసవాళ్లు, ఆరోపణలు.. ప్రత్యారోపణలతో పోటాపోటీగా మేనిఫెస్టోలు విడుదల చేశారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మా ఎన్నికలు జరుగనున్నాయి. సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలు పెట్టి 3 గంటల్లో ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది.
ఈ సారి పోటీ పడుతున్న శివాజీరాజా, నరేశ్ ప్యానెళ్లు సాధారణ ఎన్నికలను తలపించేలా వ్యూహ ప్రతివ్యూహాలతో ప్రచారం సాగించారు. హోరాహోరీగా ప్రచారం చేస్తూ అగ్ర నటుల మద్దతు కూడగట్టేందుకు యత్నించారు. గతంలో ఒకే ప్యానెల్‌లో పని చేసిన నరేశ్, శివాజీరాజా ప్రస్తుతం రెండు వర్గాలుగా పోటీ పడుతుండటం ఈ ఎన్నికలపై ఆసక్తిని పెంచింది. జీవిత, రాజశేఖర్ మద్దతు కూడగట్టుకున్న నరేశ్ 26 మంది సభ్యులతో బరిలోకి దిగారు. శ్రీకాంత్, ఎస్వీ.కృష్ణారెడ్డి మద్దతు కూడగట్టుకున్న శివాజీరాజా తన ప్యానెల్‌తో పోటీలో నిలిచారు.
ఇరు ప్యానెళ్ల మధ్య హోరాహోరీ పోరు కనిపిస్తోంది. గత ప్యానెల్‌లో చేసిన కార్యక్రమాలను కొనసాగిస్తామంటూ, కళాకారుల సంక్షేమం కోసం కొత్త హామీలు గుప్పించారు. తమను గెలిపిస్తే రూ.6 వేల పింఛన్‌తో పాటు కళాకారుల పిల్లల వివాహాలకు రూ.1,00,116 ఆర్థిక సాయం అందిస్తామని నరేశ్ ప్రకటించారు. తమను గెలిపిస్తే 50 మంది నటీనటులకు 6 నెలల పాటు నిత్యావసర సరుకులు ఉచితంగా అందిస్తామని, రూ.7,500 పింఛన్ ఇస్తామని శివాజీరాజా హామీ ఇచ్చారు. మొత్తానికి ఫిలింనగర్‌లో వారం రోజుల ప్రచార సందడి శనివారం సాయంత్రం ముగిసింది. ఆదివారం ఫిలించాంబర్‌లో జరుగనున్న ‘మా’ఎన్నికల్లో 745 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సర్వత్రా ఆసక్తి రేపుతున్న ఈ ఎన్నికల్లో సభ్యులు ఎవరికి పట్టం కడతారో వేచిచూడాలి.
Comments
Please login to add a commentAdd a comment