ప్రచారాస్త్రంగా పునరుజ్జీవం | Shriram Project Works ఙevival Nizamabad | Sakshi
Sakshi News home page

ప్రచారాస్త్రంగా పునరుజ్జీవం

Published Mon, Oct 29 2018 9:09 AM | Last Updated on Mon, Oct 29 2018 9:09 AM

Shriram Project Works ఙevival Nizamabad - Sakshi

ముప్కాల్‌ వద్ద సాగుతున్న ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం పంప్‌హౌస్‌ పనులు

మోర్తాడ్‌(బాల్కొండ): శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు పునరుజ్జీవన పథకం పూర్తయిన తరువాత కలిగే ప్రయోజనాలను వివరి స్తూ రానున్న ఎన్నికల్లో లబ్ధి పొందాలని అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ వ్యూహాత్మకంగా కదులుతోంది. పునరుజ్జీవన పథకానికి కీలకమైన కాళేశ్వరం ప్రాజెక్టు అంశాలను రైతులకు తెలియజేప్పే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా  ఆ పార్టీ అ భ్యర్థులు రైతులను, యువ నాయకులను కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు స్టడీ టూర్‌ కోసం ఆదివారం పంపించారు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ఎగువ భా గంలో గోదావరి నదిపై మహారాష్ట్ర ప్ర భుత్వం బాబ్లీ ప్రాజెక్టును నిర్మించడంతో వరద నీటికి అడ్డుకట్ట పడింది. బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాకముందు వరద నీరు గోదావరి నదిలోకి చేరి శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నీటి మట్టం ఆశిం చిన విధంగానే పెరిగేది. బాబ్లీ ప్రా జెక్టు నిర్మాణం తరువాత వరదలు అధికంగా వస్తేనే శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు ఎగువ భాగం నుంచి నీరు తరలివస్తోంది.

ఈ నేథ్యంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు పునరుజ్జీవన పథకానికి శ్రీకా రం చుట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వరద కాలువను ఉపయోగించుకుని రివర్స్‌ పంపింగ్‌ ద్వారా నీటిని మళ్లించడానికి పునరుజ్జీవన పథకాన్ని అమలు చేస్తున్న విషయం విదితమే. రూ.1,064 కోట్ల వ్యయంతో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు పునరుజ్జీవన పథకానికి గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగానే పునరుజ్జీవన పథ కం పనులు సాగుతున్నాయి. ముప్కాల్‌ వద్ద పంప్‌హౌజ్‌ నిర్మాణం పనులు సా గుతుండగా కాళేశ్వరం ప్రాజెక్టు పనులు కూడా వేగంగానే కొనసాగుతున్నాయని స్టడీ టూర్‌కు వెళ్లిన నియోజకవర్గం రైతులు, యువకులు తెలిపారు.

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు నీటిని తరలించేది ఇలా... 
కాళేశ్వరం పరిసరాల్లో భారీ వర్షం కురిస్తే అనేక టీఎంసీల నీరు గోదావరి నది ద్వారా సముద్రంపాలవుతుంది. భారీ వర్షాలు కురిసిన సమయంలో దాదాపు వెయ్యి టీఎంసీల నీరు సముద్రం పాలైన సందర్భాలు ఉన్నాయి. ఆనీటిని సద్వినియోగం చేసుకోవడానికే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. కాళేశ్వరం నుంచి అన్నారం, సుందిల్లల వద్ద నిర్మించిన పంప్‌హౌజ్‌ల నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు అక్కడి నుంచి మిడ్‌మానేర్‌ డ్యామ్‌కు ఎగువ భాగంలో ఉన్న వరద కాలువలోకి నీటిని వదులుతారు. వరద కాలువలోకి చేరిన నీరు 40 మీటర్ల ఎత్తున ఉన్న శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి రివర్స్‌ పంపింగ్‌ ద్వారా రోజుకో టీఎంసీ చొప్పున నీటిని మళ్లించాలని డిజైనింగ్‌ చేశారు. అయితే ఆశించిన విధంగా నీటిని తరలించడానికి వీలు ఉంటే రోజుకు ఒక టీఎంసీ కాకుండా రెండు టీఎంసీల నీటిని తరలించవచ్చని ఇంజినీరింగ్‌ అధికారులు చెబుతున్నారు.

వరద కాలువ రివర్స్‌ పంపింగ్‌ ద్వారా రూ.500 కోట్ల ఆదా... 
కాళేశ్వరం నీటిని మిడ్‌మానేరు నుంచి మల్లన్న సాగర్‌ ప్రాజెక్టుకు అక్కడి నుంచి హల్దీవాగు ద్వారా నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు తరలించాలని ముందుగా నిర్ణయించారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టును నింపిన తరువాత మంజీర నదిలోకి మిగులు జలాలను విడిచి శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు తరలించాలని ప్రతిపాదించారు. ఇలా చేయడం వల్ల రోజుకు అర టీఎంసీ నీటిని మాత్రమే శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు తరలించవచ్చు. ఈ విధానం వల్ల ఒక ఏడాదికి రూ.600 కోట్ల విద్యుత్‌ బిల్లును ప్రభుత్వం భరించాల్సి ఉంది. అయితే వరద కాలువ ద్వారా రివర్స్‌పంపింగ్‌ చేయడం వల్ల రోజుకు ఒకటి నుంచి రెండు టీఎంసీల నీటిని తరలించడమే కాకుండా రూ.100 కోట్ల విద్యుత్‌ బిల్లును మాత్రమే ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. నీటిపారుదల శాఖలో పని చేసిన ఒక రిటైర్డ్‌ ఇంజినీర్‌ ఇచ్చిన సలహా ప్రకారం తాజా మాజీ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి చొరవ చూపడంతో సీఎం కేసీఆర్‌ వరద కాలువ రివర్స్‌ పంపింగ్‌కు ఆమోదం తెలిపినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

 
వరద కాలువ, కాకతీయ కాలువలలో నిరంతరం నీరు... 
పునరుజ్జీవన పథకం పూర్తి అయితే వరద కాలువ, కాకతీయ కాలువలలో నిరంతరం నీటిని ప్రవహించేలా చేసే అవకాశం ఉంది. వరద కాలువ రివర్స్‌ పంపింగ్‌ కోసం వినియోగించడం వల్ల ఈ కాలువలో నీరు ఉంటుంది. అలాగే కాకతీయ కాలువ ద్వారా దిగువ భాగానికి నీటిని విడుదల చేయనుండటంతో నిరంతరం నీరు నిలువ ఉండే అవకాశం ఉంటుంది. ఫలితంగా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు వద్ద జల విద్యుత్‌ ఉత్పత్తి లక్ష్యానికి మించి జరుగుతుంది. రెండు కాలువల్లో నీరు నిలిచి ఉంటే చెరువులను నింపుకోవడంతో పాటు, పంపు సెట్ల ద్వారా పంట పొలాలకు సాగునీటిని తరలించడానికి అవకాశం ఉంది. వరద కాలువలో నీరు నిలువ ఉంటే కాలువకు సిమెంట్‌ లైనింగ్‌ లేక పోవడంతో భూగర్భ జలాలు ఎంతో వృద్ధి చెందుతాయని రైతులు భావిస్తున్నారు. వరద కాలువకు ఎడమవైపున ఏర్పాటు చేసిన తూమ్‌లు ఆరు మీటర్ల ఎత్తులో ఉన్నాయి. ఈ తూమ్‌ గేట్లను ఇంకా కిందికి దించితే తక్కువ సమయంలోనే చెరువులను నింపడానికి పరిస్థితులు అనుకూలిస్తాయి. వరద కాలువలో నీటిని నిలువ ఉంచడం వల్ల బాల్కొండ నియోజకవర్గంలోని మరో పదివేల ఎకరాలకు సాగునీటిని అందించడానికి అవకాశం కలుగుతుంది. ఒక్క పునరుజ్జీవన పథకం పూర్తి జరిగితే ఎన్నో ప్రయోజనాలను రైతులకు అందించవచ్చని టీఆర్‌ఎస్‌ నాయకులు తమ ప్రచారంలో వివరించాలని భావిస్తున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే ఎంతో మేలు... 
కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి జరిగితే ఎంతో మేలు కలుగనుంది. ఈ రోజు రైతులం ప్రాజెక్టును సందర్శించాం. కాళేశ్వరం నీరు శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు చేరితే రైతులకు మూడు పంటలకు సాగునీరు అందుతుంది. ఎంతో విలువైన పంటలను పండించడానికి అవకాశం ఉంది. – కౌడ భూమన్న, రైతు, తొర్తి

మాకు అవగాహన కలిగింది 

కాళేశ్వరం ప్రాజెక్టు ను సందర్శించడం వల్ల వరద కాలువ రివర్స్‌ పంపింగ్‌పై అవగాహన కలిగింది. వరద కాలువ ద్వారా రివర్స్‌ పంపింగ్‌ చేసి నీటిని ప్రాజెక్టుకు తరలిస్తే ఎంతో ప్రయోజనం కలుగుతుంది. రాజకీయాలు ముఖ్యం కాదు. ప్రజలకు సాగునీరు అందడం ముఖ్యమని గుర్తించాలి. – తక్కూరి సతీష్, మోర్తాడ్‌

సాగునీటి సమస్యలు తీరనున్నాయి

వరద కాలువ రివర్స్‌ పంపింగ్‌ ద్వారా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు నీరు చేరితే సాగునీటి సమస్యలు ఎన్నో తీరనున్నాయి. రైతుల కష్టాలు తీరి నాణ్యమైన పంటలను పండించవచ్చు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్టు గురించి అందరు తెలుసుకోవాలి. – భోగ సుమన్, చౌట్‌పల్లి

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పరిశీలనలో భాగంగా పంప్‌హౌజ్‌ను పరిశీలిస్తున్న యువకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement