నామినేషన్ పత్రాలను కలెక్టర్‌కి అందజేస్తున్న మాజీ ఎంపీ కవిత. చిత్రంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, హన్మంత్ షిండే, జీవన్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి మాజీ ఎంపీ, సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలతో కలసి కలెక్టరేట్‌కు చేరుకున్న కవిత.. రెండు సెట్ల నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ సి. నారాయణరెడ్డికి అందజేశారు. ఉదయం హైదరాబాద్‌లోని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి నివాసంలో ఆమె జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. నిజామాబాద్ చేరుకుని అత్తమామలు, భర్త అనీల్‌రావు ఆశ్వీరాదం తీసుకున్న అనంతరం నామినేషన్ వేసేందుకు కలెక్టరేట్‌కు చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు.
పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న కవిత మళ్లీ రావడంతో అనుచరులు, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. నామినేషన్ వేసేందుకు వచ్చిన కవితకు పార్టీ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ఇదిలా ఉండగా, స్థానిక సంస్థల్లో టీఆర్‌ఎస్‌కు స్పష్టమైన మెజారిటీ ఉంది. జిల్లా పరిషత్, మండల పరిషత్‌లు, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు మొత్తం 824 ఉండగా, ఇందులో 550 పైగా టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులే ఉన్నారు. దీంతో ఈ ఎన్నికల్లో కవిత విజయం ఖాయంగా కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment