సింగరేణికి భవిష్యత్‌లో తాగునీటి గండం ఏర్పడేలా ఉంది. గోదావరి నది చెంతనే ఉన్నా కార్మికుల కష్టాలు తప్పేలా లేవు. ఎల్లంపల్లి నుంచి ఒక టీఎంసీ నీరు పొందే వీలున్నా పైప్‌లైన్ల ఏర్పాటుకయ్యే ఖర్చు తడిసి మోపెడవుతుండడంతో యాజమాన్యం ఆందోళన చెందుతోంది. ప్రత్యామ్నాయంగా కార్మికులకు గనుల్లో ఊట నీటిని తాగించాలని ఆలోచన చేస్తోంది. ఇదే నిజమైతే భవిష్యత్‌లో కోల్‌బెల్ట్ ప్రాంత వాసులు గోదావరినది నీటిని తాగే అదృష్టాన్ని కోల్పోయే అవకాశం ఉంది.
గోదావరిఖని :
సింగరేణికి రామగుండం రీజియన్ పరిధిలో ఆర్జీ-1, ఆర్జీ-2, ఆర్జీ-3 డివిజన్లు ఉన్నాయి. ఎనిమిది భూగర్భ గనులు, నాలుగు ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులలో సుమారు 20 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరి కోసం గోదావరిఖని, యైటింక్లయిన్‌కాలనీ, సెంటినరీకాలనీలలో క్వార్టర్లు నిర్మించారు. సింగరేణి కార్మికులు, వారి పిల్లలు కూడా ప్రైవేటుగా నిర్మించుకున్న ఇళ్లల్లో నివసిస్తున్నారు. దాదాపుగా 35 వేల వరకు నల్లా కనెక్షన్లు ఉన్నాయి. వీరికి గోదావరినది ఒడ్డున నిర్మించి న పంప్‌హౌస్ ద్వారా తాగునీటిని శుద్ధి చేసి 22 కిలోమీటర్ల దూరం గల సెంటినరీకాలనీ వరకు నీటిని నిత్యం సరఫరా చేస్తున్నారు. చాలా ఏళ్లుగా సరైన వర్షాలు లేక గోదావరినది ఎండిపోతుండడంతో సింగరేణి యాజ మాన్యం నదిలో బోర్లను వేసి నీటి కొరత తీర్చుతోంది. ప్రస్తుతం ఎల్లంపల్లి వద్ద గోదావరినదిపై ప్రాజెక్టును నిర్మించడంతో నీటి ప్రవాహం ముందుకు సాగే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో దిగువన ఉన్న పట్టణాల నీటి కష్టాలు తీర్చేందేకు ప్రభుత్వం కేటాయింపులు చేసింది. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలకు ఒక టీఎంసీ కేటాయించగా, వారు పైప్‌లైన్లు ఏర్పాటు చేసుకుని నీటిని పొందుతున్నారు. రామగుండం కార్పొరేషన్‌కు ఒక టీఎంసీ, సింగరేణికి మరో టీఎంసీ కేటాయించారు.
తడిసి మోపెడవుతున్న పైప్‌లైన్ల ఖర్చు..
సింగరేణికి కేటాయించిన ఒక టీఎంసీ నీటిని పొందాలంటే ఎల్లంపల్లి నుంచి పైప్‌లైన్లు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. దాదాపు 15 కిలోమీటర్ల దూరం గల ఈ పైప్‌లైన్‌కు సుమారు రూ. 200 కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉంది. ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసేం దుకు యాజమాన్యం వెనుకంజ వేస్తున్నట్లు సమాచా రం. ఈ క్రమంలో యాజమాన్యం ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తున్నట్లు తెలిసింది.
వర్షాలు కురిస్తే నదిలో ఎల్లప్పుడూ నీరుంటుందని, ఒకవేళ ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే నదిలో బోర్లు వేసుకోవచ్చని, అది కూడా సాధ్యం కాకపోతే ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటి ని వదలాలని కోరడంపై ఆలోచన చేస్తోంది. అలాగే గోదావరినది ఒడ్డున ఉన్న మేడిపల్లి ఓసీపీ జీవిత కాలం మరో ఆరేళ్లు మాత్రమే ఉంది. అక్కడ బొగ్గు నిల్వలు వెలికితీసిన తర్వాత ఏర్పడిన గొయ్యిలో వర్షా కాలంలో నదిలో వచ్చే వరద నీటిని నింపాలనే ఆలోచనతో యాజమాన్యం ఉంది.
అలాగే జీడీకే 5వ గని, జీడీకే 11వ గనిలో ఊటగా వచ్చే నీటిని శుద్ధి చేసి తాగునీటిగా వాడుకోవచ్చనే దిశగా యాజమాన్యం ఆలోచి స్తోంది. కానీ గనుల్లో నీటిని ఎంత శుద్ధి చేసినా దానిలో పీపీఎం శాతం ఎక్కువగా ఉంటోంది. గతంలో యాజ మాన్యం ఈ నీటిని కార్మిక కాలనీలకు సరఫరా చేసినా వారు తాగకుండా గోదావరినీటిపైనే ఆధారపడ్డారు. ఈ తరుణంలో సింగరేణి యాజమాన్యం ప్రత్యామ్నాయ చర్యలపై ఆలోచించకుండా ఎల్లంపల్లి నుంచి టీఎంసీ నీటిని పొందేలా శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సింగరేణి కార్మికులు కోరుతున్నారు.
సింగరేణికి తాగునీటి గండం.. ?
Published Fri, Aug 8 2014 4:56 AM | Last Updated on Sat, Sep 2 2017 11:32 AM
Advertisement
Advertisement