
హైదరాబాద్: ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలతో రాష్ట్రం బలిదానాల తెలంగాణగా మారిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. విద్యార్థుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని విమర్శించారు. ఇంటర్ బోర్డులో జరిగిన అవకతవకలు, కుంభకోణాలకు నిరసనగా సీపీఐ ఆధ్వర్యంలో గురువారం హిమాయత్‌నగర్‌లోని సత్యనారాయణరెడ్డి భవన్ వద్ద నుంచి ర్యాలీ చేపట్టారు.దీన్ని పోలీసులు అడ్డుకోవడంతో సీపీఐ కార్యకర్తలు ఎక్కడివారక్కడ రోడ్డుపై బైఠాయించి నిరసనలకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నల్లచొక్కాలతో తాము శాంతియుతంగా చేస్తున్న ర్యాలీని పోలీసులు అడ్డుకోవడం సమంజసం కాదంటూ హెచ్చరించారు.
పరిస్థితి అదుపుతప్పే క్రమంలో అబిడ్స్ ఏసీపీ బిక్షంరెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్న సీపీఐ నేతలను, కార్యకర్తలను అరెస్ట్ చేసి వాహనంలోకి ఎక్కించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరుపక్షాల మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారులను ముషీరాబాద్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ మంత్రులంతా కేసీఆర్‌కు బంట్రోతులుగా మారారని మండిపడ్డారు. 27 మంది విద్యార్థుల ఆత్మహత్యలకు గ్లోబరీనా సంస్థ, ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. దీనిపై హైకోర్టు పర్యవేక్షణలో సిట్ ఏర్పాటు చేసి విచారణ జరిపించాలన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థి కుటుంబాలకు న్యా యం జరిగే వరకు తమ పోరాటం ఆపేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి ఇ.టి.నరసింహ, రాకేశ్, నళిని, రేణుక, అమీనా, రూప్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.