‘చెత్త’ సమస్యకు చెక్!
- పూర్తి స్థాయిలో తరలింపు బాధ్యతలు రాంకీకి!
- ఇంటింటికీ రెండు రంగుల డబ్బాలు
- 45 లక్షల పంపిణీకి నిర్ణయం
- కొనుగోలు కోసం ప్రభుత్వానికి లేఖ
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లో చెత్త సేకరణ, తరలింపు, నిర్వహణ అంశాలపై ఒక నిర్ధిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని గ్రేటర్ అధికారులు నిర్ణయించారు. పకడ్బందీగా చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. కాగా నగరంలో చెత్తసేకరణ, నిర్వహణలో భాగంగా రాంకీ సంస్థ ప్రస్తుతం చెత్త నిర్వహణ పనులు మాత్రమే చేస్తోంది. అయితే త్వరలోనే తరలింపు పనులను కూడా దానికే అప్పగించేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు సిద్ధమయ్యారు. జీహెచ్‌ఎంసీ-రాంకీల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ఇంటింటినుంచి చెత్త సేకరించి ట్రాన్స్‌ఫర్ స్టేషన్లకు తరలింపు.. ట్రాన్స్‌ఫర్ స్టేషన్లనుంచి డంపింగ్‌యార్డుకు తరలింపు.. డంపింగ్‌యార్డులో నిర్వహణ పనుల్ని చేయాల్సి ఉంది.
జీహెచ్‌ఎంసీలోని యూనియన్ల నుంచి వెల్లువెత్తిన వ్యతిరేకతతో ప్రస్తుతం కేవలం నిర్వహణ పనుల్ని మాత్రమే రాంకీకి అప్పగించారు. ఇటీవల స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా చెత్త సమస్య పరిష్కారంతోపాటు రాంకీ ఒప్పందం అమలుపై కూడా ప్రజాప్రతినిధుల అభిప్రాయాల మేరకు తగు పరిష్కారం కనుక్కొంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అందులో భాగంగా మంగళవారం ఈ అంశంపై జరిగిన సమావేశంలో ప్రజాప్రతినిధులు తొలుత కొన్ని ప్రాంతాల్లో ఒప్పందం మేరకు మొత్తం పనుల్ని రాంకీకి అప్పగించి పరిశీలించాలని అభిప్రాయం వ్యక్తంచేసినట్లు తెలిసింది. అందులో భాగంగా పాతబస్తీ ప్రాంతంలో(సౌత్‌జోన్‌లో) తొలిదశలో మూడంచెల పనుల్నీ రాంకీకి అప్పగించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. అక్కడి ఫలితంతో మిగతా ప్రాంతాల్లోనూ అమలు చేయాలనేది అధికారుల ఆలోచనగా ఉన్నట్లు తెలిసింది.
రంగు డబ్బాల కొనుగోళ్లకు సర్కారుకు లేఖ..
ఇంటింటినుంచి చెత్తను సేకరించేందుకు తడి, పొడి చెత్తలకు వేర్వేరుగా రెండు రంగుల డబ్బాలను వినియోగించాలని సీఎం సూచించిన నేపథ్యంలో అందుకు సిద్ధమైన అధికారులు అందుకుగాను దాదాపు 45 లక్షల డబ్బాలను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఆమేరకు పరిపాలనపర అనుమతులివ్వాల్సిందిగా ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే వాటిని కొనుగోలు చేయనున్నారు.