
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ వాహనాల చార్జింగ్ కేంద్రాలు, బ్యాటరీల పరస్పర మార్పిడి (స్వాపింగ్) కేంద్రాలను ప్రత్యేక కేటగిరీ వినియోగదారులుగా పరిగణించి విద్యుత్ సరఫరా చేసేందుకు అనుమతించాలని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు తాజాగా రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్‌ఈఆర్సీ)కి ప్రతిపాదించాయి. లోటెన్షన్ (ఎల్టీ) కనెక్షన్ కలిగిన చార్జింగ్ కేంద్రాలకు యూనిట్‌కు రూ.6.10 టారిఫ్ చొప్పున విద్యుత్ సరఫరా చేసేందుకు అనుమతి కోరాయి.
అదే విధంగా హైటెన్షన్ (హెచ్‌టీ) కనెక్షన్లకు సైతం రూ.6.10 చొప్పున విద్యుత్ సరఫరా చేస్తామని, అయితే పగటి వేళల్లో యూనిట్‌కు రూపాయి అదనం, రాత్రి వేళల్లో రూపాయి రాయితీ ఇస్తామని తెలిపాయి. అంటే, ఉదయం 6 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు యూనిట్‌కు రూ.7.10 చొప్పున, రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు యూనిట్‌కు రూ.5.10 చొప్పున, మిగిలిన సమయాల్లో యూనిట్‌కు రూ.6.10 చొప్పున విద్యుత్ సరఫరా చేస్తామని ప్రతిపాదించాయి.
రాష్ట్రంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, త్వరలో విద్యుత్ వాహనాల పాలసీని ప్రకటించనుందని ఈఆర్సీకి తెలిపాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని కోరాయి. ఈ ప్రతిపాదనలపై అభ్యంతరాలు, సలహాలను వచ్చేనెల 12లోగా తెలపాలని, 19న ఉదయం 11 గంటలకు విచారణ నిర్వహిస్తామని ఈఆర్సీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది.