పెద్దపల్లి సభలో బాహాబాహీ..
మాజీ మంత్రి శ్రీధర్‌బాబు వర్సెస్ ఎమ్మెల్యే పుట్ట మధు
- ప్రాజెక్టుపై అభిప్రాయ సేకరణ సందర్భంగా దాడి
పెద్దపల్లి/పెద్దపల్లి రూరల్: కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టుపై తలపెట్టిన అభిప్రాయ సేకరణలో మంథని ఎమ్మెల్యే పుట్ట మధు, మాజీ మంత్రి శ్రీధర్‌బాబు వర్గాలు పరస్పరం దాడులకు దిగాయి. పెద్దపల్లిలో బుధవారం పర్యావరణ కాలుష్య నియంత్రణ బోర్డు తలపెట్టిన అభిప్రా య సేకరణ రసాభాసగా ముగిసింది. ఇరువర్గాల మధ్య దాడిలో ముగ్గురు కాంగ్రెస్ నాయకులకు గాయాలయ్యాయి. మాజీ మంత్రి అనుచరులు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మాట్లాడటం గొడవకు దారితీసింది. ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మాట్లాడి అడ్డుకుంటున్న వారిని అరెస్టు చేసి అభిప్రాయ సేకరణ కానిచ్చారు.
జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. సభ ప్రారంభం కాగానే భూ నిర్వాసితుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఉప్పట్ల శ్రీనివాస్ మైక్ అందుకొని ప్రాజెక్టుకు వ్యతిరే కంగా ప్రసంగించారు. శ్రీనుపై టీఆర్‌ఎస్ నాయకులు పిడిగుద్దులు కురిపిస్తూ దాడికి దిగారు. దీనిని వ్యతిరేకించే క్రమంలో మంథనికి చెందిన క్రాంతి, కొత్త శ్రీనివాస్‌లపై కూడా టీఆర్‌ఎస్ నాయకులు దాడి చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులపై టీఆర్‌ఎస్ నాయకులు కుర్చీలు విసిరేయడంతో పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను నిలువరించారు. సమావేశానికి హాజరైన శ్రీధర్‌బాబు సహా కాంగ్రెస్ శ్రేణులను అరెస్టు చేసి పెద్దపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలిం చారు. ఆహారం తీసుకునేందుకు కూడా అనుమ తించడం లేదని స్టేషన్ ముందు బైఠాయించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు జై: ఇన్‌చార్జి కలెక్టర్
పెద్దపల్లిలో కాలుష్య మండలి ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొన్న 25 మందిలో 23 మంది కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుకూలంగా మాట్లాడారని ఇన్‌చార్జి కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు.
అభిప్రాయ సేకరణ జరగాలని అంటే..
150 కి.మీ దూరంలోని కాళేశ్వరం వద్ద నిర్మిస్తున్న ప్రాజెక్టు కోసం అక్కడి భూనిర్వాసితులతో అభిప్రాయ సేకరణ జరపాలని డిమాండ్ చేస్తే టీఆర్‌ఎస్ నాయకులు గూండాల్లా వ్యవహరించా రని శ్రీధర్‌బాబు విమర్శించారు.