మిర్యాలగూడ అర్బన్: గ్రూప్–2 పరీక్షలో అర్హత సాధించిన ఆ యువకుడు.. జీవితంలో ఓడిపోయాడు. నమ్మి వచ్చే యువతిని మోసం చేయలేక.. నిజాన్ని చెప్పలేక మరణశాసనం లిఖించుకున్నాడు. ఉన్నత ఉద్యోగం.. కోరుకున్న యువతితో వివాహం.. ఇక జీవితం ఆనందమయం అనుకుంటున్న తరుణంలో అనారోగ్యం రూపంలో మృత్యువు కబళిస్తుండటంతో తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఈ విషాద సంఘ టన ఆదివారం జరిగింది. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువు మండల కేంద్రానికి చెందిన మోడం బస్వీర్‌రెడ్డి, వరమ్మలకు ముగ్గురు కుమారులు. చిన్నవాడైన మోడం శ్రీనివాస్‌రెడ్డి(30) గ్రూప్–2 పరీక్షలో అర్హత సాధించాడు. ఇంటర్వ్యూ కోసం అహర్నిశలు శ్రమిస్తున్నాడు. ఉద్యోగం వస్తుందన్న ధీమాతో పెద్దలు గరిడేపల్లి మండలం పరేడ్డిగూడేనికి చెందిన యువతితో వివాహం చేయాలని నిర్ణయించారు. ఫిబ్రవరిలో వీరి వివాహం చేయాలని ఆలోచనలో పెద్దలున్నారు.
ఇక.. కొద్దిరోజులేనని..
శ్రీనివాస్‌రెడ్డి ఏడాదిగా (పెద్ద పేగుకు కేన్సర్) ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఇటీవల సమస్య పెరగటంతో డాక్టర్ దగ్గరకు వెళ్లాడు. వైద్య పరీక్షలు నిర్వహించగా, రెండు రోజుల క్రితమే రిపోర్టులు వచ్చాయి. వాటిలో కేన్సర్ ముదిరిపోయిందని.. ఆపరేషన్ చేస్తే ప్రమాదమని డాక్టర్లు చెప్పారు. ఎక్కువ కాలం బతకటం కష్టమని వివరించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీనివాస్‌రెడ్డి రెండు రోజులుగా సెల్ స్విచ్ ఆఫ్ చేసుకొని కుమిలిపోయాడు.
ఇష్టపడిన యువతికి చెప్పలేక..
తాను ఇష్టపడిన యువతితోనే పెద్దలు వివాహానికి ఏర్పాట్లు చేస్తుండటం.. వారికి విషయాన్ని ఎలా చెప్పాలో శ్రీనివాస్‌రెడ్డికి అర్థం కాలేదు. నమ్మి వచ్చే యువతిని మోసం చేయలేక.. మృత్యువు కబళించబోతోందన్న నిజాన్ని చెప్పలేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
ఆదివారం రెండు పేజీల సూసైడ్ నోట్ రాసి స్వగ్రామం నుంచి మిర్యాలగూడకు చేరుకున్న శ్రీనివాస్‌రెడ్డి గుర్తు తెలియని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. రైల్వే పోలీసులు మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల రోదనలు మిన్నంటాయి.
Comments
Please login to add a commentAdd a comment