
‘లాక్‌డౌన్ ప్రారంభానికి ముందే ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగం (ఎంఎస్‌ఎంఈ), కరోనాతో పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది. రాష్ట్రంలో సుమారు 40 వేల ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలు ఉండగా, రాష్ట్ర జీడీపీలో 35 శాతం, ఎగుమతుల్లో 40 శాతం మేర వాటా కలిగి ఉంది. వ్యవసాయ రంగం తర్వాత ఎంఎస్‌ఎంఈ రంగం రాష్ట్రంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తోంది. కరోనాతో ఆర్థిక వ్యవస్థ గాడి తప్పడంతో, ఈ రంగం పూర్తిగా చతికిల పడింది. అందువల్ల సూక్ష్మ, చిన్న పరిశ్రమలపై కేంద్రం దృష్టి పెట్టాలి’ అని తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య (టిఫ్) అధ్యక్షుడు కొండవీటి సుధీర్‌రెడ్డి పేర్కొన్నారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, భవిష్యత్తుపై సుధీర్‌రెడ్డి ‘సాక్షి’తో ఏమన్నారంటే..
► సుమారు 50 రోజుల పాటు లాక్‌డౌన్ మూ లంగా పారిశ్రామిక ఉత్పత్తి పూర్తి స్థాయిలో నిలిచిపోయింది. అయినా వేతనాలు, విద్యుత్ బిల్లులు, పీఎఫ్, ఈఎస్‌ఐ, జీఎస్టీ చెల్లింపుతో పాటు బ్యాంకు రుణాలు, వడ్డీలు చెల్లించాల్సి వస్తోంది. మామూలు పరిస్థితుల్లోనే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పరిశ్రమలకు ఇప్పుడు మరింత భారం మోపుతోంది.
► లాక్‌డౌన్ నిబంధనలను సడలించి పరిశ్రమలకు అనుమతి ఇచ్చినా 30 నుంచి 40 శాతం సామర్థ్యంతో మాత్రమే పనిచేసే అవకాశం ఉంది. మరోవైపు ఎంఎస్‌ఎంఈ ఉత్పత్తుల మార్కెట్ ఇంకా తెరుచుకోలేదు. కొనుగోళ్లు పెరిగితేనే ఎంఎస్‌ఎంఈ రంగం పుంజుకుంటుంది. కార్యకలాపాలు పూర్తి స్థాయిలో ప్రారంభం కాకున్నా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కార్మికులందరికీ పూర్తి వేతనాలు చెల్లించాల్సి ఉంది. పూర్తిస్థాయిలో పరిశ్రమల కార్యకలాపాలకు మరో 4 నెలలు పట్టే అవకాశం ఉంది.
► పారిశ్రామికరంగంలో పనిచేస్తున్న వలస కార్మికుల్లో సుమారు 30, 40 శాతం మంది తిరిగి వెళ్లేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ముడిసరుకు లేకపోవడం కూడా పూర్తి స్థాయి లో పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించేందుకు ఆటంకం కలిగిస్తున్నాయి.
► పరిశ్రమలు తిరిగి గాడిన పడేందుకు వర్కింగ్ క్యాపిటల్ కోసం 20 నుంచి 30 శాతం రుణాలు తక్కువ వడ్డీ రేటుకు ఇవ్వాలని కోరినా, బ్యాంకింగ్ రంగం కూడా సంక్షోభంలో ఉండటంతో ఆచితూచి స్పందిస్తోంది. ఇలాంటి రుణాలకు కేంద్రం క్రెడిట్ గ్యారంటీ ఇస్తే తప్ప ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలు గట్టెక్కే పరిస్థితి లేదు.
► పరిశ్రమలు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించకపోతే నిరర్ధక ఆస్తుల (ఎన్‌పీఏ) జాబితాలోకి వెళ్తాయి. దీంతో పరిశ్రమల సిబిల్ రేటు తగ్గి రుణ పరిమితి పెంచడం, కొత్తగా రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు నిరాకరిస్తాయి. రూ.5 కోట్ల రుణ పరిమితి లోపల ఉన్న అన్ని రకాల ఎంఎస్‌ఎంఈలను ఎన్‌పీఏ జాబితాలో చేర్చడానికి ఉన్న గడువును ఏడాది పాటు వాయిదా వేయాలి.
► సాధారణ పరిస్థితుల్లో అనారోగ్యానికి గురయ్యే కార్మికులకు ఈఎస్‌ఐ కార్పొరేషన్ 70 శాతం వేతనం చెల్లిస్తుంది. ప్రస్తుత పరిస్థితులు అంతకంటే ఏమీ భిన్నంగా లేవు కాబట్టి ఎంఎస్‌ఎంఈ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు మూడు, నాలుగు నెలల పాటు ఈఎస్‌ఐ కార్పొరేషన్ నుంచి చెల్లించాలని ఇటీవల కేంద్రానికి ప్రతిపాదించాం. కొన్ని చిన్న తరహా పరిశ్రమలు ఈఎస్‌ఐ పరిధిలో లేవు. ఆంక్షలు తొలగించినా వీటిలో సుమారు 30 శాతం పరిశ్రమలు తిరిగి తెరుచుకోవడం కష్టమే. ఇలాంటి పరిశ్రమలను ఆదుకునేందుకు కేంద్రమే 6 నెలల పాటు నేరుగా వేతనాలు చెల్లించాలి.
► జీఎస్టీ చెల్లింపుపై ప్రభుత్వం 3 నెలల పాటు డిఫర్‌మెంట్ ఇచ్చినా 9 శాతం వడ్డీ చెల్లించాలని ఆదేశించింది. డబ్బులే లేనప్పుడు వడ్డీ చెల్లించడం ఎలా సాధ్యమవుతుంది. వడ్డీ లేకుండా జీఎస్టీ చెల్లింపు గడువును కనీసం 6 నెలల పాటు పొడిగించాలి.
► పరిశ్రమలు పనిచేయని కాలానికి సంబంధించి ఏపీ తరహాలో ఫిక్స్‌డ్ విద్యుత్ చార్జీలు రద్దు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సుమారు రూ.2,700 కోట్ల సబ్సిడీలు రావాల్సి ఉంది. ఇందులో ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలకు సంబంధించి రూ.600 కోట్ల వరకు ఉండొచ్చు. చిన్న పరిశ్రమలకు గుర్తించి రాయితీలు విడుదల చేస్తే సుమారు ఐదారు వేల పరిశ్రమలకు ఊరట లభిస్తుంది.
► ఎంఎస్‌ఎంఈ రంగం స్థితిగతులపై ఇటీవల సిడ్బీ, క్రిసిల్ సంస్థలు అధ్యయనం చేసి కేంద్రానికి నివేదిక ఇచ్చాయి. ఈ నివేదిక ప్రకారం రూ.కోటి కంటే తక్కువ రుణాలు తీసుకున్న చిన్న పరిశ్రమల ఆస్తుల విలువ సుమారు రెండు మూడు రెట్లు ఎక్కువగా ఉంది. అందువల్లే గతంలో జీఎస్టీ అమలు, పెద్ద నోట్ల రద్దు వంటి సందర్భాల్లోనూ సవాళ్లను ఈ రంగం అధిగమించగలిగింది. రుణాలు తిరిగి చెల్లించడంలోనూ చిన్న పరిశ్రమలు మెరుగ్గా ఉన్నట్లు సిడ్బీ, క్రిసిల్ నివేదిక వెల్లడించింది. పెద్ద పరిశ్రమల నిరర్ధక ఆస్తులు (ఎన్‌పీఏ) 19.1 శాతం కాగా, ఎంఎస్‌ఎంఈలు 11.3 శాతం మాత్రమే ఎన్‌పీఏ జాబితాలో ఉన్నాయి. కాబట్టి ఎంఎస్‌ఎంఈ రంగానికి అదనపు రుణాలు ఇచ్చినా బ్యాంకులు నష్టపోయే అవకాశం ఉండదు.
► ఫార్మా, వైద్య ఉపకరణాలు, ఆరోగ్య రంగం లో మౌలిక వసతుల రంగాల్లో మనకు అపారమైన అవకాశాలు ఉన్నాయి. కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటేనే సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు మనుగడ సాగించగలుగుతాయి. ఈ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధానాలు రూపొందిస్తే చైనా నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకునే శక్తి వస్తుంది.
► కరోనా సంక్షోభంలోనూ ఎంఎస్‌ఎంఈ పరిశ్రమల రంగం కొత్త పుంతలు తొక్కేందుకు అనువైన మార్గాలు ఉన్నాయి. భవిష్యత్తులో రాష్ట్రంలో ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, మెడికల్ డివైజెస్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో మంచి అవకాశాలు ఉండే అవకాశం ఉంది. నైపుణ్య శిక్షణ, సరళీకృత విధానాలతో తెలంగాణ రాబోయే రోజుల్లో పారిశ్రామిక రంగంలో అగ్రస్థానానికి చేరుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment