వ్యభిచారాన్ని అడ్డుకునేందుకు చర్యలు చేపట్టండి
సామాజిక వేత్త డాక్టర్ సునీతా కృష్ణన్
హైదరాబాద్: ప్రభుత్వాలు వ్యభిచారాన్ని సామాజిక సమస్యగా చూడకుండా అక్రమ మానవ వ్యాపారంగా పరిగణించి అడ్డుకునేందుకు చర్యలు చేపట్టాలని సామాజిక వేత్త డాక్టర్ సునీతా కృష్ణన్ డిమాండ్ చేశారు. సమాజంలో బలవంతంగా వ్యభిచార కూపంలో ప్రవేశించి, బయటికి వచ్చిన మహిళల పట్ల వివక్ష చూపడం తగదని ఆమె విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ రెడ్‌హిల్స్‌లోని ఫ్యాప్సీలో యుధ్‌వీర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం జరిగిన కార్యక్రమంలో సునీతా కృష్ణన్‌కు 24వ యుధ్‌వీర్ స్మారక పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద, మధ్య, ధనిక తేడా లేకుండా 90 శాతం మహిళలు వ్యభిచార వృత్తిలో బలవంతంగా ప్రవేశించిన వారేనని, కేవలం 10 శాతం మాత్రమే పొట్టకూటి కోసం ఆ వృత్తిలో దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వ్యభిచార వృత్తిలో సమారు 30 లక్షల మంది ఉండగా అందులో ఏడు శాతం మంది మాత్రమే బయట పడగలుతున్నారని చెప్పారు. ప్రతి 10 నిమిషాలకు ఒకరు అక్రమంగా అమ్మకానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సంస్థ ఇప్పటి వరకు సుమారు 15 వేల మంది యువతులను వ్యభిచార కూపం నుంచి విముక్తి చేసిందని వెల్లడించారు. నగరంలో తమకు రెండెకరాల భూమి చూపిస్తే.. అలాంటి వారికి పునరావాస కేంద్రంతో పాటు ప్యాక్టరీ ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తామని ఆమె వెల్లడించారు. తనకు ప్రపంచవ్యాప్తంగా 32 అవార్డులు వచ్చిన స్వంత రాష్ట్రంలో అవార్డు రావడం ఇదే ప్రథమమని అన్నారు. ఈ అవార్డు వ్యభిచార నరకకూపం నుంచి విముక్తి పొందిన, తనతో కలిసి పనిచేసే ఆడబిడ్డలకు అంకితమని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో యుధ్‌వీర్ ఫౌండేషన్ చైర్మన్ నరేంద్ర లూథర్, సామాజిక వేత్త జాహెద్ అలీఖాన్, ప్రీతమ్ సింగ్, బజరంగ్, ఖాన్ అతర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.