
ఆ చానళ్ల విషయంలో త్వరలో చర్యలు
* పత్రికా స్వేచ్ఛను హరిస్తే చూస్తూ ఊరుకోం: జవదేకర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నిలిచిపోయిన టీవీ9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానళ్ల ప్రసారాల పునరుద్ధరణ విషయంలో రెండు రోజుల్లో చర్యలు తీసుకోనున్నట్టు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. పత్రికా స్వేచ్ఛను హరిస్తే చూస్తూ ఊరుకోమన్నారు. మెదక్ ఉప ఎన్నిక ప్రచారం కోసం గురువారం హైదరాబాద్‌కు వచ్చిన ఆయనను బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ రెండు చానళ్ల సిబ్బంది, ఐజేయూ ప్రతినిధులు కలిశారు.
నిబంధనలకు విరుద్ధంగా ఎంఎస్‌వోలు ఆ రెండు చానళ్ల ప్రసారాలను నిలిపేశారని, పత్రికా స్వేచ్ఛను కాలరాస్తున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి వినతి పత్రాన్ని అందజేశారు. దీనికి స్పందించిన జవదేకర్ ఎన్నికల హడావుడి రెండు రోజుల్లో ముగుస్తుందని, ఆ తర్వాత తీసుకోబోయే చర్యలేంటో మీరే చూస్తారని వ్యాఖ్యానించారు. మీడియా కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జవదేకర్ సూచించారు.