స్టీఫెన్తో రేవంత్ సంభాషణల వీడియో విడుదల
హైదరాబాద్: ఏసీబీ అధికారులు పక్కా ఆధారాలతో తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాల్సిందిగా రేవంత్.. స్టీఫెన్ను కోరినప్పటి సంభాషణలను రికార్డు చేశారు. రేవంత్, స్టీఫెన్ల మధ్య 22 నిమిషాల పాటు సంభాషణలు సాగాయి. వీటిని వీడియోలో చిత్రీకరించారు. ఈ వీడియోను అధికారులు విడుదల చేశారు. మీకు రాజకీయంగా ఏలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటాం, ఒకవేళ మీకు సమస్య వస్తే.. ఏపీలో అవకాశం ఇప్పిస్తానని రేవంత్ రెడ్డి ప్రలోభ పెట్టినట్లు తెలుస్తోంది. జానారెడ్డి పనైపోయింది.. జైపాల్ రెడ్డి కూడా నాకు బంధువని, 17 మందిలో ఏ వ్యక్తి ఎవరికి ఓటు వేశారో తెలియదంటూ వివరించారు. 6 నెలల్లో పార్టీ ప్రెసిడెంట్ అవుతా.. మీకు ఎలాంటి ఢోకా ఉండదంటూ స్టీఫెన్ కు హామీఇచ్చారు. మీకు ఎంత డబ్బు కావాలో చెబితే ఇప్పుడే ఇచ్చెస్తాం, మా బాస్ తో మాట్లాడి మీకు ఏం కావాలో చెబితే ఫైనలైజ్ చేస్తానని రేవంత్ ఈ చర్చలో స్టీఫెన్ కు చెప్పుకొచ్చారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీల బలాబలాలు, ఎన్నికల ప్రక్రియ గురించి రేవంత్ ఈ భేటీలో స్టీఫెన్కు వివరించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి రేవంత్ మాట్లాడారు. స్టీఫెన్ను ప్రలోభపెట్టిన సంభాషణలు ఈ వీడియోల స్పష్టంగా వినిపించాయి. రేవంత్ ఎమ్మెల్యేకు గాలం వేస్తున్న విషయం గురించే ముందే సమాచారం తెలుసుకున్న ఏసీబీ పక్కాగా ఆధారాలు సేకరించింది. రేవంత్.. స్టీఫెన్కు 5 లక్షల రూపాయలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.