ఎమ్మెల్యేకు 5 కోట్ల ఆఫర్.. రేవంత్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్: తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నీచ రాజకీయాలకు పాల్పడుతోంది. తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు ఇతర పార్టీల ఎమ్మెల్యేలతో బేరసారాలకు తెరలేపింది. ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయింది. ఆదివారం తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేసేందుకోసం నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్కు డబ్బులు పంపిణీ చేస్తుండగా రేవంత్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. టీడీపీ అభ్యర్థికి ఓటు వేస్తే 5 కోట్ల రూపాయలు ఇస్తామని రేవంత్ రెడ్డి.. స్టీఫెన్ను ప్రలోభపెట్టినట్టు ఆరోపణలు వచ్చాయి. సికింద్రాబాద్లోని లాలాగూడలో స్టీఫెన్కు 50 లక్షల రూపాయలు ఇస్తుండగా పోలీసులు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసుల దగ్గర ఫోన్ సంభాషణలున్నట్టు సమాచారం. పోలీసులు రేవంత్ రెడ్డిని రహస్య ప్రాంతంలో విచారించారు.
తెలంగాణ శాసనమండలిలో 6 స్థానాలకు సోమవారం ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ తరపున ఐదుగురు, టీడీపీ-బీజేపీ కూటమి తరపున ఒకరు, కాంగ్రెస్ తరపున ఒకరు పోటీ చేస్తున్నారు. కూకట్పల్లి టీడీపీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు టీఆర్ఎస్లో చేరిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరికొంతమంది టీడీపీ ఎమ్మల్యేలు టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వనున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో తగిన సంఖ్యా బలం లేకపోవడంతో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు రేవంత్ రెడ్డి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ను ప్రలోభపెట్టినట్టు తెలుస్తోంది.