సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన కేసీఆర్ ఇప్పుడు పంట రుణాలు అంటూ మాట మారుస్తున్నారని శాసనమండలిలో తెలుగుదేశం సభ్యుడు అరికెల నర్సారెడ్డి తప్పు పట్టారు. శుక్రవారం మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో నర్సారెడ్డి మాట్లాడుతూ రైతు రుణాలు మాఫీ చేస్తామని కేసీఆర్ అనలేదంటే తాను ఉరేసుకుంటానని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. దీనిపై టీఆర్‌ఎస్ సభ్యుడు పాతూరి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ మేనిఫెస్టోలో చెప్పని అంశాలను సభ్యులు ప్రస్తావిస్తున్నారని పేర్కొన్నారు. డి.శ్రీనివాస్, రిజ్వీ తదితరులు ఈ చర్చలో పాల్గొన్నారు.