చంద్రబాబు ఆదేశాలకు ధిక్కారం!
హైదరాబాద్: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదేశాలను రంగారెడ్డి జిల్లాలో ఆరుగురు జడ్పిటిసి సభ్యులు ధిక్కరించారు. టీడీపీ జడ్పిటిసి సభ్యులను కాపాడుకోవడంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి విఫలమయ్యారు. టిఆర్ఎస్ జరిపిన బేరసారాలు ఫలించాయి. ఆ పార్టీ జడ్పిటిసి సభ్యురాలు, మంత్రి పట్నం మహేంద్ర రెడ్డి భార్య సునీత జడ్పీ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు.
తెలంగాణలో జరిగిన శాసనసభ ఎన్నికలలో చావుదెబ్బతిన్న కాంగ్రెస్, టిడిపిలు రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్ స్థానాన్నైనా గెలుచుకోవాలని తీవ్రంగా ప్రయత్నించాయి. జిల్లాస్థాయి నేతలు ప్రత్యర్థులతో కుమ్మక్కైనట్లు ప్రచారం జరగడంతో నేరుగా రాష్ట్ర స్థాయి నాయకులే రంగంలోకి దిగారు. గులాబీ వ్యూహానికి చెక్ పెట్టేందుకు ఆ రెండు పార్టీలు చేసిన ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు.
టిడిపి నేతలు ఆ పార్టీ రాష్ట్ర స్థాయి నేతల మాటలు కూడా వినలేదు. వారి ఆదేశాలను ధిక్కరించి ఆరుగురు టిడిపి జడ్పిటిసి సభ్యులు టిఆర్ఎస్లో చేరిపోయారు. దాంతో మంత్రి మహేంద్ర రెడ్డి భార్య సునీత గెలిచారు. వైస్ ఛైర్మన్‌గా కుత్బుల్లాపూర్ టిడిపి జడ్పిటిసి సభ్యుడు ప్రభాకర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. లోపాయికారిగా టీఆర్‌ఎస్‌కు మద్దతిచ్చినట్లు ప్రభాకర్ రెడ్డి తెలిపారు.