ఆదిలాబాద్ జిల్లాలో తొలి కరోనా కేసు  | Telangana: Adilabad District reports first corona virus case | Sakshi
Sakshi News home page

ఆదిలాబాద్ జిల్లాలో తొలి కరోనా కేసు 

Published Sat, Apr 4 2020 11:01 AM | Last Updated on Sat, Apr 4 2020 1:20 PM

Telangana: Adilabad District reports first corona virus case - Sakshi

సాక్షి,ఆదిలాబాద్‌: జిల్లాలో తొలి కరోనా పాజిటివ్‌ కేసు నమోదు అయింది. ఉట్నూరు మండలం హస్నాపూర్‌ గ్రామానికి చెందిన ఒకరికి (24) పాటిజివ్‌గా నిర్థారణ అయింది. అతడు ఇటీవలే ఢిల్లీ మర్కజ్‌లోని మత ప్రార్థనల్లో పాల్గొని తిరిగి వచ్చాడు. హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షల్లో అతడికి కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు వైద్యులు నిర్థారించారు. కాగా జిల్లాలో ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన 67 మందికి సంబంధించి నమూనాలను హైదరాబాద్‌కు పంపగా వాటి ఫలితాలు శనివారం వెలువడ్డాయి. కరోనా సోకిన వ్యక్తితో పాటు 15మంది కుటుంబ సభ్యులను ఆదిలాబాద్‌లోని క్వారంటైన్‌కు తరలించారు. (అనారోగ్యమా.. అయితే ఫోన్ చేయండి)

నమూనాలు హైదరాబాద్‌కు..
ఢిల్లీలోని మర్కజ్‌కు మత ప్రార్థనలకు వెళ్లి తిరిగి వచ్చిన వారి సంఖ్య 67మంది కాగా వారికి సంబంధించి స్వాబ్‌ నమూనాలు గురువారం హైదరాబాద్‌కు పంపించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే జిల్లాకు ఎక్కువ మంది మార్చి 18న ఢిల్లీ నుంచి తిరిగి వచ్చారు. వీరి స్వాబ్‌ నమూనాలను హైదరాబాద్‌కు పంపించినప్పటికీ అందరిని జిల్లా కేంద్రంలో ప్రభుత్వ క్వారంటైన్‌ సెంటర్‌లలో ఉంచడం జరిగింది. (మాస్క్ల్లేవ్.. మేం రాం!)

కుటుంబ సభ్యుల హోం క్వారంటైన్‌..
మర్కజ్‌ నుంచి తిరిగి వచ్చిన వారు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ క్వారంటైన్‌ సెంటర్‌లో ఉండగా వారి కుటుంబ సభ్యులను గుర్తించి హోం క్వారంటైన్‌ చేశారు. ఒక వేళ హైదరాబాద్‌ నుంచి వచ్చే నమూనాల ఫలితాల్లో ఎవరికైనా పాజిటివ్‌ ఉన్న పక్షంలో వారి కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు చేసే అవకాశం ఉంది. ఏదీ ఏమైనా కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోదానికి ఇటు అధికారులు, పోలీసులు, పారిశుధ్య కార్మికులు, ఆశా వర్కర్లు నిరంతరంగా శ్రమిస్తున్నారు. ప్రజల ప్రాణాలు రక్షించేందుకే వారు ప్రయత్నిస్తుండగా కరోనా కేసు అనుమానితులు వారికి సహకరించాలన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. కరోనా వైరస్‌ నివా రణపై అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. (హై రిస్క్ మహా నగరాలకే..!)

క్వారంటైన్‌కు ఏడుగురు యువకులు
బజార్‌హత్నూర్‌(బోథ్‌): హైదరాబాద్‌ నుంచి వచ్చిన మండలంలోని గిరిజాయి గ్రామానికి చెందిన ఏడుగురు యువకులను శుక్రవారం తహసీల్దార్‌ జాకీర్, ఎస్సై ఉదయ్‌కుమార్, ప్రభుత్వ వైద్యులు డాక్టర్‌ సురేష్‌ వైద్య పరీక్షలు చేసి ఈ నెల 14 వరకు గిరిజాయి గ్రామ సమీపంలోని కమ్యూనిటీ భవనంలో క్వారంటైన్‌ హోం చేశారు. తహసీల్దార్‌ మాట్లాడుతూ యువకులు వలస కూలీలుగా హైదరాబాదులో మేస్త్రీ పనులు చేస్తూ ఉపాధి పొందేవారని, మూడు నెలలు పనులు జరుగవేమోనన్న భయంతో రవాణా సౌకర్యాలు లేక హైదరాబాద్‌ నుంచి ఆరు రోజుల క్రితం కాలినడకన బయలుదేరి గురువారం రాత్రి 10గంటలకు బజార్‌హత్నూర్‌ చేరుకున్నారని తెలిపారు. (తెలంగాణలో ఒక్క రోజే 75 కేసులు)

వారిని రోడ్డుపై గుర్తించిన ఎస్సై ఉదయ్‌కుమార్‌ రాత్రి భోజనం పెట్టించి జిల్లా పరిషత్‌ సెకండరీ పాఠశాలలో వసతి ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉదయం వారందరికీ వైద్య పరీక్షలు చేయగా కరోనాకు సంబంధించి ఎలాంటి లక్షణాలు లేనప్పటికీ కొన్ని రోజుల వరకు హోం క్వారంటైన్‌లో ఉండాలని, జల్బు, జ్వరం, దగ్గు ఏ లక్షణాలు ఉన్నా మండల కేంద్రంలోని పీహెచ్‌సీకి రావాలని వారికి తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ పర్చ సాయన్న, ఏఎస్సై దామన్, వీఆర్‌వో ఆనీస్, సూపర్‌వైజర్‌ దేవిదాస్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement