
నువ్వొస్తానంటే.. నేను ఊరుకుంటానా!?
సాక్షి ప్రతినిధి నల్లగొండ : జిల్లాలో తెలుగు తమ్ముళ్ల మధ్య అంతర్గత పోరు మళ్లీ రచ్చకెక్కుతోంది. మోత్కుపల్లి తీరు వల్లనే పార్టీలో వర్గపోరు రాజుకుంటుందని ఆ పార్టీ నాయకులే మదనపడుతున్నారు. సఖ్యతగా ఉంటున్నామని గాంభీర్యంగా చెబుతున్నప్పటికీ సమయం వచ్చినప్పుడల్లా వారి మధ్య విభేదాలు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా మేళ్లచెర్వులో ఎన్‌టీఆర్ విగ్రహావిష్కరణ సందర్భంగా కొందరు నాయకులు హాజరుకాకపోవడం మరోమారు చర్చనీయాంశమైంది. పార్టీ శ్రేణులు నిర్వేదంతో నిండిపోయాయి. వాస్తవానికి ఆదివారం ఎన్‌టీఆర్ వర్ధంతి సందర్భంగా మేళ్లచెర్వులో విగ్రహావిష్కరణకు ఆ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత రేవంత్‌రెడ్డిని ఆహ్వానించారు. ఆయన హాజరవుతున్నట్లు నిన్నటివరకు సంకేతాలు కూడా అందాయి. కానీ రాత్రికి రాత్రే జరిగిన పరిణామాల ప్రభావం వల్ల ఆయన ఈ కార్యక్రమానికి దూరంగా ఉండిపోయారు.
మోత్కుపల్లి నర్సింహులు అభ్యంతర పెట్టడం వల్లనే రేవంత్‌రెడ్డి గైర్హాజరయ్యారని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. జిల్లాలో ఆది నుంచి టీడీపీలో వర్గపోరు కొనసాగుతూనే ఉంది. ఉమామాధవరెడ్డి ఒక వర్గానికి నాయకత్వం వహిస్తుండగా మరో వర్గానికి మోత్కుపల్లి నర్సింహులు నాయకుడిగా వ్యవహరించారు. గత సాధారణ ఎన్నికల్లో ఆయన ఖమ్మం జిల్లా మధిర నుంచి పోటీ చేయడంతో వారి మధ్య విభేదాలు ఇంతకాలం నివురుగప్పిన నిప్పు లా ఉన్నాయి. విగ్రహావిష్కరణ కార్యక్రమం లో ఉమామాధవరెడ్డితోపాటు ఇంతకాలం మోత్కుపల్లి వర్గం నాయకుడిగా గుర్తింపు ఉన్న పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, హుజూర్‌నగర్ నియోజకవర్గ ఇన్‌చార్జి వంగాల స్వామిగౌడ్ కూడా హాజరుకావడంతో పలువురు నాయకులు ప్లేటు ఫిరాయించినట్లు చర్చించుకుంటున్నారు.
టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీల్యానాయక్‌తో పాటు వివిధ నియోజకవర్గాల ఇన్‌చార్జులు పాల్వాయి రజినికుమారి, బంటు వెంకటేశ్వర్లు, చిలువేరు కాశీనాథ్, కంచర్ల భూపాల్‌రెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, పార్టీ నాయకులు నెల్లూరు దుర్గాప్రసాద్, రౌతు వెంకటేశ్వర్‌రావులు హాజరయ్యారు. మోత్కుపల్లి నాయకత్వాన్ని జిల్లాలోని పలువురు నాయకులు వ్యతిరేకిస్తుండడం గతంలోనే పార్టీ సభ్యత్వ నమోదు సందర్భంగా బయటపడింది. జిల్లాను వదిలి ఖమ్మం వలస వెళ్లిన మోత్కుపల్లి మధిరలోనే పార్టీ ఇంచార్జి బాధ్యతలు నిర్వహించాలని పలువురు నేతలు జిల్లాలో ఆయన జోక్యాన్ని వ్యతిరేకించారు. మళ్లీ ఆయన జిల్లాలో పార్టీ విషయాల్లో వేలు పెట్టరాదనిఅధినాయకత్వానికి సూచించారు. మరో మారు కింగ్‌మేకర్‌గా జిల్లాలో చక్రం తిప్పాలనుకున్న ఆశలు అడియాసలు కావడమే కాకుండా తన గ్రూపులో ఉన్న స్వామిగౌడ్ లాంటి వారు చేజారడంతో తనదైన శైలిలో స్పందించి రేవంత్‌రెడ్డి పర్యటనకు అడ్డు చెప్పారని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అమ్మ పెట్టదు... అడుక్కుతిననివ్వదు అన్నట్లు... పార్టీ తీరు మారిందని శ్రేణులు డోలాయమానంతో డీలా పడిపోయాయి.