సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం జూలైలో నిర్వహించనున్న వివిధ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సెట్స్)లలో ఉదయం సెషన్‌కు మధ్యాహ్నం సెషన్‌కు మధ్య 3 గంటల వ్యవధి ఉండేలా పరీక్షల సమయాన్ని ఖరారు చేయాలని నిర్ణయించినట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. కరోనా నేపథ్యంలో ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం పరీక్ష కేంద్రాలను శానిటైజ్ చేసేందుకు, కుర్చీలు, బెంచీలు కెమికల్‌తో శుభ్రపరిచేందుకు, ఆన్‌లైన్ పరీక్షలు అయినందున కంప్యూటర్, కీ బోర్డు, మౌస్ వంటివి శుభ్రపరిచేందుకు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఎంసెట్, ఎడ్‌సెట్, ఐసెట్, పీజీఈసెట్, లాసెట్ తదితర ప్రవేశ పరీక్షల్లో కొన్ని ఒకే సెషన్‌తో ముగియనుండగా, మరికొన్ని ఎక్కువ సెషన్లలో పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని వెల్లడించారు.
ఎంసెట్ పరీక్షను తీసుకుంటే 6 సెషన్లలో (ప్రతిరోజు ఉదయం ఒక సెషన్, మధ్యాహ్నం ఒక సెషన్) మూడ్రోజులపాటు పరీక్షలు నిర్వహించాల్సి వస్తుంది. అలాగే అగ్రికల్చర్ పరీక్షలను రెండు, మూడు సెషన్లలో, ఐసెట్, ఎడ్‌సెట్ వంటి వాటికి రెండేసి చొప్పున సెషన్లలో పరీక్షలను నిర్వహించాల్సి ఉంది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఒక సెషన్‌కు మరో సెషన్ మధ్య 2 గంటల వ్యవధి మాత్రమే ఉంది. ఇప్పుడుతాజాగా పరీక్షల తేదీలను మార్పు చేసిన నేపథ్యంలో 3 గంటల వ్యవధి ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు మరో సెషన్ పరీక్షలు నిర్వహించేలా షెడ్యూల్ జారీ చేశారు. అయితే పరీక్ష కేంద్రాల్లో శానిటైజేషన్ చర్యల కోసం మధ్యలో 3 గంటల సమయం ఉండేలా ఉదయం సెషన్ పరీక్షల సమయాన్ని మార్పు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఉదయం సెషన్ 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్ 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించేలా చర్యలు చేపడుతున్నట్లు పాపిరెడ్డి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment