జూపల్లి కృష్ణారావు (ఫైల్ ఫోటో)
సాక్షి, పెద్దపల్లి/హైదరాబాద్: ‘‘నేను.. జూపల్లి కృష్ణారావు మినిస్టర్‌ను మాట్లాడుతున్నా.. ఏం మాట్లాడుతున్నవ్...తమాషా చేస్తున్నవా...గంటలో ఐజీ ఫోన్ చేస్తడు.. ప్రభుత్వమంటే ఏంటో చూపిస్తా..’’అంటూ పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఓ సీఐని బెదిరించిన ఫోన్ సంభాషణ వైరల్ అవుతోంది. పెద్దపల్లి జిల్లా ధర్మారంలోని భూవివాదం విషయంలో మంచిర్యాల జిల్లా తాండూరు సీఐ జనార్దన్‌రెడ్డిని బెదిరించిన ఈ ఆడియో కలకలం రేపుతోంది. ‘‘ఏయ్ నీ పేరేంటి.. నీది ఏ స్టేషన్... చెప్పేది విను... ఈ నంబర్‌ను డీజీకి ఫార్వర్డ్ చేస్తా.. ఏం ఆధారాలున్నాయో చెప్పు..’’అని ఆ ఆడియోలో మంత్రి అన్నా రు.
శనివారం మంత్రి ఓఎస్డీ వీరారెడ్డికి సీఐ ఫోన్ చేసిన సందర్భంగా ఇది చోటుచేసుకొంది. ముందు వీరారెడ్డి మాట్లాడినా.. సంభాషణ మధ్యలో అకస్మాత్తుగా మంత్రి వచ్చారు. భూ వివాదంలో జోక్యం చేసుకొని స్టే ఇప్పించారని, అవతలి వ్యక్తులకు మద్ద తు పలుకుతున్నారంటూ వీరారెడ్డితో సీఐ వాగ్వాదానికి దిగారు. ‘‘ఆ భూమి మాది కాదని ఆర్డర్ అయినా ఇప్పించండి.. ఇదేం ధ ర్మం... న్యాయం’’అని సీఐ వాదనకు దిగారు. ఈ సమయంలో మంత్రి ఫోన్ తీసుకొన్నారు. ఈ విషయం తెలియక.. సీఐ కూడా కాస్త గట్టిగానే మాట్లాడారు. దీనిపై తీవ్రంగా ఆగ్రహించిన జూపల్లి తాను మంత్రి జూపల్లి కృష్ణారావును మాట్లాడుతున్నానంటూ మండిపడ్డారు.
సూసైడ్ చేసుకుంటాం..
ధర్మారంలోని తన సోదరి కొత్త లక్ష్మికి చెందిన స్థల వివాదంలో అవతలి పార్టీ వారికి వీరారెడ్డి మద్దతు పలుకుతున్నారని, రోజుల తిరబడి తిప్పుకుంటున్నారంటూ సీఐ ఫోన్‌లో ఆవేదన వ్యక్తంచేశారు. మీ డీజీకి నంబర్ ఫార్వర్డ్ చేస్తానని జూపల్లి చెప్పడంతో.. ‘‘నేను కూడా డీజీకి వివరిస్తా. ఏదైతే అదే అవుతుంది. సూసైడ్ చేసుకొని చస్తం.. ఏం చేస్తాం’’అని సీఐ పేర్కొన్నారు.
సీఐపై మంత్రి ఓఎస్డీ ఫిర్యాదు
మంత్రి ఓఎస్డీ వీరారెడ్డి సీఐ జనార్దన్‌రెడ్డిపై ఆదివా రం సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జనార్దన్‌రెడ్డి చేస్తున్న ఆరోపణలు, భూమి వ్యవహారానికి సంబంధించిన విషయాలను వివరించారు. తనను సీఐ భయబ్రాంతులకు గురిచేశాడని, వివిధ చానళ్ల లో వస్తున్న కథనాలు అవాస్తవమని, వాటిపైనా చర్యలు తీసుకోవాలన్నారు. జనార్దన్‌రెడ్డి గత నెల 30 నుంచి బెదిరింపులకు పాల్పడుతున్నాడని తెలిపారు.
ఇదీ వివాదం..
పెద్దపల్లి జిల్లా ధర్మారం పోలీసు స్టేషన్ ఎదురుగా ఉన్న సర్వే నంబర్ 262 నెంబర్‌లో నూనె నర్సయ్య అనే వ్యక్తికి 13 గుంటల పట్టా భూమి ఉంది. దాదాపు 30 సంవత్సరాల క్రితం ఇందులోంచి కోమటిరెడ్డి హన్మంతరెడ్డి అనే వ్యక్తికి ఆరు గుంటల పావు స్థలం విక్రయించాడు. రెండు సంవత్సరాల క్రితం నర్సయ్య మరణించగా ఆయన కుమారుడు నూనె శ్రీనివాస్ పేరిట మిగతా భూమిని మార్పిడి చేశారు. తర్వాత హన్మంతరెడ్డి కూడా ఆరున్నర గుంటల భూమిని తన కూతురు కొత్త లక్ష్మి పేరిట రిజిస్ట్రేషన్ చేయించి ఇటీవలే మరణించాడు.
కాగా 2016లో శ్రీనివాస్ ధర్మారం మండలం ఎర్రగుంటపల్లికి చెందిన బద్దం మల్లారెడ్డికి ఇందులో నుంచి రెండు గుంటల భూమిని విక్రయించగా.. ఆ భూమికి హద్దులుగా సిమెంట్ పిల్లర్లు ఏర్పాటు చేసుకున్నారు. దీంతో తన సోదరుడు తాండూరు సీఐ జనార్దన్‌రెడ్డి సహాయంతో లక్ష్మి తన బందువులతో కలిసి వెళ్లి సరిహద్దు రాళ్లను ధ్వంసం చేశారు. ఈ వివాదంలో ఇరువర్గాలపై ధర్మారం పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. లక్ష్మి ఆ భూమిలో ఇంటి నిర్మాణం చేసింది. దీంతో శ్రీనివాస్ మంత్రి జూపల్లిని ఆశ్రయించాడు. ఈ క్రమంలో మంత్రి పేషీ నుంచి పలుమార్లు ఇరువర్గాలను పిలిపించి విచారణ చేశారు. దీనిపైనే వివాదం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment