పతనం అంచున ప్రగతి రథం! | Telangana RTC in huge loss | Sakshi
Sakshi News home page

పతనం అంచున ప్రగతి రథం!

Published Tue, Jun 12 2018 1:44 AM | Last Updated on Sat, Aug 11 2018 4:59 PM

Telangana RTC in huge loss - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ వార్షిక ఆదాయం రూ.4,520 కోట్లు. ఇందులో వేతనాల కోసం వెచ్చించే మొత్తం దాదాపు రూ.2,300 కోట్లు. అంటే మొత్తం ఆదాయంలో ఈ పద్దు వాటా 51 శాతం. మొత్తం ఆదాయంలో వేతనాల వాటా సగానికి చేరువైందంటే ఆ సంస్థ పతనం అంచున ఉన్నట్టేనన్నది అంతర్జాతీయ సూత్రం. అలాంటిది ఆర్టీసీలో ఇప్పటికే సగానికి మించి నమోదవుతోంది. తాజాగా కార్మికులకు ప్రభుత్వం 16 శాతం మధ్యంతర భృతి ప్రకటించినా.. త్వరలో పూర్తిస్థాయి వేతన సవరణ చేయాల్సి ఉంది. ఇది అమల్లోకి వస్తే ఆ పద్దు వాటా మరింత పెరుగుతుంది. ఇప్పుడిదే తెలంగాణ ప్రగతి చక్రం భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంది. 

వేతన సవరణతో కుదేలే!  
గత వేతన సవరణతోనే ఆర్టీసీ యాజమాన్యం చేతులెత్తేసినందున తాజా వేతన సవరణ భారాన్ని పూర్తిగా ప్రభుత్వమే మోయాల్సి ఉంది. ఆదాయం పెంచుకునేందుకు సంస్కరణలు చేపడితే కార్మిక నేతలు అడ్డుకుంటారు. ఇతరత్రా వినూత్న ఆలోచనలు పట్కాలెక్కే పరిస్థితి కనిపించటం లేదు.. ఆ స్థాయిలో మేధోమథనం కూడా జరగటం లేదు. ఆర్టీసీ స్థలాల్లో పెట్రోలు బంకులు, బస్టాండ్లపై సినిమా థియేటర్ల నిర్మాణం వంటి ఆలోచనలు అంతగా కలిసిరాలేదు. ప్రభుత్వం నుంచి నామమాత్రపు సాయం తప్ప ఇప్పటి వరకు పెద్దగా అందింది లేదు.

ఇలాంటి తరుణంలో వేతన సవరణ ఆర్టీసీని పూర్తిగా కుదేలు చేయబోతోంది. వెరసి సంస్థ మనుగడే ప్రశ్నార్థకంగా మారనుంది. ఆర్టీసీ అప్పులు, పన్నుల భారం తదితరాల విషయంలో ప్రభుత్వం సాయం చేస్తుందని మంత్రుల కమిటీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే గత వేతన సవరణ సమయంలోనూ ఈ తరహా హామీలొచ్చినా... మూడేళ్లుగా అవి అమలు కాకపోవటం ఆందోళన కలిగించే విషయం. 

ఆర్టీసీ దుస్థితిని పరిశీలిస్తే.. 
- ఆర్టీసీ మొత్తం వ్యయం రూ.5,200 కోట్లు (2017–18) 
- ప్రతినెలా వేతనాల రూపంలో చేస్తున్న వ్యయం దాదాపు రూ.195 కోట్లు 
- డీజిల్‌ రూపంలో జరుగుతున్న వార్షిక వ్యయం రూ.1,250 కోట్లు.. వేతనాల తర్వాత అతిపెద్ద భారం ఇదే. మొత్తం వ్యయంలో దీని వాటా దాదాపు 22 శాతం. 
- ఆర్టీసీకి రూ.3,000 కోట్ల అప్పు ఉంది. ఇందుకు ప్రతినెలా రూ.250 కోట్ల వడ్డీని చెల్లిస్తోంది.  
- ప్రభుత్వ రంగ సంస్థనే అయినప్పటికీ ఆర్టీసీ నుంచి ప్రభుత్వం మోటారు వాహనాల పన్ను వసూలు చేస్తోంది. ఇది ప్రతినెలా రూ.230 కోట్ల వరకు ఉంటోంది. 
- ఏటా దాదాపు 5 కోట్ల లీటర్ల డీజిల్‌ వాడుతున్న ఆర్టీసీ.. దానిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నులు చెల్లించేందుకు నానా తంటాలు పడుతోంది. విమానాల ఇంధనంపై పన్నును ప్రభుత్వం 1 శాతానికి తగ్గించినా.. ఆర్టీసీ వాడే ఇంధనంపై పన్ను భారం తగ్గించలేదు. సాలీనా ఆర్టీసీ దాదాపు రూ.590 కోట్ల వరకు ఈ పన్ను చెల్లిస్తోంది.  
- గత నాలుగేళ్లలో పెరిగిన డీజిల్‌ ధరల వల్ల ప్రస్తుతం కిలోమీటరుకు రూ.5 చొప్పున (నాలుగేళ్ల క్రితంతో పోలిస్తే) అదనంగా భారం మోయాల్సి వస్తోంది.  
- ఆర్టీసీ వాడే టైర్లు, ఇతర యంత్ర పరికరాలకు సంబంధించి జీఎస్టీ రూపంలో మరో వంద కోట్లు చెల్లిస్తోంది.  
- రాయితీ బస్సు పాసులను పెద్ద మొత్తంలో జారీ చేస్తోంది. వీటి రూపంలో కోల్పోతున్న ఆదాయాన్ని ప్రభుత్వం ఆర్టీసీకి రీయింబర్స్‌ చేయాల్సి ఉంది. దీనికి సంబంధించి దాదాపు రూ.1,700 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి.  
- ప్రభుత్వం తలుచుకుంటే ఆర్టీసీపై వీటి భారం లేకుండా చేయొచ్చు. ఈ అంశాలను పరిశీలించేందుకు ఉన్నతస్థాయి కమిటీ వేస్తున్నట్టు మంత్రుల కమిటీ ప్రకటించింది. ఆ కమిటీ నివేదిక సమర్పిస్తే.. దాన్ని ప్రభుత్వం ఆచరణలోకి తీసుకొస్తే ఆర్టీసీ గట్టెక్కుతుంది. లేదంటే వేతనాలు చెల్లించేందుకు కొత్త అప్పులు చేయాల్సిందే.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement