
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి కరీంనగర్–ఆదిలాబాద్–నిజామాబాద్–మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పీఆర్టీయూ–టీఎస్ అభ్యర్థి కూర రఘోత్తంరెడ్డికి తెలంగాణ టీచర్స్ యూనియన్ (టీటీయూ) మద్దతు ప్రకటించింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మునగాల మణిపాల్‌రెడ్డి, ఏరుకొండ నరసింహస్వామి ప్రకటన విడుదల చేశారు. ఆయన గెలుపు కోసం కృషి చేయాలని తమ సంఘం ఉపాధ్యాయులకు వారు పిలుపునిచ్చారు. అలాగే రఘోత్తంరెడ్డితోపాటు నల్లగొండ–ఖమ్మం–వరంగల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న పీఆర్టీయూ–టీఎస్ అభ్యర్థి పూల రవీందర్‌కు ఉర్దూ టీచర్స్ అసోసియేషన్ (యూటీఏ) మద్దతు ప్రకటించింది. వారి గెలుపు కోసం తమ సంఘం కృషి చేస్తుందని సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఖాజా కుతుబుద్దీన్, షకీల్ అహ్మద్ తెలిపారు. తమ సంఘం అభ్యర్థులకు మద్దతు ప్రకటించడం పట్ల ఆయా సంఘాలకు పీఆర్టీయూ–టీఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీపాల్‌రెడ్డి, బీరెళ్లి కమలాకర్‌రావు ధన్యవాదాలు తెలిపారు.
చంద్రశేఖర్‌గౌడ్‌కు మద్దతు..
కరీంనగర్–నిజామాబాద్–ఆదిలాబాద్–మెదక్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గ్రూపు–1 అధికారుల సంఘం అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్‌కు పీఆర్టీయూ–టీఎస్ మద్దతు ప్రకటించింది. ఆయన గెలుపు కోసం తాము కృషి చేస్తామని శ్రీపాల్‌రెడ్డి, బీరెళ్లి కమలాకర్‌రావు పేర్కొన్నారు.