చార్మినార్ పోలీస్ స్టేషన్ వద్ద సీజ్ చేసిన వాహనాలు
సాక్షి, సిటీబ్యూరో: కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం ఉదయం వేళ కల్పించిన వెసులుబాటును అనేక మంది దుర్వినియోగం చేస్తున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ అనేక ప్రాంతాల్లో విచ్చలవిడిగా సంచరిస్తున్నారు. ఇలాంటి వారికి చెక్ చెప్పడానికి శాంతిభద్రతలు, ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఓపక్క చెక్‌పోస్టులు, మరోపక్క పికెట్ల వద్ద వాహనచోదకుల్ని ఆపి... ఆకారణంగా బయటకు వచ్చిన వారి నుంచి వాహనాలు స్వాధీనం చేసుకుంటున్నారు. ఇలా గడిచిన పది రోజుల్లో 10 వేలకు పైగా వాహనాలను సీజ్ చేశారు. తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడే వారిపై ఆయా సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు. మూడు పోలీసు కమిషనరేట్‌లో ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ (టీసీసీసీ) సిబ్బంది వివిధ జంక్షన్లు, ఇతర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ద్వారా ఇలాంటి ఉల్లంఘనుల్ని గుర్తించి ఈ–చలాన్లు జారీ చేస్తుండగా క్షేత్రస్థాయి అధికారులు ఆయా వాహనాలను ఆపి స్వాధీనం చేసుకుంటున్నారు. లాక్‌డౌన్ గత నెల 23న అమలులోకి రాగా.. అప్పటి నుంచి శుక్రవారం వరకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు మొత్తం 11,012 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
వీటిలో అత్యధికం ద్విచక్ర వాహనాలు కావడంతో యువకులే అకారణంగా రోడ్ల పైకి వస్తున్నట్లు నిర్ధారణ అవుతోందని చెప్తున్నారు. మరోపక్క ఫిజికల్ డిస్టెన్స్‌ను కచ్చితంగా అమలు చేయాలనే ఉద్దేశంలో ప్రభుత్వం లాక్‌డౌన్ ముగిసే వరకు ద్విచక్ర వాహనంపై ఒకరు, తేలికపాటి వాహనంగా పిలిచే కారులో గరిష్టంగా ఇద్దరు మాత్రమే ప్రయాణించడానికి అవకాశం ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అనేక మంది ఈ ఉత్తర్వుల్నీ ఉల్లంఘిస్తూ ద్విచక్ర వాహనాలపై ఇద్దరు సంచరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ తరహా వాహనచోదకులపై 9122 కేసులు నమోదు చేశారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులకు ఉల్లంఘించడం సహా వివిధ రకాలైన ఉల్లంఘనలకు పాల్పడిన వారినీ పోలీసులు నేరుగా, టీసీసీసీ ద్వారా గుర్తించి ఈ చలాన్లు జారీ చేస్తున్నారు. ఇలా జారీ చేసిన కాంటాక్ట్, నాన్–కాంటాక్ట్ ఎన్‌ఫోర్స్ మెంట్ చలాన్ల సంఖ్య శుక్రవారం నాటికి మూడు పోలీసు కమిషనరేట్లలో కలిపి 333,932కు చేరింది.
లాక్‌డౌన్ వైలేషన్స్‌కు పాల్పడిన వాహన చోదకులకు ప్రస్తుతం ట్రాఫిక్ పోలీసులు మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 179 కింద జరిమానా విధిస్తున్నారు. దీని ప్రకారం ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారికి రూ.600 జరిమానా పడుతోంది. అయితే తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై మాత్రం ఐపీసీలోని సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నారు. ప్రధానంగా సెక్షన్ 188 (ప్రభుత్వ ఆంక్షల్ని ఉల్లంఘించడం), సెక్షన్ 270 (ప్రాణాంతకమైన వ్యాధి మరొకరికి సోకేలా ప్రవర్తించడం), సెక్షన్ సెక్షన్ 271 (క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించడం) తదితరాల కింద రిజిస్టర్ చేస్తున్నారు. ఇలాంటి వారిని ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నా.. శాంతిభద్రతల విభాగానికి అప్పగిస్తున్నారు. ఈ తరహాకు చెందిన కేసులు ఇప్పటి వరకు మూడు కమిషనరేట్లలో కలిపి 328 నమోదు చేశారు. లాక్‌డౌన్ ముగిసిన తర్వాత వీరికి నోటీసులు జారీ చేసి, న్యాయస్థానాల్లో అభియోగపత్రాలు దాఖలు చేయనున్నారు. వీరిపై కోర్టులో నేరం నిరూపణ అయితే గరిష్టంగా రెండేళ్ల వరకు శిక్ష పడేందుకు ఆస్కారం ఉందని అధికారులు చెప్తున్నారు. సాధారణ రోజుల్లో కూడా పోలీసులు ఉల్లంఘనులపై కేసులు నమోదు చేస్తుంటారు. ప్రస్తుతం లాక్‌డౌన్ డేస్‌లో సాధారణ రోజులకంటే ఎక్కువగానే కేసులు నమోదు చేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment