
అనుమానాస్పద స్థితిలో చిన్నారి అదృశ్యం
పూడూరు : అనుమానాస్పద స్థితిలో ఏడాది వయసున్న ఓ చిన్నారి అదృశ్యమైన సంఘటన చన్గోముల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ నాగరాజు కథనం ప్రకారం.. పూడూరు మండల కేంద్రానికి చెందిన మాసగళ్ల శ్రీనివాస్, అనురాధ దంపతులు. వీరికి కుమార్తె పింకితో పాటు ఏడాది వయసున్న మరో కూతురు ఉంది. శుక్రవారం అనురాధ తన చిన్నకూతురుకు పాలుపడుతూ నిద్రకు ఉపక్రమించింది. కొద్దిసేపటి తర్వాత ఆమె నిద్రలేచి చూడగా చిన్నారి కనిపించలేదు.
పాప కోసం కుటుంబీకులు వెతికినా ఫలితం లేకుండా పోయింది. దీంతో సాయంత్రం శ్రీనివాస్ చన్గోముల్ పోలీసులకు పిర్యాదు చేశారు. ఎస్‌ఐ నాగరాజు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.